ఉల్లిగడ్డను కూరగాయాలతో కలిపి పచ్చికూరగా, వంట పదార్థాలకు రుచిని కల్పించడంలోనూ, సలాడ్లలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. కాబట్టి ఉల్లికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. అందుకే యాసంగి పంటగా ఉల్లిని సాగు చేసే రైతులు యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
విత్తే సమయం:
యాసంగి పంటగా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు, ఎండాకాలం పంటగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాటుకో వచ్చు. వాతావరణంలో పెద్దగా మార్పులేని ప్రాంతాలలో ఈ పంట ఎదుగుదల బాగుంటుంది.
నేలలు:
నీరు నిల్వని సారవంతమైన నేలలు అనుకూలం. ఉప్పు, చౌడు, క్షారత్వం, నీరు నిల్వ ఉండే నేలలు సాగు చేయడానికి పనికిరావు.
రకాలు:
బళ్ళారి రెడ్, రాంపూర్ రెడ్, వైట్ ఆనియన్, పూసా రెడ్, అర్కనికేతన్, అర్కకళ్యాణ్, అర్క ప్రగతి, కళ్యాణ్పూర్, రెడ్ రౌండ్, ఎన్-53, అగ్రిపౌండ్ లైట్రెడ్, అగ్రిపౌండ్ డార్క్‌రెడ్, తెలుపు రకాలైన పూసా వైట్ రౌండ్, పూసా వైట్ ప్లాట్.
బళ్ళారి రెడ్:
పాయలు పెద్దగా ఉంటాయి. పాయలు ఒకటిగానీ, రెండుగానీ కలిపిగాని ఉంటాయి. ఘాటు తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో అన్నిప్రాంతాలలో సాగు చేసుకునేందుకు అనుకూలం.
రాంపూర్ రెడ్:
బళ్ళారి రెడ్ రకం వలె ఉంటుంది. ఉత్తర భారత దేశంలో ప్రసిద్ధి. పాయలు పెద్దగా ఉండి ఘాటు ఎక్కువ ఉంటా యి. దిగుబడి తక్కువ. కానీ పాయలు తెల్లగా ఉంటాయి.
నాసిక్రెడ్:
పాయలు మధ్యస్థంగా ఉండి ఎరుపు రంగులో ఉంటాయి. ఘాటుగా ఉంటాయి.
అగ్రిపౌండ్ డార్క్‌రెడ్:
పాయలు ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా ఘాటుగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. పాయలు ఎరుపు రంగు లో మధ్యస్థంగా (70-90 గ్రాములు) ఉంటాయి. తక్కువ ఘాటుతో నిల్వ నాణ్యత ఎక్కువ. దిగుబడి ఎకరాకు దాదాపు 100-120 క్వింటాళ్లు వస్తుంది.
అర్కనికేతన్:
పాయలు ఎరుపు రంగుతో 100-180 గ్రాముల బరువు ఉంటాయి. టీఎస్ఎస్ 12-14 శాతం. నిల్వ నాణ్యత హెచ్చు. ఘాటు ఎక్కువ. దిగుబడి సుమారు 132 క్వింటాళ్లు ఎకరాకు వస్తుంది. వానకాలం, యాసంగి రెండింటికి ఈ రకం అనువైనది.
అర్కకళ్యాణ్:
పాయల బరువు 10-190 గ్రాములు. దిగుబడి 136 క్వింటాళ్లు ఎకరాకు వస్తుంది. ఆకుమచ్చ తెగులును కొద్దిగా తట్టుకుటుంది.
అర్క ప్రగతి:
120 రోజులలో కోతకు వచ్చే గుండ్రని ఎరుపు రకం. వానకాలం, యాసంగి పంటకు అనువైనది. దిగుబడి 130 క్వింటాళ్లు ఎకరాకు వస్తాయి.
కళ్యాణ్పూర్ రెడ్ రౌండ్:
ఎరుపు రకం. టీఎస్ఎస్ 13-14 శాతం, 130-150 రోజులలో కోతకు వచ్చి ఎకరాకు 100-120 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఎన్-53:
పాయలు మధ్యస్థ గుండ్రంగా, ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. దిగుబడి 100-120 క్వింటాలు ఎకరాకు వస్తుంది. పంట కాలం 140 రోజులు. ఇది వానకాలం పంటకు అనువైనది.
అగ్రిపౌండ్ లైట్రెడ్:
పాయలు చిన్నవిగా, గట్టిగా గులాబీ రంగు లో ఘాటుగా ఉంటాయి. నారు పోయకుండా విత్తనమే నేరుగా విత్తుకోవచ్చు. ఎక్కువరోజులు నిల్వ ఉండి రవాణాకు తట్టుకుంటాయి. ఎగుమతులకు అనువుగా ఉంటుంది. ఇవికాగా తెలుపు రకాలైన పూసా వైట్రౌండ్, పూసా వైట్ప్లాట్లు డీ హైడ్రేషన్‌కు అనువైనవి.
విత్తన మోతాదు: 3-40 కిలోలు
నారు పెంచడం:
నేలను బాగా దున్ని 120 సెం.మీ.ల వెడల్పు, 3 మీటర్ల పొడవు గల ఎత్తైన నారుమళ్ళను తయారుచేసుకోవా లి. 2-2.5 కిలోల విత్తనంను 200-250 చదరపు మీటర్ల నారుమడిలో పెంచిన నారు ఒక ఎకరాలో నాటడానికి సరిపోతుంది. విత్తనశుద్ధి తప్పకుండా చేసుకోవాలి. (3 గ్రాముల కాప్టాన్ లేదా థైరమ్ కిలో విత్తనానికి) నారుమడిలో విత్తనాన్ని పల్చుగా వరుసలలో పోయాలి. నారుకుళ్ళు తెగులు సోకకుండా పది రోజలకు ఒకసారి కాపర్ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారు పెరుగుదల దశలో రసం పీల్చే పురుగు ఆశించకుండా కార్బోప్యూరాన్ 3జి గుళికలు నారుమడిలో చల్లి నీరు కట్టాలి.
నారునాటడం:
రెండు, మూడుసార్లు దుక్కి దున్ని పొలాన్ని చదును చేయాలి. బోదెలు 30 సెం.మీ.ల ఎడంలో చేసి బోదెకు రెండు వైపులా నాటుకోవాలి. నారును ఒక శాతం బోర్డోమిశ్రమంలో ముంచి నాటడం వలన నారుకుళ్ళు సోకకుండా ఉంటుంది.
కలుపు నివారణ అంతరకృషి:
నాటే ముందు ప్లూక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు ఒక లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30 శాతం ఎకరాకు 1.3-1.6 లీటర్లు లేదా ఆక్సీప్లోరోపిన్ 23.5 శాతం 200 మి.లీ.ల చొప్పు న ఏదో ఒకదానిని నాటేముందు పిచికారీ చేయాలి. లేదా నాటిన 2, 3 రోజులలో తేమ ఉన్నప్పుడు ఎకరాకు ఆక్సీప్లోరోఫిన్ 23.5 శాతం 200 మి.లీ.లను 200 లీటర్లలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30-45 రోజుల మధ్య మళ్ళీ కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. నారు నాటిన 75 రోజుల తర్వాత మాలిక్ హైడ్రాజడ్ 0.25 శాతం (2.5 గ్రాముల/ లీటర్ నీరు) ద్రావణాన్ని చల్లడం వల్ల ఉల్లిగడ్డ మొలకెత్తడం వలన కలిగే నష్టం బాగా తగ్గుతుంది. నారు నాటిన 100-110 రోజులకు 1 గ్రాము కార్బండిజమ్ లీట రు నీటికి కలిపి పిచికారీ చేస్తే నిల్వలో ఉల్లిగడ్డ కుళ్ళడం చాలా వరకు తగ్గుతుంది.
ఎరువులు:
ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 60-80 కిలోల నత్రజని, 24-32 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి. వేరుశనగ పిండి లేదా ఆముదం పిండి వేసి మట్టిని ఎగదోయడం వలన ఎక్కువ దిగుబడి వస్తుంది. నత్రజనిని రెండు దఫాలుగా నాటినప్పుడు, నాటిన 30 రోజుల తర్వాత వేసుకోవాలి. నత్రజనితో పాటు పొటాష్ రెండు దఫాలుగా వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది.
నీటి యాజమాన్యం నాటిన 60 రోజుల వరకు 12-15 రోజుల వ్యవధిలో 4,5 తడులు ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో 6-7 రోజుల వ్యవధిలో 8 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజులు ముందుగా నీరు పెట్టడం ఆపివేయాలి.
సస్యరక్షణ :
తామరపురుగులు: ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వలన తెల్లటి మచ్చలేర్పడతాయి. దానితోపాటు ఆకు లు, కాడలపై ఉదా రంగు మచ్చలు కూడా ఏర్పడుతాయి. వీటి నివారణకు డైమిథోయేట్ లేదా ఫిప్రొనిల్ 2 మి.లీ.లు, మాంకోజెబ్ 3 గ్రాములు లీగర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి.
పచ్చపురుగు: ఉల్లిలో ఆకుతినే పచ్చ పురుగు నివారణకు కార్బరిల్ 3 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ.లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఉల్లిలో ఆకుమచ్చ తెగులు: ఆకులపై ఉదా రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు తెగులు ఉధృతి ఎక్కువవుతుంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్, మాంకోజెబ్ కలిపిన మందును 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
– ధాన్యపు పంటలతో పంటల మార్పిడి చేయాలి ఎకరాకు 80 కిలోల చొప్పున వేపపిండిని వేయడం వలన నులి పురుగులు, నేలలోని శిలీంద్రాలు నాశనం అవుతాయి.
– పొలంలో అక్కడక్కడా పసుపు రంగు పూసిన డబ్బాలు (జిగురు, గ్రీజు పూసిన) ఎకరాకు రెండు చొప్పున పెట్టాలి. తామర పురుగుల నివారణకు జెట్ నాజిల్ పంపుతో నీటిని జల్లాలి.
– రసంపీల్చే పురుగుల నివారణకు అల్లిక రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5 శాతం వేపగింజల ద్రావణంను పిచికారి చేయాలి.
పంటకోత ఆరబెట్టడం:
గడ్డలు పీకడానికి ముందు నీరుకట్టడం ఆపివేయాలి. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెం.మీ.ల కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తర్వాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరబెట్టాలి. 50 శాతం ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు.
క్యూరింగ్:
క్యూరింగ్ వలన పొర రంగు అభివృద్ధి చెందుతుంది. 3,4 రోజులు పొలం మీదే ఎండబెట్టిన తర్వాత 10-12 రోజు లు నీడలో ఎండబెట్టి తర్వాత నిల్వ చేస్తే నష్టం చాలావరకు తగ్గుతుంది, వానకాలంలో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండదు అందువల్ల సూర్యరశ్మి ద్వారా క్యూరింగ్ చేయవచ్చు. పరిపక్వం గానీ చిన్నచిన్న పాయలను ఎప్పుడు నిల్వ ఉంచరాదు. సుమా రు 4-6 సెం. మీల ఆకారం కలిగిన మధ్యస్థమైన పాయలు మంచి నిల్వ గుణం కల్గి ఉంటాయి. తదుపరి మార్కెట్ తరలించి అమ్మకాలు చేసుకోవచ్చు.