ప్రతి ఇంటిలో, ప్రతి వంటలోనూ వాడే ఓ సాధారణ పదార్థం.. ఉల్లిపాయ. అయితే, చాలామంది వీటిని వంటతోపాటు జుట్టు సంరక్షణకే పరిమితం చేస్తారు. కానీ, సౌందర్య పోషణలోనూ ఉల్లిపాయలు ఎంతో కీలకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని మెరిపించడంలోనూ, మొటిమల్ని తగ్గించడంలోనూ సమర్థంగా పనిచేస్తాయని అంటున్నారు.
ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, యాంటి సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవన్నీ కీలకంగా పనిచేస్తాయి.
సూర్యరశ్మి వల్ల వచ్చే ట్యాన్, నల్లటి మచ్చల్ని తగ్గించడంలో ఉల్లిపాయ రసం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసంలో మరో టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని, సున్నితంగా మర్దనా చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే.. ముఖ వర్ఛస్సు మెరుగుపడుతుంది.
రక్త ప్రసరణను పెంచడంతోపాటు ముఖాన్ని కాంతిమంతంగా మార్చడంలో ఉల్లిపాయల్లో లభించే క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్లు ముందుటాయి. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో అర టీస్పూన్ ఉల్లిపాయ రసం, పావు టీస్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా మెరిసిపోతుంది.
ఉల్లిపాయలోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు.. మొటిమలను తగ్గించడంలో తోడ్పడతాయి. ఇందుకోసం ఒక టీస్పూన్ ఉల్లిపాయ రసంలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాసి, 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
ఉల్లిపాయల్లోని ఫైటోకెమికల్స్.. చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతాయి. కొద్దిగా ఉల్లిపాయ రసం తీసుకొని.. దూదితో ముఖానికి బాగా అప్లయి చేయాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే.. చర్మం బిగుతుగా మారుతుంది.