“ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయి” అని మహాకవి గురజాడ అప్పారావు వందేళ్లకు పూర్వమే హెచ్చరించాడు. అయినా మనవాళ్లు మేల్కోలేదు. దేశంలో ఊబకాయం పెరుగుతున్నట్టే అనేక రోగాల పీడితులూ పెరిగిపోతున్నారు. మన జీవనశైలిలో ఆటల్లేకపోవడమే ఈ సమస్యలకు కారణమని అనేక సర్వేలు తేల్చాయి. ‘మందగించక ముందు అడుగేయి… వెనుకబడితే వెనుకేనోయి’ అని అందరినీ కదిలిస్తూ హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆవిర్భవించింది. పరుగుని ప్రమోట్ చేస్తూ, రన్నర్స్‌కి శిక్షణనిస్తూ, ప్రజలనూ ఉరకలెత్తిస్తున్నది. ‘చెట్టపట్టాల్ వేసుకుని నగర వాసులు పరుగెత్తవలెనోయి’ అంటూ పిలుపునిస్తున్నది. పదండి పోదాం హైదరాబాద్ మారథాన్‌కి!
ఏ జబ్బుకి సంబంధించిన వార్త చదివినా, సర్వే, అధ్యయనం, పరిశోధన.. ఇవన్నీ చెప్పేదొక్కటే! వ్యాయామం లేకపోవడమే అసలు సమస్య అని తెలుస్తుంది. సమయం లేక కాదు. ఉన్న సమయాన్ని ఆటలకు కేటాయించాలనే స్పృహ లేక! పెద్దలే కాదు పిల్లలు కూడా ఆటలకు దూరమయ్యారు. ఈ సమాజాన్ని ఆటలవైపు నడిపిస్తూ, ఆడే సంస్కృతిని పెంపొందించాలని హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఏర్పడింది. ఈ సంస్థ పరుగు ప్రారంభించినప్పటి నుంచి పరుగెత్తే వాళ్లను కూడగడుతున్నది. శిక్షణనిస్తూ రన్నర్స్‌ని ప్రమోట్ చేస్తున్నది. అలాగే సామాజంలో ఆడాలని, పరుగెత్తాలనే ఆసక్తి పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. ఆ సంస్థ చేపట్టే కార్యక్రమాల్లో అతిపెద్ద వేడుక
హైదరాబాద్ మారథాన్.

ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్ మారథాన్ 15వ ఎడిషన్‌ని హైదరాబాద్ వీధుల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ‘ఎన్ఎండీసీ హైదాబాద్ మారథాన్ 2026’ మనవాళ్లలో రన్నింగ్ పట్ల ఆసక్తిని పెంచే వేడుక మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఇమేజ్‌ని పెంచే క్రీడా సంబురం కూడా! ఇది భారత దేశంలో జరిగే రెండో అతిపెద్ద మారథాన్! గతేడాది నిర్వహించిన హైదరాబాద్ మారథాన్‌కి వరల్డ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సిల్వర్ మెడల్ ప్రదానం చేసింది. అంతపెద్ద ఈవెంట్ కాబట్టే ఈ సంవత్సరం ఇందులో పాల్గొనేందుకు 32 వేల మంది రన్నర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఏడు వేలమంది విదేశీ క్రీడాకారులున్నారు! ఎక్కడెక్కడి వాళ్లో ఇక్కడికొచ్చి పరుగెత్తితే మన వాళ్లకు వచ్చే మేలేమిటనే సందేహం అందరికీ ఉంది. ఇది నిజంగా మనవాళ్లను ట్రాక్‌లోకి దించాలని ఏర్పడిన సంస్థ. కాబట్టి హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనడమే కాదు, రోజూ పరుగెత్తుతూ ఉండాలని రన్నర్స్ సొసైటీ ప్రతి ఆదివారం సిటీలో ఏదో ఒక చోట లాంగ్ రన్ నిర్వహిస్తూ ఉంది. రోడ్ల మీద ఇలా రన్నింగ్ చేస్తున్న గుంపులని చూసి కొత్తవాళ్లు కూడా అందులో చేరుతున్నారు. ఇలా పెరుగుతున్న రన్నర్స్‌లో మెరికల్లాంటి వాళ్లను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఐరోపా, అమెరికాలో ఆటలు జీవన శైలిలో భాగం. మన దగ్గర పరిస్థితి వేరు. విద్యాసంస్థలు, కమ్యూనిటీలో ఆటలకు ప్రోత్సాహం తక్కువ. కాబట్టి మెరికల్లాంటి రన్నర్స్‌ని గుర్తించి చిరుతల్లా తయారు చేసేందుకు ‘కోచ్ టు 5కె’ అనే ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నది హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ. వారంలో మూడు రోజుల చొప్పున మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఇందులో శిక్షణ పొందిన ఏడు వేల మంది తెలంగాణ పిల్లలు హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి వచ్చిన క్రీడాకారులతో కలిసి పరుగెత్తే ఈ వేడుక హైదరాబాద్ నగరానికి గుర్తింపుని తెస్తుందని హైదరాబాద్ రన్నర్స్ సోసైటీ సభ్యుడు పీవీఎస్ ప్రసాద్ అంటున్నారు. ‘పర్యావరణ అనుకూల వేడుకగా దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. పరుగెత్తేవాళ్లను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో మ్యూజిక్ ప్లేయర్స్, సింగర్స్, బ్యాండ్స్ దారిపొడవునా రన్నర్స్‌ని ఉత్సాహపరిచే ప్రదర్శనలిస్తారు. ఈ క్రీడా వేడుకలో మారథాన్‌తోపాటు హాఫ్ మారథాన్, 10కె రన్, 5కె రన్ కూడా ఉంటాయి. 18 నుంచి 78 ఏళ్ల వయసు వాళ్లు ఈ పరుగుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వైకల్యం ఉన్నా పరుగెత్తే ఉత్సాహంతో మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొనేందుకు వస్తున్నారు. ఆరోగ్యం, ఆయుః ప్రమాణం పెరగడమే కాదు ఆర్థిక ప్రగతికీ ఇది దోహదపడే వేడుక. రెస్టారెంట్, హోటల్, ట్రావెల్ రంగాలకు మేలు చేస్తుంది. ఇది విజయవంతమైతే మన నగరానికి గుర్తింపు వస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఈ సిటీ మనది. అందరూ రండి. ఆనందంగా పాల్గొనండి’ అని హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ తరపున ఆహ్వానిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం చలో హైదరాబాద్ మారథాన్!