శ్రావణ మాసమంతా లక్ష్మీదేవిదే. పూజలూ పునస్కారాలూ, వ్రతాలూ వాయనాలూ… అన్నీ అమ్మవారి చుట్టే. బంగారాన్ని పూజలో పెట్టుకునే సంప్రదాయమూ మన దగ్గర ఉంది. ఏవీ కుదరక పోతే కనీసం చిన్న లక్ష్మీ కాసు అయినా సరే కొంటారు చాలామంది మహిళలు. అయితే దాన్ని చక్కగా లాకెట్లా వేసుకునే వీలు కల్పించేలా, ఇప్పుడు ‘లక్ష్మీకాసు పెండెంట్లు’ తయారవుతున్నాయి. కాసు చుట్టూ డిజైన్ వచ్చి, గొలుసులో గుచ్చుకునే వీలు కల్పించేలా వెనకవైపు హుక్ ఉండేలా వీటిని రూపొందిస్తున్నారు.
పైన చిన్న దుద్దులాగా రాళ్లు వచ్చి అటూ ఇటూ ఆకులు ఉండేవీ, చుట్టూ రాళ్లు నగిషీలు ఉండేవీ, నెమళ్ల డిజైన్లు కలగలసినవి… ఇలా విభిన్న రకాలు వీటిలో రూపొందుతున్నాయి. ఒక్క పొర ఉండే చెయిన్కు వేసుకున్నా, ముత్యాలూ కెంపుల్లాంటి పూసల్లో గుచ్చుకున్నా సింపుల్గా అందంగా కనిపిస్తుండటంతో ఈ ఏడాది శ్రావణ మాసం ఈ కాసులే ముందు వరుసలో నిలుస్తున్నాయి. నిజమే ఒక్క కాసు కొనుక్కున్నా చిన్న నగలా పెట్టుకోగలగడం ఎవరికైనా నచ్చే అంశమే మరి!