ఖాళీని పూరించకండి..
‘ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా పని చేసుకోరాదు’ అని చిన్నప్పటినుంచి చాలాసార్లు విన్నాం. నేడు ఇది కుడి-ఎడమైంది. ఇప్పుడంతా.. ‘అలా ఫోన్ చూస్తూ కూర్చోపోతే.. కాసేపు ఊరికే కూర్చోరాదు’ అనేంతలా మారిపోయాం.
‘ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా పని చేసుకోరాదు’ అని చిన్నప్పటినుంచి చాలాసార్లు విన్నాం. నేడు ఇది కుడి-ఎడమైంది. ఇప్పుడంతా.. ‘అలా ఫోన్ చూస్తూ కూర్చోపోతే.. కాసేపు ఊరికే కూర్చోరాదు’ అనేంతలా మారిపోయాం. రోజులో అందరికీ 24 గంటలే ఉంటాయి. కానీ ‘నాకు టైమే లేదు’ అనేవాళ్లు
మాత్రం చాలామంది. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. సమయం లేక కాదు, దొరికిన ప్రతి క్షణాన్నీ ఏదో ఒక పనితో నింపేస్తున్నాం. అరక్షణం ఖాళీ దొరికినా.. ఫోన్ తీసి సోషల్ మీడియాలో దూరేస్తాం. ఎవరో పంపిన వీడియో చూస్తాం. ఏదో మెసేజ్ చదువుతాం. మొత్తానికి ఖాళీగా ఉండలేకపోతున్నాం. ఈ క్రమంలో మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయాన్ని కోల్పోతున్నాం.
నిశ్శబ్దంగా, కదలకుండా కూర్చున్నంత మాత్రాన.. ఏమీ చేయనట్టు కాదు. బయటికి కనిపించక పోయినా.. మన మెదడు మాత్రం అప్పుడే తన అసలు పని మొదలుపెడుతుంది. రోజంతా చూసిన విషయాలను ఒకచోట చేరుస్తుంది. విన్న మాటలను జ్ఞాపకాలుగా దాచుకుంటుంది. అర్థం కాని విషయాలకు సమాధానాలు వెతుకుతుంది. అందుకే చాలామందికి స్నానం చేస్తుంటే మంచి ఆలోచనలు వస్తాయి. కిటికీ బయటికి చూస్తూ కూర్చుంటే.. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది యాదృచ్ఛికం కాదు. మనసుకు కాసేపు దొరికిన స్వేచ్ఛతో వచ్చిన పరిష్కారం.
మన దగ్గర సమయం లేదని అనుకుంటాం. నిజానికి సమయం ఉన్నా.. దాన్ని అనుభవించే తీరిక, అవకాశం లేదు. ప్రతి ఖాళీ సమయాన్ని ఏదో ఒక సమాచారంతో ఆక్రమించేలా చేస్తున్నాం. వీడియో అయిపోకముందే ఇంకో వీడియో. ఒక పోస్ట్ పూర్తికాకముందే మరో పోస్ట్. నిజానికి మన మెదడును మన బొటనవేలే నియంత్రిస్తున్నది. రీల్స్/షార్ట్స్ వచ్చాకా.. మనసు, మెదడు పనితీరును పూర్తిగా మార్చేసింది. ఇలా నిరంతరం సమాచారం వస్తూనే ఉంటే.. మెదడుకు ఊపిరి తీసుకునే అవకాశం తగ్గిపోతుంది. తెలిసే విషయాలు పెరుగుతాయి. కానీ, వాటి గురించి ఆలోచించే సమయం తగ్గిపోతుంది.
‘బోర్ కొడుతున్నది’ అనే ఫీలింగ్ రాకముందే.. చేతిలోకి మొబైల్ తీసుకుంటున్నాం. అయితే, నిజానికి బోర్ కొడుతున్న భావన పెద్ద శిక్ష కాదు. అది కొత్త ఆలోచనలకు ద్వారం. చిన్నప్పుడు బోర్ కొట్టిందనే కారణంతోనే.. ఎన్నో ఆటలు పుట్టాయి. కాగితపు పడవలు, గాలిపటాలు, గోలీలు, బొమ్మలు.. వీటన్నిటినీ ఖాళీ సమయమే నేర్పించింది. ఊహించుకునే శక్తి కూడా అలాంటి సమయంలోనే పెరుగుతుంది. పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా అదే వర్తిస్తుంది. అందుకే, మనసుకు పని మాత్రమే కాదు.. విరామం కూడా అవసరం.
అనునిత్యం ఏదో ఓ శబ్దం మధ్యే ఉంటున్నాం. మాట్లాడే వాళ్లు, మోగే ఫోన్లు, నడిచే టీవీలు, వచ్చే నోటిఫికేషన్లు.. ఇవి చాలవన్నట్లు తోచనప్పుడు వినోదానికి పాటలు! ఇలా, తీరిక సమయాన్ని కూడా స్క్రీన్, సౌండ్స్తో నింపేసుకుంటే.. ఈ హడావుడిలో మన ఆలోచనల శబ్దమే మూగబోతోంది. రోజులో పది నిమిషాలైనా ఫోన్ను పక్కన పెట్టి కూర్చోవడం అలవాటు చేసుకుంటే.. మొదట్లో అసౌకర్యంగా అనిపించొచ్చు. కానీ, కొద్దిరోజుల తర్వాత అదే సమయం మనసుకు ఎంతో తేలికను ఇస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

