ఆడపిల్ల చదువొద్దు. ఆడపిల్ల ఆడొద్దు.ఆడపిల్ల అభివృద్ధి చెందొద్దు. ఇంకెన్నాళ్లు? ఈ వివక్ష… అంటూ సమాజాన్ని నిలదీసి,గిరిగీసి నిలిచి గెలిచింది ఆ అమ్మాయి. చదువెందుకని అన్న చేతులే ఇప్పుడామె ఎదుగుదలను చూసి చప్పట్లు కొడుతున్నాయి.
జార్ఖండ్‌లో దాహు అనే కుగ్రామం. అంతటా ఉన్నట్టే ఇక్కడకూడా ఆడపిల్ల పుడితే అరిష్టమన్న దురభిప్రాయం ఉంది. ఆ ఊర్లోనే పుట్టి పెరిగింది సీమాకుమారి. చాలా పేద కుటుంబం. ఉన్న అరెకరం పొలంలో వాళ్లమ్మ వ్యవసాయం చేసేది. నాన్న ఓ ఫ్యాక్టరీలో కార్మికుడు. తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులు. చదువు ఆవశ్యకత వాళ్లకు తెలియదు. ఒకవేళ తెలిసినా పేదరికం వాళ్లను అంతకంటే ఎక్కువగా ఆలోచించనీయదు. సీమా కుమారికి పెండ్లి చేస్తే ఓ బరువు తగ్గుతుందన్న అభిప్రాయం తల్లిదండ్రులది. బాల్య వివాహాలు అక్కడ సర్వసాధారణం. సీమ ‘ససేమిరా’ అన్నది. ‘మీరు చదువుకోలేదు. నేను చదువుకోవద్దు. నా పిల్లలు చదువుకోవద్దు. ఇంకెన్నాళ్లీ వివక్ష?’ అని ప్రశ్నించింది. ‘నాకు పెండ్లికన్నా చదువే ముఖ్యం’ అని ముఖం మీదే చెప్పింది. తల్లిదండ్రులు అవాక్కయ్యారు. బలవంతపు పెండ్లి చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. కానీ, సీమ వాటన్నిటినీ పటాపంచలు చేసింది.
ఫుట్‌బాల్ కోచ్‌గా..
పేదింటి ఆడబిడ్డలను అక్కున చేర్చుకునే విద్యాలయం ఉందక్కడ. అదే ‘యువ పాఠశాల’. ఆడపిల్లల అభ్యున్నతికోసం కృషి చేస్తూ వారిని చదువులు, ఆటలు, ఇతర వ్యాపకాల్లో ముందుండేలా ప్రోత్సహించడమే ఈ పాఠశాల ఉద్దేశం. పెండ్లికన్నా చదువు ముఖ్యమని తేల్చిచెప్పిన సీమను, 2012లో యువ పాఠశాల చేరదీసింది. అక్కడ సీమకు చదువుతోపాటు ఆటలపై మక్కువ ఏర్పడింది. ముఖ్యంగా ఫుట్‌బాల్. చాలా తక్కువ సమయంలోనే మేటి ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది సీమ. కోచ్‌గా కూడా రాణిస్తున్నది. ఓ దశలో ఆటల్లోనూ వివక్ష ఎదురైంది. షార్ట్స్ ధరించి ఆడటం పట్ల స్థానికులు కామెంట్ చేసేవాళ్లు. అన్నిటినీ మౌనంగా భరించింది.
హార్వర్డ్ పిలుపు
చదువులోనూ, ఫుట్‌బాల్‌లోనూ రాణిస్తున్న సీమ, ఇంటర్మీడియెట్ మంచి మార్కులతో పాసైంది. సీమ టాలెంట్‌ను గుర్తించి ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ తమ ఆవరణలో ఉన్నత చదువులు చదవమంటూ ఆహ్వానం పంపింది. స్కాలర్షిప్ ప్రకటించింది. ఆడబిడ్డను చదివించడం వల్ల కలిగే ప్రయోజనాలకు సీమ ఒక చక్కటి ఉదాహరణ. ఆమె తెగువకు, ప్రతిభకు సెలబ్రిటీలు సైతం సెల్యూట్ చేస్తున్నారు.