నేనెప్పటికీ ఆట మౌనికనే!
డ్యాన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అందరినీ అలరించిన తెలంగాణ ఆడబిడ్డ మౌనిక. సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యంలో లేని సమయంలోనే తన నృత్యంతో అందరి మనసుల్ని దోచి ఆట మౌనికగా స్థిరపడిపోయింది. పెండ్లి, పిల్లలు అంటూ దాదాపు పదేండ్లు కెమెరాకు దూరమైన మౌనిక మళ్లీ సీరియల్స్ ద్వారా తన అభిమానులను అలరిస్తున్నది.
డ్యాన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అందరినీ అలరించిన తెలంగాణ ఆడబిడ్డ మౌనిక. సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యంలో లేని సమయంలోనే తన నృత్యంతో అందరి మనసుల్ని దోచి ఆట మౌనికగా స్థిరపడిపోయింది. పెండ్లి, పిల్లలు అంటూ దాదాపు పదేండ్లు కెమెరాకు దూరమైన మౌనిక మళ్లీ సీరియల్స్ ద్వారా తన అభిమానులను అలరిస్తున్నది. జీ తెలుగు ఆట షో ద్వారా పాపులర్ అయిన మౌనిక మళ్లీ అదే చానెల్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’లో విలన్‌గా అలరిస్తున్న ‘ఆట’ మౌనిక జిందగీతో పంచుకున్న ముచ్చట్లు..
మాది తెలంగాణలోని బెల్లంపల్లి. మా తాతయ్య, నాన్న, మామయ్య.. అందరూ సింగరేణి ఉద్యోగులే. చిన్నప్పటినుంచే పాట వినిపిస్తే చాలు డ్యాన్స్ చేసేదాన్ని. పెండ్లి బారాత్‌లలో, ఫ్యామిలీ వేడుకల్లో.. ఇరగదీసేదాన్ని. నా ఆసక్తిని గమనించి ఇంట్లోవాళ్లు డ్యాన్స్ నేర్పించడం మొదలుపెట్టారు. అప్పటినుంచి డ్యాన్స్ నా జీవితంలో భాగమైంది. బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ డ్యాన్స్ షో జరిగినా నా ప్రదర్శన తప్పకుండా ఉండేది. నాలుగో తరగతి చదువుతున్నప్పుడే ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత డ్రామా జూనియర్స్, ఆట 3లో పాల్గొన్నా. ఆట టైటిల్ నెగ్గడం, తదుపరి సీజన్‌కి మెంటర్‌గా వ్యవహరించడంతో నా పేరుముందు ‘ఆట’ వచ్చి చేరింది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా ఆట మౌనికగానే గుర్తిస్తారు. ఎన్ని షోలు చేసినా, ఎన్ని సీరియల్స్‌లో నటించినా ఆట ఆల్వేస్ నా ఫేవరేట్.
సీరియల్స్‌లో..
డిగ్రీలో ఉన్నప్పుడు రెండు మూడు సీరియల్స్‌లో నటించా. ఆ తర్వాత నన్నెంతగానో ప్రేమించే మా అమ్మమ్మకు ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆమె కండ్లముందే నేనో ఇంటిదాన్ని కావాలనే ఉద్దేశంతో పెండ్లిచేశారు. అలా నా పెండ్లి జరిగిపోయింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టడంతో పూర్తిగా పరిశ్రమకు దూరమయ్యా. సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్‌గా ఉండకపోవడంతో నా గురించి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. దాదాపు పదేండ్ల తర్వాత జీ తెలుగు ‘కల్యాణ వైభోగమే’ సీరియల్‌తో రీ ఎంట్రీ ఇచ్చా. ఇన్నాళ్లు ఏమైపోయానో కూడా తెలియని నేను మళ్లీ కనిపించడంతో అందరూ షాకయ్యారు. ఆ సీరియల్ తర్వాత ‘దేవతలారా దీవించండి’ చేశా. ప్రస్తుతం ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’లో విలన్ పాత్ర పోషిస్తున్నా.
కష్టంగానే ఉంది..
మా ఆయన ప్రాజెక్ట్ మేనేజర్. మా అత్తామామ కూడా బెల్లంపల్లిలోనే ఉంటారు. ఇద్దరు పిల్లలతో కెరీర్ మేనేజ్ చేయడం కష్టంగానే ఉంది. డైరెక్ట్‌గా లేకపోయినా పరోక్షంగా ఫ్యామిలీ నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది. అమ్మానాన్న, అత్తామామ, భర్త, బంధువులు.. అందరూ ప్రోత్సహిస్తారు. ఫ్యామిలీ, సీరియల్స్ బ్యాలెన్స్ చేస్తున్నా. నిజానికి కష్టంగానే ఉన్నా.. ఇష్టంతో చేస్తున్నా. సీరియల్స్‌లో టైమింగ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి. కానీ, సినిమా కంటే సీరియల్స్‌లో చేయడమే చాలా కంఫర్ట్. ఇక్కడ అందరూ ఓ కుటుంబంలా ఉంటారు. కానీ సినిమా దగ్గరికి వస్తే ఎవరూ ఎవర్ని పట్టించుకోరు. అందుకే, ఎప్పుడూ సినిమాల్లో నటించాలని కోరుకోవడం లేదు. డ్యాన్స్ అకాడమీ పెట్టాలని ఉంది. ఎక్కడికి వెళ్లినా చాలామంది అడుగుతుంటారు. కానీ, నేనే ధైర్యం చేయలేకపోతున్నా. కంఫర్ట్ జోన్లో ఉండేందుకే ఇష్టపడతా. సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్‌గా ఉండను. నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఇంతగా లేదు. కానీ, ఈరోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కరోజులో పాపులారిటీ సంపాదించి స్టార్ అయిపోతున్నారు. మాకు వచ్చిన పేరు మా కష్టంతో వచ్చిందని నమ్ముతాను. ఆ ఫేమ్‌ని అలాగే నిలబెట్టుకోవడానికి మరింత శ్రమిస్తాను.
నెగెటివ్ రోల్స్ ఇష్టపడతా..
రీ ఎంట్రీ తర్వాత నేను చేసిన మూడు పాత్రలు నెగెటివ్ షేడ్స్ ఉన్నవే. నాకు కూడా నెగెటివ్ పాత్రల్లో చేయడమే ఇష్టం. అలాంటి పాత్రల్లోనే నటనకు ఆస్కారం ఉంటుంది. నెగెటివ్ పాత్రలే అయినా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటా. డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ముఖం,కళ్లల్లో హావభావాలు పలికించడం సులభం.
– హరిణి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

