బస్‌స్టాప్‌లో ఉన్నప్పుడో లేదా మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడో.. ఎవరో ఓ వ్యక్తి స్టయిలిష్ కళ్లద్దాలు పెట్టుకొని మీవైపే చూస్తుంటే ‘ఆ అద్దాలు ఎంత బాగున్నాయో’ అని అనుకుంటాం. కానీ, ఆ అద్దాల వెనక ఓ చిన్న కెమెరా దాగి ఉందని.. అందులో మీ కదలికలన్నీ రికార్డ్ అవుతున్నాయని తెలుసుకోలేకపోతాం. అమెరికా, బ్రిటన్ దేశాల్లోని మహిళలకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. ‘స్మార్ట్ గ్లాసెస్’ పేరుతో కొందరు వ్యక్తులు రహస్యంగా వీడియోలు తీస్తూ నెట్టింట పెడుతున్నారు.
విదేశాల్లో మొదలైన ఈ గూఢచారి ట్రెండ్ త్వరలోనే మనకూ పాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. గతంలో రహస్య కెమెరాలు అంటే హోటల్ గదుల్లోనో లేదా వాష్ రూమ్స్లోనో ఉండేవి. కానీ, ఇప్పుడు అవి కళ్ల ముందే తిరుగుతున్నాయి. మెటా, రే-బాన్ లాంటి బ్రాండ్ల స్మార్ట్ గ్లాసెస్ చూడటానికి సాధారణ కళ్లద్దాల లాగే కనిపించినా మనకు తెలియకుండానే మన కదలికలను రికార్డు చేస్తాయి. ఈ అద్దాలతో వీడియో తీస్తున్నప్పుడు ఓ చిన్న ఎల్ఈడీ లైట్ వెలుగుతుంది. కానీ, ఆ లైట్ గురించి తెలిసినవాళ్లు అది కనిపించకుండా ప్లాస్టర్ వేయడమో లేదా సాఫ్ట్వేర్ మార్చడమో చేస్తున్నారు.
వీటిని పెట్టుకొని మహిళలకు తెలియకుండానే వారిని ఫోకస్ చేస్తూ వీడియోలు తీసి అశ్లీల సైట్లలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి ట్రాప్ నుంచి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఒకవ్యక్తి అలా మిమ్మల్నే చూస్తున్నాడంటే వెంటనే అతను పెట్టుకున్న అద్దాల ఫ్రేమ్ చివరన చిన్న రంధ్రం (Lens) ఉందేమో గమనించి అలర్ట్ అవ్వండి. అనుమానాస్పదంగా రికార్డ్ చేస్తున్నట్టు అనిపిస్తే వెంటనే ప్రశ్నించండి. బహిరంగ ప్రదేశాల్లో ప్రైవసీ ఉల్లంఘన జరిగితే వెంటనే అధికారులను సంప్రదించండి. స్మార్ట్ గ్లాసెస్ అద్భుతమైన ఆవిష్కరణే కావచ్చు. కానీ, తప్పుడు వ్యక్తుల చేతిలో అవి ప్రమాదకరమైన ఆయుధాలు. టెక్నాలజీ ఇచ్చే సౌకర్యాలను వాడుకుంటూనే, అది తెచ్చే ముప్పునూ గుర్తించాలి.