ఇటీవల న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఓ విదేశీ మహిళ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఫ్రాన్స్‌కు చెందిన ఆ యోగా టీచర్ పేరు చార్లెట్ చోపిన్. వయసు 101 సంవత్సరాలు. ఈ శతాధిక వృద్ధురాలు అవార్డు ప్రదానోత్సవానికి సంప్రదాయ చీరకట్టులో విచ్చేశారు. ఆమె పేరు పిలవగానే చకచకా నడుచుకుంటూ వెళ్లి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
చార్లెట్ బాల్ రూమ్ డ్యాన్సర్‌గా కెరీర్‌ని మొదలుపెట్టారు. డ్యాన్స్ చేసేటప్పుడు గాయాలపాలైన ఆమెకు మూడుసార్లు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. వాటి నుంచి కోలుకొనే క్రమంలోనే చిన్నప్పుడు తాను చూసిన యోగాను మార్గంగా ఎంచుకున్నారు. 50 ఏండ్ల వయసులో యోగ సాధన మొదలుపెట్టారు. అప్పట్నుంచీ యోగమార్గమే ఆమె జీవితంగా మారిపోయింది. యాభై ఏండ్లుగా యోగాభ్యాసం చేస్తూ… ఎందరికో గురువుగా ఆసనాలు నేర్పిస్తున్నారు. వందేండ్ల వయసు దాటిన ఈ బామ్మ తన ఫిట్నెస్ రహస్యం యోగా అని చెబుతారు. ఫ్రాన్స్‌లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ క్రమంలో చార్లెట్ పద్మశ్రీ అందుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.