ఎంఆర్ఐ స్కానింగ్ ప్రైవేట్‌కు అప్పగింత!
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఎంఆర్ఐ సేవలను విస్తరించేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానాన్ని అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
- సర్కార్ దవాఖానల్లో పీపీపీ మాడల్ అమలు
- మహబూబ్‌నగర్ జీజీహెచ్‌లో పైలట్ ప్రాజెక్ట్
- పేషెంట్లకు ఉచితంగానే సేవల కొనసాగింపు
- ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఎంఆర్ఐ సేవలను విస్తరించేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానాన్ని అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ విధానాన్ని తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌కు విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పీపీపీ విధానంలో ఎంఆర్ఐ సేవలు అమలు చేసినప్పటికీ, ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేషెంట్లకు ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా అందుతాయని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం కోటిలోని టీజీఎంఎస్ ఐడీసీ కార్యాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో ఎంఆర్ఐ సేవల నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై డాక్టర్లు, అధికారుల బృందం ఇతర రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసింది.
ఆ స్టడీ వివరాలు, పీపీపీ విధానంతో పేషెంట్లకు కలిగే ప్రయోజనం, రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించే అవకాశాలపై చర్చించారు. ప్రస్తుతం అమలవుతున్న విధానంతో పోలిస్తే, పీపీపీ విధానంలో ప్రభుత్వానికి సుమారు 20% మేర ఖర్చు తగ్గుతుందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ దవాఖానతోపాటు వరంగల్‌లోని ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, భూపాలపల్లి జీజీహెచ్‌ల్లో మాత్రమే ఎంఆర్ఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఈ సదుపాయం లేదు. రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జీజీహెచ్‌ల్లో ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తీసుకొనిరావాలని మంత్రి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

