హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): శ్వాస ఆడటం లేదా.? ఆక్సిజన్ సిలిండర్లు దొరుకక ఆందోళన చెందుతున్నారా? ఎక్కువ ధరకు లభించినా ఆక్సిజన్ సిలిండర్లను ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు తరలించడం కష్టమవుతున్నదా? అయితే ఇక టెన్షన్ వద్దు. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఆక్సిజన్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ పై ఫ్యాక్టరీ వినూత్న పరికరాన్ని ఆవిష్కరించింది. సైన్స్ సూత్రాల ఆధారంగా ఆక్సిజన్ తయారీకి మిర్కో రియాక్టర్‌ను రూపొందించింది. శానిటైజర్లలో విస్తృతంగా వినియోగించే ద్రావణం హైడ్రోజన్ పెరాక్సైడ్. దీనిని రసాయన విశ్లేషణ చేసి విడగొట్టినప్పుడు ఆక్సిజన్‌తోపాటు హైడ్రోజన్ ద్రావణం ఏర్పడుతుంది. లీటరు నాణ్యమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం నుంచి 24 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చని పై ఫ్యాక్టరీ సహ వ్యవస్థాపకుడు ప్రవీణ్ గోరకవి తెలి పారు.
10 లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ పోర్టబుల్ ఆక్సిజన్ తయారీ మిర్కో రియాక్టర్ ద్వారా ఏకకాలంలో ఇద్దరికి.. సుమారు 12 గంటలపాటు ఆక్సిజన్‌ను అందించే వెసులుబాటు ఉన్నది. దీని ధర రూ.2500 మాత్ర మే. ఒకవేళ రియాక్టర్‌లోని రిఫిల్ అయిపోతే మరొకదానితో ఫిల్ చేసి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. రిఫిల్ ఖరీదు రూ.1500 మా త్రమే ఉంటుందని ప్రవీణ్ తెలిపారు. త్వరలోనే దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అనుమతులు వస్తే 50 వేల నుంచి లక్ష యూనిట్లను స్వల్పకాల వ్యవధిలో ఉత్పత్తి చేయగలమని తెలిపారు. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లే వెసులుబాటు కూడా ఉన్నది.