సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ సర్కార్ కాదని.. ‘కమీషన్' సర్కార్ అని మరోసారి నిరూపితమైంది. చోటామోటా నేతల నుంచి ముఖ్యనేత వరకు ప్రతి ఒక్కరూ అందినకాడికి దోచుకుంటున్నారని ఇప్పటికే అనేకసార్లు బట్టబయలైంది. ఇన్నాళ్లూ మంత్రుల స్థాయి అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టర్లు సచివాలయంలోపల ధర్నాలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
- కమీషన్ ఇచ్చేందుకు ఒప్పుకొంటేనే ప్రాజెక్టులు
- ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ ఎండీ నామా రమేశ్ ఆరోపణలు
- సీఎం మౌఖిక ఆదేశాలతోనే పనుల నిలిపివేత
- హెచ్జీఎల్ రేడియల్ రోడ్ల టెండర్లలో అక్రమాలు
- రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెండింగ్ బిల్లులు
- వీటిని చెల్లించేందుకు భారీగా కమీషన్ డిమాండ్
- ఈ స్థాయిలో అక్రమాలు ముందెన్నడూ చూడలేదు
- ఇలాగే ఉంటే తెలంగాణలో కాంట్రాక్టర్లు మిగలరు
- బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు నామా లేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ సర్కార్ కాదని.. ‘కమీషన్’ సర్కార్ అని మరోసారి నిరూపితమైంది. చోటామోటా నేతల నుంచి ముఖ్యనేత వరకు ప్రతి ఒక్కరూ అందినకాడికి దోచుకుంటున్నారని ఇప్పటికే అనేకసార్లు బట్టబయలైంది. ఇన్నాళ్లూ మంత్రుల స్థాయి అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టర్లు సచివాలయంలోపల ధర్నాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీదే నేరుగా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇవి చేసింది ఎవరో అనామకుడు కాదు.. ప్రముఖ ఆర్వీఎం నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నామా రమేశ్. రాష్ట్రంలో కమీషన్ పాలన నడుస్తున్నదని, వెంటనే జోక్యం చేసుకోవాలంటూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ)కు లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ దేశ రాజకీయాల్లో, జాతీయ స్థాయిలో నిర్మాణ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
అందరికీ తెలిసినా గప్చుప్
తెలంగాణలో టెండర్లు దకించుకోవాలన్నా, చేసిన పనులకు బిల్లులు పొందాలన్నా సీఎం రేవంత్రెడ్డి 15 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని నామా రమేశ్ తన లేఖలో పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనని స్పష్టంచేశారు. అయినా ఏ ఒక మంత్రిగానీ, ఎమ్మెల్యేగానీ నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా కమీషన్లు చెల్లించే కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రమే క్లియర్ అవుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు. నిర్మాణ రంగంలో బిడ్డింగ్ నుంచి పనులు పూర్తి చేసి అప్పగించడం వరకు తనకు 35 ఏండ్ల అనుభవం ఉన్నదని పేర్కొన్నారు. తాను వందలాది టెండర్లలో పాల్గొన్నానని వెల్లడించారు. అయినా ఈ స్థాయిలో అక్రమాలు జరిగినట్టుగా తనకు ఇంతకుముందెన్నడూ చూడలేదని అసహనం వ్యక్తంచేశారు.
తెలంగాణలో కాంట్రాక్టర్లు మిగలరు
రాష్ట్రంలో సర్టిఫైడ్ బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్లకు దాదాపు రూ.20 వేల కోట్లు రావాల్సి ఉన్నదని నామా రమేశ్ పేర్కొన్నారు. కొన్ని బిల్లులు మూడేండ్లుగా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. బిల్లులు రాక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక అనేక మంది కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చికుకున్నారని వాపోయారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బిల్లులను విడుదల చేయడానికి భారీ మొత్తంలో కమీషన్లు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే తెలంగాణలో కాంట్రాక్టర్లు మిగిలే పరిస్థితి ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే పూర్తయిన బిల్లులు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని, అయినా కొత్త టెండర్లను ఎందుకు ఆహ్వానిస్తున్నదో అర్థం కావడం లేదని తెలిపారు. మరోవైపు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా కేవలం మౌఖిక ఆదేశాలతోనే అనేక పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని వాపోయారు. సీఎం మౌఖిక ఆదేశాల మేరకే ప్రాజెక్టులు నిలిపివేసినట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు కొనసాగుతాయో, నిలిపివేస్తారో? స్పష్టత ఇవ్వకుండా పనితీరు, బ్యాంకు గ్యారెంటీలు (పీబీజీ), ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ల (ఈఎండీ) గడువును పొడిగించాలని సంబంధిత శాఖలు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేస్తున్నాయని తెలిపారు.

రేడియల్ రోడ్లలోనూ అవినీతి?
హెచ్ఎండీఏలోని హెచ్జీసీఎల్లో రేడియల్ రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. రేడియల్ రోడ్-2 కోసం ఇటీవల మూడు ప్యాకేజీల్లో టెండర్లను ఆహ్వానించినట్టు గుర్తుచేశారు. సాధారణంగా ఇలాంటి టెండర్లలో 10-12 కంపెనీలు పోటీ పడుతాయని, కానీ ఈసారి నలుగురు బిడ్డర్లు మాత్రమే పాల్గొన్నారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డితో ముందస్తుగా ఒప్పందాలు చేసుకున్న కంపెనీలే బరిలోకి దిగాయనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు. టెండర్లలో పాల్గొనాలని భావించిన ఇతర కంపెనీలకు, కాంట్రాక్టర్లకు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుశీ ఇన్ఫ్రా ముందుకు వచ్చి, టెండర్లు వేసిందని, ఏమాత్రం ప్రాధాన్యత లేని కారణాన్ని చూపి, ఆ కంపెనీని అనర్హంగా ప్రకటించారని, ఈ టెండర్లలో రూ.600 కోట్ల వరకు గోల్మాల్ జరిగిందని తెలిపారు.
వెంటనే జోక్యం చేసుకోండి
రాష్ట్రంలో నెలకొన్న ఈ అవినీతి విధానానికి, కమీషన్ల దందాకు అడ్డుకట్ట వేయడానికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగాలని నామా రమేశ్ తన లేఖలో కోరారు. ప్రభుత్వ శాఖలు, రాజకీయ పార్టీలకు ఎలాంటి కమీషన్లు ఇవ్వకుండా, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందేలా ఒక పారదర్శక విధానాన్ని తీసుకొచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. టెండర్లు కూడా అర్హతలు ఉన్న కంపెనీలకే వచ్చేలా పారదర్శక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఆన్లైన్, గ్లోబల్ టెండర్ల పేరిట అధికారులు చేసే జిమ్మిక్కులతో వందలాది మంది కాంట్రాక్టర్లు రూ. వేల కోట్ల ప్రాజెక్టులను కోల్పోతున్నారని తెలిపారు. రాజకీయ నాయకులు కమీషన్ల ఆశతో ప్రాజెక్టులను తమకు కావాల్సిన కంపెనీలకు కట్టబెట్టి, రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే బీఏఐ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

