మిషన్ భగీరథలో కీలక పోస్టులు ఖాళీ
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన మిషన్ భగీరథ పథకం ఇన్చార్జి అధికారుల పాలనలో కునారిల్లుతున్నది. అత్యధిక కీలకాధికారుల పోస్టులన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.
- ఇన్‌చార్జులతోనే నిర్వహణ
- 4 సీఈ, 45 ఈఈ పోస్టులు ఖాళీ
- గాడితప్పిన తాగునీటి సరఫరా
- సమ్మెబాటలో ఉద్యోగులు
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన మిషన్ భగీరథ పథకం ఇన్చార్జి అధికారుల పాలనలో కునారిల్లుతున్నది. అత్యధిక కీలకాధికారుల పోస్టులన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఉన్నవారికే అదనపు బాధ్యతలను అప్పగించి నెట్టుకొస్తున్నారు. ప్రమోషన్లు కల్పించండి మహాప్రభో.. అంటూ ఆ శాఖ ఇంజినీర్లు మొత్తుకుంటున్నా రేవంత్ సర్కార్ పెడచెవిన పెడుతున్నది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది.
అరకొర సిబ్బందితో తాగునీటి సరఫరా సవాల్‌గా మారింది. ఎల్ నినో ప్రభావంతో మరిన్ని దారుణ పరిస్థితులు ఏర్పడుతాయని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగడమే కాదు.. త్వరలోనే నిరవధిక సమ్మె బాట పట్టేందుకు అధికారులు, సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. అదే జరిగితే తాగునీటి సరఫరా వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉన్నది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రధాన పట్టణాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నది.
కృష్ణా బేసిన్లో 16, గోదావరి బేసిన్లో 20 ప్రధాన రిజర్వాయర్ల ద్వారా ఏటా 40 టీఎంసీల జలాలను తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారు. నీటి సరఫరా కోసం 1.70 లక్షల కిలోమీటర్లు పైపులైన్ల నెట్‌వర్క్‌తోపాటు, 150 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 62 పంపింగ్ స్టేషన్లు, 35,573 ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, 27 ఇంటేక్ వెల్స్‌ను ఏర్పాటుచేశారు. ఎలక్ట్రిక్ మోటర్లు, పంపింగ్ సిస్టమ్‌ల ద్వారా నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయాల్సి ఉన్నది.
కీలక పోస్టులన్నీ ఖాళీ
ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ ఇప్పటికీ కాంట్రాక్టు ఏజెన్సీ పరిధిలోనే ఉండగా, ప్రభుత్వం నుంచి పర్యవేక్షణకు ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటైంది. ఎప్పటికప్పుడు కొత్త కనెక్షన్లు, మరమ్మతులు, రిజర్వాయర్ల నీటి నిల్వలు, సరఫరా వ్యవస్థ మానిటరింగ్ చేయడం ఆ విభాగం విధి. ప్రస్తుతం ఆ శాఖలో కీలకమైన చీఫ్ ఇంజినీర్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈఎన్సీ పోస్టు గతంలోనే ఖాళీ కాగా, ప్రస్తుతం ఎక్స్‌టెన్షన్‌పై ఆయననే కొనసాగిస్తున్నారు.
9 మంది సీఈ (చీఫ్ ఇంజినీర్లు)కు గాను ప్రస్తుతం ఐదుగురు సీఈలు మాత్రమే ఉండగా, 4 వేకెన్సీలోనే ఉన్నాయి. 20 ఎస్ఈ పోస్టుల్లో ఒకటి మాత్రమే ఖాళీ ఉన్నది. ప్రధానంగా ఎక్కువగా క్షేత్రస్థాయిలో ఉండే 78 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) పోస్టులకు గాను కేవలం 33మంది మాత్రమే రెగ్యులర్ అధికారులున్నారు. అందులో 15 మందికిపైగా కేవలం హెడ్ ఆఫీస్‌లోనే ఉండిపోవడం గమనార్హం. క్షేత్రస్థాయిలో 18 మంది ఈఈలే విధులు నిర్వహిస్తున్న దుస్థితి నెలకొన్నది. దీంతో దాదాపు 50 మందికిపైగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈ) ఈఈలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఇతర సాంకేతిక పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. కీలకమైన ఈఈ పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు అందుబాటులో లేక ప్రస్తుత సిబ్బందిపై పనిభారం గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటికీ ఈ విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ గైడ్‌లైన్స్ లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ఈ విభాగం పరిస్థితి మొత్తం అధ్వానంగా మారింది.
గాడితప్పిన పాలన
మిషన్ భగీరథ పథకంలోని ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగంలో పాలన పూర్తిగా గాడితప్పింది. కీలకమైన ఇంజినీరింగ్ పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు అందుబాటులో లేక ఉన్న సిబ్బందిపైనే పనిభారం గణనీయంగా పెరుగుతున్నదని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేశారు. వాస్తవంగా నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలంటే నిరంతర పర్యవేక్షణ అవసరం. సత్వర నిర్ణయాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కిందిస్థాయి సిబ్బందికి సత్వర మార్గదర్శనాలు కీలకం.
ప్రస్తుతం ఒకే అధికారి రెండుచోట్ల అదనపు బాధ్యతలను నిర్వహిస్తుండటం మూలంగా పర్యవేక్షణ పూర్తిగా సన్నగిల్లుతున్నది. సమర్థవంతమైన సేవలను అందించలేని దుస్థితి నెలకొంటున్నది. సత్వర నిర్ణయాలు రాక పనులు పెండింగ్‌లో పడుతూ తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. సాధారణంగా వేసవిలో తాగునీటికి సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉండటం పరిపాటి. కానీ ప్రస్తుతం ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే అనేక చోట్ల తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నీటిఎద్దడి ఉన్న ప్రాంతాల గుర్తింపు, బోర్‌వెల్స్ ఏర్పాటు చేయడం, లేదంటే ప్రత్యామ్నాయ తాగునీటి వసతులను కల్పించడం తదితర పనులపై ఈ విభాగం ఇప్పటినుంచే ప్రారంభించింది.
సిబ్బంది లేమీతో ఆ పనులేవీ ముందుకు సాగడం లేదు. మున్ముందు మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నదని ప్రభుత్వమే హెచ్చరికలు జారీచేస్తున్నది. దీంతో ఆ విభాగం ఇంజినీర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అరకొర సిబ్బందితో తాగునీటి సరఫరా కష్టసాధ్యమని తేల్చిచెప్తున్నారు. సరఫరాకు సంబంధించిన సవాళ్లను సమర్థంగా ఎదురోవాలంటే శాఖలో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండటంతో పాటు పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలని ఇంజినీర్లు డిమాండ్ చేస్తున్నారు.
పట్టించుకోని సర్కార్.. సమ్మెబాటలో ఇంజినీర్లు
ప్రమోషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యమే కీలకస్థానాలు ఖాళీగా ఉండేందుకు కారణమని తెలుస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తాగునీటి విభాగంలోని ఇంజినీర్ల సీనియారిటీ జాబితాలు మారిపోయాయి. ఆ తర్వాత 2018లో పెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చాక సీనియారిటీ జాబితాలను ఖరారు చేశారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పడిపోయాయి. ప్రస్తుతం కోర్టు వివాదాలన్నీ ముగిసిపోయాయి. అయినా ప్రభుత్వం ఇప్పటికీ ఆ విభాగంలోని ఇంజినీర్ల సీనియారిటీ జాబితాలను ఖరారు చేయడమే లేదు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం సత్వరం స్పందించి సీనియారిటీ జాబితాలను ఖరారు చేసి, ప్రమోషన్లు కల్పించాలని ఇంజినీర్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ప్రభుత్వ పెద్దలకు కలిసి గోడు వెల్లబోసుకున్నారు. అయినా రేవంత్ సర్కార్ నుంచి స్పందన లేకుండా పోయిందని ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీనియర్లు ఇంజినీర్లు ప్రమోషన్లను పొందకుండానే విరమణ పొందాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. కరువు నేపథ్యంలో నిరంతరాయ సేవలు కొనసాగాలంటే సత్వరం కీలక స్థానాలను భర్తీ చేయాలని, అదనపు పనిభారాన్ని తప్పించాలని కోరుతున్నారు. ఉద్యోగులకు న్యాయంగా అందాల్సిన ప్రమోషన్లు సకాలంలో కల్పించడం ద్వారా సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని విన్నవిస్తున్నారు. ఆయా డిమాండ్లతో ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు జారీ చేయడంతోపాటు, నిరసన కార్యక్రమాలకు శ్రీకారంచుట్టారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెబాట పట్టక తప్పదని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు.
కొనసాగుతున్న నిరసనలు
మిషన్ భగీరథ పథకం ఇంజినీరింగ్ విభాగంలో ప్రమోషన్లు తక్షణం కల్పించాలని, ఉన్నవారికి పనిభారం తగ్గించాలని టీఆర్డబ్ల్యూఎస్ఈఏ (తెలంగాణ రూరల్ వాటర్ సప్లయ్ ఇంజినీర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శనివారం భోజన విరామ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీర్లు నిరసన వ్యక్తంచేశారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఏకంగా ధర్నా నిర్వహించారు. సీనియారిటీ జాబితా విడుదలలో జాప్యం, ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోవడం వల్ల అర్హులైన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటపతి, ప్రధాన కార్యదర్శి రాజు పేరొన్నారు. ఈఎన్సీ కార్యాలయంలోనే జాప్యం కొనసాగుతున్నదని, తక్షణమే ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

