Funtastic | గాంధీ భవన్లో ఆ గదిలోకి వస్తూనే సీనియర్ రిపోర్టర్ ఒక్కసారిగా బెదిరిపోయాడు. వాళ్లను చూసి తనను తాను గిల్లుకున్నాడు. నేనేం టైం మెషీన్లో లేను కదా? అనుకున్నాడు. ఆదిత్య 369లో బాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్లినట్టు తాను జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి కాలంలోకి వచ్చానా? ఏమిటీ అని అయోమయంలో ఉండిపోయాడు.
రిపోర్టర్ పరిస్థితి గమనించిన అమరసింహారెడ్డి… ‘రావయ్యా రా… నువ్వు మమ్మల్ని చూస్తున్నది నిజమే. ఇది కల కాదు, టైం మిషన్ కాదు. నేను నేనే, వీళ్లంతా వీళ్లే…’ అని నవ్వుతూ చెప్పి ఆయాసం రావడంతో ఆగిపోయాడు.
ఇది గాంధీ భవనేనా? రిటైర్ అయిన నాయకుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన పేకాట క్లబ్బా?… అని తనలో తానే అనుకుంటుంటే …
‘అలాంటిదేమీ లేదు. తెలంగాణ ఏర్పడగానే పేకాట క్లబ్‌లను మూసేశారు కదా? టికెట్ రాని, టికెట్ వచ్చే అవకాశం లేని, టికెట్ వచ్చినా గెలవని, ప్రచారం చేయలేని, ప్రచారం చేసినా ఫలితం ఉండని వారందరినీ ఒక చోటకు చేర్చి హస్తం ప్రచార కమిటీ ఏర్పాటు చేశారు. ప్రచారానికి దూరంగా ఉండడమే మేం చేసే ప్రచారం. ఏమంటారు. శ్రీదండరెడ్డి గారు’ ..
కొత్తగా చేరిన అపజయ శాంతి అయోమయంగా చూస్తుంటే.. ‘మీకూ మాకూ పెద్ద తేడా లేదమ్మా. మీరు సినిమాల్లో ఎప్పుడో రిటైర్ అయి, రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడాఎప్పుడో రిటైర్ అయ్యారు. ఒక రకంగా మీ కన్నా మేం జూనియర్లం. మేం రాజకీయాల్లోనే రిటైర్ అయ్యాం. మీరు సినిమాలు, రాజకీయాలు రెండింటిలో రిటైర్ అయ్యారు. అలా మా కన్నా సీనియర్ కాబట్టే, మీ నాయకత్వంలో ఈ కమిటీ వేశారు. ఏమంటావ్ శ్రీదండన్న’ అని అమర సింహారెడ్డి మళ్లీ నవ్వారు. గట్టిగా నవ్వడంతో ఆయాసం ఎక్కువైంది. ఏమన్నా అవుతుందేమో అని అంతా కంగారు పడ్డారు.
అపజయ శాంతి హైకమాండ్‌కు ఫోన్ చేసి తమ కమిటీ పని ప్రారంభించిందని, మొదటి తీర్మానం కాపీ పంపించారు.
తమ కమిటీలో అందరి వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తమ గదిలో నిరంతరం ఇద్దరు డాక్టర్లు ఉండేట్టు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అందరూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం… మెడలు వంచుతాం… మా తడాఖా చూపిస్తాం… అని గట్టిగా నినాదాలు చేశారు. ముందు వరుసలో ఇద్దరు, వెనుక వరుసలో ముగ్గురు దభేలున పడ్డట్టు సౌండ్ వచ్చింది.
భయపడాల్సిన అవసరం లేదు. మీ తీర్మానాన్ని చదివి వెంటనే మన గదిలో ఇద్దరు డ్యూటీ డాక్టర్లతో పాటు, ఆక్సిజన్ సిలిండర్లు ఉంచారు. అని ఆఫీస్ సిబ్బంది వచ్చి ధైర్యం చెప్పారు. నినాదాలు గట్టిగా చేయడంతో బీపీ డౌనయితే గుడ్లు తేలేసిన వాళ్లకి ఆక్సిజన్ పెట్టారు.
వెంటిలేటర్ మీదున్న పార్టీకి, ఆక్సిజన్ మీదున్న సీనియర్లు భలే ఉంది కదా?… అని వెనక నుంచి ఎవరో జోక్ వేశారు. సీరియస్ పరిస్థితిలో జోకులు ఆరోగ్యానికి మంచిదికాదు అనుకొని రిపోర్టర్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.
– మురళి