హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : రానున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాల ఓట్ల కోసమే పీసీసీ అధ్యక్షుడు బీసీ ముఖ్యమంత్రి ముచ్చట తెరపైకి తెచ్చారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన పనిని తూచా తప్పకుండా ఆచరిస్తూ, బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న ఆయన కేసీఆర్‌ను బీసీద్రోహి అనడం దుర్మార్గమని ఖండించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కామారెడ్డి డిక్లరేషన్‌లోని ఒక్క హామీనైనా నెరవేర్చారా? మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానమిచ్చారా? 200 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 41 మాత్రమే ఇచ్చి మొండిచెయ్యి చూపిన మీరా మాట్లాడేది? అని మండిపడ్డారు. తెలంగాణలో పద్మశాలీ బిడ్డను బర్తరఫ్ చేసి అవమానించారు. బీసీలకు ధోకా చేసిన కాంగ్రెస్‌కు వారి గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది. ‘నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు 34మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరే బీసీలు. మంత్రివర్గంలో బీసీలు ఇద్దరే. లోక్‌సభ సీట్లలోనూ కోటా దక్కలేదు. ఇలాంటి పార్టీలో బీసీ సీఎం ఎలా సాధ్యం? ఓట్ల కోసమే బీసీ సీఎం నాటకం’అని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ బీసీలకు ద్రోహంచేసిన పార్టీలేనని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ ఆరోపించారు. బీసీలకు ఏటా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ మూడేండ్లలో చేసిందేమీలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత మంచె శ్రీనివాస్ మాట్లాడుతూ మూడేండ్ల పాలనలో బలహీనవర్గాలను అడుగడుగునా వంచిస్తున్న కాంగ్రెస్‌ను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): బీసీల వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డ కాంగ్రెస్‌కు మొదటి నుంచి బలహీనవర్గాలంటే చిన్నచూపేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీల సంక్షేమం కోసం తెచ్చిన బీసీబంధుకు ఘోరీ కట్టిందని విమర్శించారు.