మత్స్యశాఖలో గందరగోళం
రాష్ట్ర మత్స్యశాఖలో గందరగోళం నెలకొన్నది. రెండేండ్లుగా జిల్లాస్థాయి అధికారులు వరుసగా 10మంది ఏసీబీకి పట్టుబడటం, మరికొంతమంది విధి నిర్వహణలో అలసత్వం, క్రమశిక్షణ వంటి చర్యలతో సస్పెన్షన్లకు గురయ్యారు.
- వరుసగా అధికారుల సస్పెన్షన్లు రెండేండ్లలో ఏసీబీకి చిక్కిన 10 మంది
- కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నా పట్టించుకోని డైరెక్టర్
- పరిష్కారానికి నోచుకోని లబ్ధిదారుల సమస్యలు
- పెండింగ్లో రూ.88 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు
- గత్యంతరం లేక కోర్టులను ఆశ్రయించిన వైనం
- చేపపిల్లల సరఫరాకు ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మత్స్యశాఖలో గందరగోళం నెలకొన్నది. రెండేండ్లుగా జిల్లాస్థాయి అధికారులు వరుసగా 10మంది ఏసీబీకి పట్టుబడటం, మరికొంతమంది విధి నిర్వహణలో అలసత్వం, క్రమశిక్షణ వంటి చర్యలతో సస్పెన్షన్లకు గురయ్యారు. జిల్లాస్థాయిలో పోస్టింగ్ ఒకచోట ఉంటే.. మరోచోట వారికి నచ్చిన ఉద్యోగం చేస్తుండటంతో ఎవరు ఎక్కడ పనిచేస్తున్న విషయంలో స్పష్టత కరువైంది.
మత్స్యశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లాస్థాయి వరకు అనేక కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఒక్కో అధికారి రెండు, అంతకంటే ఎక్కువ జిల్లాలకు ఇన్చార్జిగా వ్యవహరించాల్సి వస్తున్నది. ఫలితంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా మత్స్య సహకార సంఘాల పర్యవేక్షణ, సభ్యత్వాల నమోదు, పథకాల గ్రౌండింగ్ దారి తప్పిందనే విమర్శలున్నాయి.
మే నాటికి పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలు..
మత్స్యశాఖలో 498మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సగం మంది కూడా లేరు. రాష్ట్ర కార్యాలయంలోనే ప్రధానమైన డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ వంటి పోస్టులతోపాటు జిల్లాస్థాయి అధికారులు, మేనేజర్లు, సూపరింటెండెంట్ స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మే నాటికి రాష్ట్ర కార్యాలయంలో ఉన్న ఇద్దరు సీనియర్ అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులు నలుగురు ఉద్యోగ విరమణ పొందనున్నారు. ప్రస్తుతం రెండు జిల్లాలకు ఒకరు ఇన్చార్జిగా వ్యవహరిస్తుండగా, మే నెల తర్వాత మూడు, నాలుగు జిల్లాలకు ఒకరు పనిచేసే పరిస్థితి ఉండొచ్చని ఉద్యోగులు వాపోతున్నారు.
అందుబాటులో లేని డైరెక్టర్ మేడమ్!
మత్స్యశాఖలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ డైరెక్టర్ పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. సదరు అధికారిణి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లబ్ధిదారులు, కాంట్రాక్టర్లను కలువడం లేదని అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అంతేగాక ఆగస్టు 13 నుంచి డైరెక్టర్ కార్యాలయానికి రావడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. తనకు మరోచోట బాధ్యతలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ.. వాస్తవంగా ఆ అధికారిణి ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. అందుకే ఏవైనా కీలక దస్ర్తాలుంటే పనిచేసే మరోచోటికి తెప్పించుకుంటారని తెలిసింది. తాజాగా సూర్యాపేట జిల్లా అధికారి సస్పెన్షన్ విషయం కూడా కార్యాలయ వర్గాలకు కనీస సమాచారం ఇవ్వకుండానే చేసినట్టు సమాచారం. గతంలో కలెక్టర్గా పనిచేసిన ఆ డైరెక్టర్ ప్రస్తుతం మత్స్యశాఖలో పనిచేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తున్నది. ఐఏఎస్ల బదిలీల ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. మళ్లీ తాను కలెక్టర్గా వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారని తెలిసింది. తాజాగా ఐఏఎస్ బదిలీల సందర్భంగా చేసిన ప్రయత్నంపై సీఎం కూడా ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం.
బకాయిల కోసం హైకోర్టుకు కాంట్రాక్టర్లు
ప్రభుత్వానికి చేపపిల్లలు, రొయ్యలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు రూ.88 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. మూడేండ్లుగా బిల్లుల కోసం రాష్ట్ర కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకొనేవారు లేక హైకోర్టును ఆశ్రయించారు. బకాయిలు పెండింగ్లో ఉండటంతో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపలేదని మత్స్యసహకార సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. అంతేగాక ఇటీవల మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన హైకోర్టు.. ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్లకు నోటీసులిచ్చింది. బిల్లుల చెల్లింపుపై వారం రోజుల్లో రెండు సార్లు అధికారులకు నోటీసులు వచ్చాయి. చేపపిల్లల పంపిణీ చేయడం లేదని మరో నోటీసు వచ్చింది. ఇలా వరుసగా నోటీసులు రావడం, డైరెక్టర్ అందుబాటులో లేకపోవడం నిర్వహణ గాడి తప్పింది. పెండింగ్ నిధులపై ప్రభుత్వంతో చర్చించాల్సిన డైరెక్టర్ ఏమాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫిర్యాదులున్నా స్పందించని మంత్రి ?
మత్స్యశాఖపై సంబంధిత మంత్రి దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి. డైరెక్టర్ వ్యవహారం, శాఖ కార్యకలాపాలపై ఫిర్యాదులు వస్తున్నా అమాత్యుడు కనీసం సమీక్ష చేయలేదని మత్స్యకారులు, మత్స్యకార సహకార సంఘాలు వాపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మంత్రి ఫోన్కు కూడా స్పందించడం లేదని ఆరోపణలున్నాయి. నిరుడు మహిళా, శిశు సంక్షేమ శాఖల నుంచి మత్స్యశాఖకు సుమారు రూ.30 కోట్ల నిధులు రావాల్సి ఉన్నదని, గడువులోగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపాల్సిన డైరెక్టర్ చొరవ చూపలేదని తెలిసింది. అయినా మంత్రి స్పందించలేదని మత్స్యసంఘాలు మండిపడుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

