హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బిట్స్ పిలానీకి చెందిన విద్యార్థులు జయంత్ ఖత్రీ (మెకానికల్ ఇంజినీరింగ్), శౌర్య చౌదరి (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) అద్భుతం సృష్టించారు. మన సైనిక దళం కోసం తమ హాస్టల్ గదిలోనే కామికాజ్ యుద్ధ డ్రోన్లను రూపొందించి అబ్బురపరిచారు. సాధారణ విడిభాగాలను ఉపయోగించి అత్యాధునిక టెక్నాలజీతో వీటిని తయారు చేశారు. హైదరాబాద్ బిట్స్ పిలానీకి చెందిన అపొలైన్ డైనమిక్ అనే డిఫెన్స్ టెక్ స్టార్టప్ ఈ ఆవిష్కరణకు ప్రాణం పోసింది.
రాడార్‌కు చిక్కకుండా గంటకు 300 కి.మీ. వేగంతో ప్రయాణించగలగడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. ఈ వినూత్న ఆవిష్కరణను ‘లింక్డ్ ఇన్’ ద్వారా భారత ఆర్మీ అధికారులకు పరిచయం చేయడంతో డెమో కోసం చండీగఢ్‌కు రావాలని ఆ విద్యార్థులను ఆహ్వానించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రదర్శనలో వీరి డ్రోన్లు అద్భుత పనితీరు కనబర్చాయి.
ఆ విద్యార్థులకు భారత సైన్యం నుంచి క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. జమ్ముకశ్మీర్, హర్యానా, పశ్చిమ బెంగాల్, అరుణాచల్‌ప్రదేశ్ ఆర్మీ యూనిట్లకు ఆ డ్రోన్లను విక్రయించారు. ఎలాంటి అనుభవం లేనివారు సైతం ఈ డ్రోన్లను ఆపరేట్ చేయొచ్చని విద్యార్థులు చెబుతున్నారు. కామికాజ్ డ్రోన్లు యూ ఏవీల కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణించగలవు. కిలో బరువున్న పేలోడ్లను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలపై ప్రయోగించగలవు.