మణుగూరు టౌన్, అక్టోబర్ 3 : పాఠశాలలోని మరుగుదొడ్ల పైపులైన్లు పగులగొట్టారనే ఆరోపణల నేపథ్యంలో 15 మంది విద్యార్థులను హెచ్ఎం చితకబాదారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం జడ్పీ హైస్కూల్లో శనివారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఉన్నత పాఠశాలలోని తాగునీరు, మరుగుదొడ్లకు సంబంధించిన పైపులైన్లు పగులగొట్టారనే కోపంతో ప్రధానోపాధ్యాయురాలు యశోద 15 మంది విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడంతో వారి వీపులపై వాతలు పడ్డాయి.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ఆందోళనకు దిగారు. తప్పు చేసిన పిల్లలను గట్టిగా హెచ్చరించాల్సిందిపోయి చితకబాదడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులతో కలిసి హెచ్ఎంపై మణుగూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.