ఇది బస్తీ ప్రీమియర్ లీగ్!
కరోనా కాలంలో పిల్లలకు చదువు లేదు. ఆటలూ లేవు. ఎవరింట్లో వాళ్లుండే రోజుల్లో ఫోన్‌తోనే కాలం వెళ్లదీశారు. ఆ తర్వాత బడులు తెరిచారు. అయినా, పిల్లలు ఫోన్ పక్కన పెట్టలేకపోయారు. ఇలాంటి పిల్లల్ని సరైన దారిలో పెట్టేందుకు బయలుదేరింది హైదరాబాద్ స్పోర్ట్స్ అకాడమీ. బస్తీలో పిల్లలకు ఆటలు నేర్పడమే కాదు వారిని సెల్‌ఫోన్ ఉచ్చు నుంచి బయటపడేసింది. ఐపీఎల్ తరహాలో ఏటా బస్తీల మధ్య ఆటల పోటీలు నిర్వహిస్తూ.. మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నది.
హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు దగ్గరలో ఉన్న మల్లాపూర్‌లో ఉంటాడు పీఈటీ నరేందర్. అక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నాడు. బస్తీలో పిల్లలు సెల్‌ఫోన్‌కి బానిసలు కావడం గమనించాడు. ఫోన్ మాన్పించడానికి వాళ్ల తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో గుర్తించాడు. పిల్లల చేతిలో ఫోన్ తీస్తే ఆ చేతిల్లోకి పుస్తకం రావట్లేదనీ అర్థం చేసుకున్నాడు. ఇలాంటి పిల్లల చేతిలో ఫోన్ లాక్కోకుండా వాళ్లే పక్కన పెట్టేలా చేయాలని నరేందర్ అనుకున్నాడు. ఖాళీ సమయాల్లో చేతిలోకి ఫోన్ తీసుకోకుండా, ఆ కాలం ఆటల్లో గడిచిపోయేలా చేద్దామనుకున్నాడు.
ఆటల సాయంత్రం
మల్లాపూర్ బస్తీలోని ప్రైవేట్ పాఠశాల ఆవరణలో పిల్లల్ని ఆటలాడిస్తానని, కబడ్డీ, కోకో, వాలీబాల్ శిక్షణ ఇస్తానని పీఈటీ నరేందర్ బస్తీవాళ్లకు చెప్పాడు. ఆటలంటే ఇష్టమున్న పిల్లలే కాదు ఆటలు చూద్దామనుకున్న పిల్లలూ వచ్చారు. నలభై మంది పిల్లలతో ఓ రోజు సాయంత్రం బస్తీ ఆటలు మొదలయ్యాయి. సరదా మాటలు చెబుతూ, చిన్న చిన్న వర్కవుట్స్ చేయిస్తూ ఆటల్ని పరిచయం చేశాడు. ఎప్పుడైతే ఆటల్లో పడ్డారో కొత్త స్నేహితులు పెరిగారు. వాళ్లకూ ఆటలే ఇష్టం కాబట్టి సెల్‌ఫోన్ ముచ్చట్లు తగ్గాయి. రోజూ గంటన్నర పాటు ఆడుతూ ఉన్నారు. వాళ్లు మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉన్నారు. ఆటలతో అలసిపోయి రాత్రుళ్లు కంటినిండా నిద్రపోతున్నారు. పొద్దునే త్వరగా నిద్ర లేస్తున్నారు. ఇలా మొదలైన మార్పుని అమెరికాలో ఉండే రవిప్రకాశ్ మేరెడ్డి గుర్తించారు. బస్తీ పిల్లల్ని ఇలా ఆడిస్తే వ్యసనాలకు దూరం చేయడమే కాదు మంచి క్రీడాకారుల్ని తయారు చేయొచ్చు. చాలా పాఠశాలల్లో ఆడే వసతుల్లేవు, ఆడించేవాళ్లూ లేరు. కాబట్టి మిగతా బస్తీల్లోని పిల్లల్ని కూడా ఆటల్లోకి దించాలని రవి ప్రకాశ్ సూచించారు.

Khel Cricket
మట్టిలో మాణిక్యాలు
బస్తీల్లో పిల్లలందరూ ఆటలపట్ల ఆసక్తి చూపించరు. కొంతమంది చదువుకు సమయం సరిపోవట్లేదని వెనక్కి తగ్గుతారు. మరికొంతమందికి ఫిట్నెస్ ఉండదు. ఇలాంటి ఇబ్బంది లేకుండా పిల్లల శారీరక నిర్మాణం, సామర్థ్యాన్ని పీఈటీ పరిశీలిస్తారు. తర్వాత వాళ్లకు ఏ ఆట సరిపోతుందో సూచిస్తారు. దానికి తగిన సామర్థ్యం పెంచుకోవడానికి వర్కవుట్స్ నేర్పిస్తారు. ప్రతి రోజూ ఆ వర్కవుట్స్ చేసిన తర్వాత ఆటలు ఆడిస్తారు. వారిని క్రీడాకారులుగా మలుస్తారు. పొట్టిగా ఉండి వేగంగా పరుగెత్తుతుంటే కోకో, ఎత్తున్నవాళ్లకు వాలీబాల్, అప్పర్ బాడీ ఫిజిక్ బాగా ఉన్నవాళ్లకు బాస్కెట్ బాల్ ఆడిస్తారు. మంచి ఎత్తు, బరువు ఉండి, లోయర్ బాడీ, అప్పర్ బాడీ ఫిట్‌గా ఉంటే కబడ్డీ నేర్పిస్తారు. ఇలా రెండేండ్లలోనే మూడు వేల మంది పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇచ్చారు. రాశిలోనే కాదు వాసిలోనూ తీసిపోలేదు. బస్తీ ఆటల్లో శిక్షణ పొందిన పిల్లలు పది మంది వివిధ ఆటల్లో తెలంగాణ జట్టుకి ఎంపికై జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటారు కూడా! ఇంటర్మీడియట్ తర్వాత నలుగురు పీఈటీ (యూజీడీ టీచర్)గా ఎంపికయ్యారు. ఒకరు ఆర్మీకి ఎంపికయ్యారు. అసోసియేషన్ జూనియర్స్, ఖేలో ఇండియా పోటీలతోపాటు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఆడిన క్రీడాకారులు వందల్లో ఉన్నారు. తక్కువ కాలంలో ఎక్కువ విజయాలు సాధించేసరికి ఈ ఆటలకు బస్తీల ప్రజల్లో ఆదరణ పెరిగింది. వాళ్ల సహకారంతో ఐపీఎల్ తరహాలో బస్తీల మధ్య పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఏడాదికోసారి జరిగే బస్తీ ఆటలు పండుగలా జరుపుకొంటున్నారు. నలభై అయిదు బస్తీల్లో ఉన్న నూటా రెండు టీమ్‌ల మధ్య కబడ్డీ, కోకో, వాలీబాల్ మరెన్నో ఆటలు ఆడించారు. రవి ప్రకాశ్ మేరెడ్డి ఆలోచనతో వేర్వేరు సంస్థల ప్రతినిధులు ఎం.వెంకట్ రెడ్డి కార్యచరణ, శాంతా సిన్హా సహకారంతో బస్తీ ఆటలు హైదరాబాద్‌కు కొత్త పండుగను పరిచయం చేశాయి!
బస్తీ బాట
మల్లేశ్ అనే మరో పీఈటీ ఘట్కేసర్లో ఉంటాడు. నరేందర్ తనతో కలిసి చౌదరిగూడ బస్తీలో కూడా ఓ క్యాంప్ ప్రారంభించారు. ఇలా నాలుగు బస్తీల్లో ‘బస్తీ ఆటలు’ మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి ప్రతి బస్తీకి పోయి ప్రైవేట్ పఠశాలల యాజమాన్యాలను కలిసి వాళ్లనీ ఒప్పించారు. స్కూల్ చుట్టుపక్కల పిల్లలకు, బస్తీ పెద్దలకు బస్తీ ఆటలు ఆడేందుకు ఏ బడి పిల్లలైనా రావొచ్చని చెప్పారు. ప్రతి బస్తీలో అయిదారుగురు పిల్లలతో మొదలయ్యేవి. ఆ తర్వాత పిల్లల సంఖ్య పెరుగుతూ పోయింది. ఆటల సంఖ్యా పెరిగింది. ఒక్కో బస్తీలో ‘బస్తీ ఆటలు’ ప్రారంభించుకుంటూ 45 బస్తీలకు విస్తరించారు. అలా ఒక్క బస్తీలో మొదలైన వేడుక.. హైదరాబాద్ స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దుకుంది!
– నాగవర్దన్ రాయల

Khel Award
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

