ఎనీ టైమ్ మిల్క్.. స్వైప్ కరో.. దూద్ భరో
సాదారణంగా ఏటీఎం మెషిన్లలో కార్డు పెట్టి, కావాల్సిన నగదు తీసుకోవడం తెలిసిందే! కానీ, ఈ ఏటీఎంలో కార్డు స్వైప్ చేస్తే.. కోరినన్ని పాలు వస్తాయి. ఇది ఆశ్చర్యమే అయినా గజ్వేల్వాసులకు మాత్రం అలవాటైంది. తన ప్రాణాలు కాపాడిన పట్టణవాసులకు కల్తీ పాలను దూరం చేయాలని స్వచ్ఛమైన పాలను ఇలా ఏటీఎం ద్వారా అందిస్తున్నాడు 25 ఏండ్ల మల్లేపల్లి సందీప్ కుమార్. ప్రజలను కల్తీ నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్న ఈ యువకుడు బతుకమ్మతో పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే...
నాకు ఐదేండ్ల వయసులోనే మా నాన్న కాలం చేశారు. మా అమ్మ రమాదేవి టైలరింగ్ చేసుకుంటూ నన్ను, చెల్లిని చదవించింది. మాకోసం అమ్మ పడిన కష్టాన్ని చూసి చాలాసార్లు బాధపడేవాణ్ని. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే త్వరగా సెటిల్ అవుతారని తెలిసి పదో తరగతి పూర్తికాగానే ఆ కోర్సులో చేరాను. అమ్మకు భారం కావొద్దని చదువుకుంటూనే పార్ట్‌టైం క్యాటరింగ్‌లు చేసేవాణ్ని. నన్ను నేను నిరూపించుకునేందుకు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే క్యాటరింగ్ డబ్బులతోపాటు అమ్మ సహకారంతో గజ్వేల్‌లో అరేబియన్ మండి హోటల్ ప్రారంభించాను. చాలామంది నానా రకాలుగా మాట్లాడారు. ఇంత చదువుకొని వంటలు చేయడమేంటని ఎగతాళి చేశారు. వాళ్ల బాధకు ఏడాదిలోపే ఆ హోటల్ అమ్మేసి వచ్చిన డబ్బుతో చెల్లి పెండ్లి చేశాను. నిందలు వేసే మనుషులకు దూరంగా అమెరికాకు వెళ్లడానికి సిద్ధమయ్యాను. అనుకోకుండా అదే సమయంలో యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లాను. ప్రమాద స్థలంలో చుట్టుపక్కల జనాలు గుర్తించి గోల్డెన్ హవర్లో దవాఖానకు చేర్పి నా ప్రాణాలు కాపాడారు.
అలా మొదలైంది
చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మా ఇంటి సమీపంలో ఉండే మెకానిక్‌తో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆయన చాలా బాధపడుతుంటే వెళ్లి విషయం అడిగాను. తన ఎనిమిదేండ్ల కొడుకు కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడని, వైద్యం చేయించడానికి ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అంత చిన్న అబ్బాయికి ఇంత పెద్ద సమస్యేమిటా అనిపించింది. ఆ అబ్బాయి ఏం తినే పదార్థాల గురించి వాకబు చేశాను. నాకెందుకో ప్యాకెట్ పాలమీద అనుమానం వచ్చింది. అప్పటికే హోటల్ మేనెజ్మెంట్ చేసిన అనుభవంతో మనం తినే ఆహారంపై అవగాహన ఉంది. ప్యాకెట్ పాల వాడకం కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చిపెడుతుందని గ్రహించాను. నా ప్రాణాలు కాపాడిన గజ్వేల్ ప్రజలకు నా వంతుగా వాళ్ల ఆరోగ్యాలను కాపాడాలనుకున్నాను. అందుకు కల్తీ పాలను వాళ్ల నుంచి దూరం చేయాలని భావించాను.

Sandeep Kumar
ఇంటింటికీ పాలు
ఇంటింటికీ ఫిల్టర్ నీళ్లు అందించినట్లుగా ప్రతి ఇంటికి వెళ్లి స్వచ్ఛమైన పాలు అందించాలని అనుకున్నాను. అందులో భాగంగానే ఈ మెషిన్‌కు రూపకల్పన చేశాను. సిక్కింకు చెందిన నా మిత్రుడు శివ మెట్రో స్టేషన్లలో వాటర్ నింపుకొనేందుకు అటోమెటిక్ యంత్రాలు రూపొందించాడు. వాడికి నా ఆలోచన చెప్పడంతో నాకు ఈ ఏటీఎం మెషిన్ తయారు చేసిచ్చాడు. గజ్వేల్ సమీపంలోని గిరిపల్లి, దౌల్తాబాద్, ఇందుప్రియాల్, ధర్మారెడ్డిపల్లి గ్రామాలతో పాటు మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన రైతుల నుంచి స్వచ్ఛమైన పాలను సేకరిస్తూ గజ్వేల్ వాసులకు అందిస్తున్నాను. ఈ వ్యాపారానికి నా ఇష్టదైవం ఆంజనేయస్వామి ఆశీస్సులు, మా అమ్మ దీవెనలు ఉండాలని ‘శ్రీ మారుతి మదర్ మిల్క్’ అని పెట్టుకున్నాను. తెల్లవారుజామున రైతులు తెచ్చిన పాలను పరీక్షించి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గజ్వేల్ పట్టణంలో మా పాల వాహనాన్ని ఇంటింటికీ తిప్పుతున్నాం. ముందే రెగ్యులర్‌గా పాలుకొనే వారికి రీచార్జ్ కార్డులు అందించాం. బండి తమ ఇంటిముందుకు రాగానే ఆ కార్డును మిషన్‌లో స్వైప్ చేసి ఎన్ని పాలు కావాలో అందులోని బటన్‌పై క్లిక్ చేయగానే పాలు వస్తాయి. కార్డు లేని వారి దగ్గర నగదు తీసుకొని మా వద్ద ఉన్న కార్డుతో స్వైప్ చేసి పాలు పోసిస్తాం. ప్రారంభంలో చాలామంది ప్లాస్టిక్ బాటిల్ తెచ్చేవారు. అది నాకు నచ్చలేదు! వారికి స్టీల్ బాటిల్ ఇచ్చాను.
పనికిరాడన్న వాళ్లే
ప్రస్తుతం ఖర్చులన్నీ పోను రూ.20 వేల వరకు ఆదాయం వస్తున్నది. నాకు డబ్బులు సంపాదించాలన్నది లక్ష్యం కాదు. నా వల్ల జనాలకు మంచి జరగాలన్నదే తపన. ‘వీడు ఎందుకూ పనికి రాడని’ ముద్రేసిన వాళ్లంతా నా ఆలోచనను మెచ్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నా వల్ల ఓ పదిమందికి పని దొరకుతుంది. ప్రస్తుతం రోజూ 300 లీటర్లకు పైగా పాలు సేకరిస్తూ 200 మందికి చేరవేస్తున్నాం. ఇంకా పాల సేకరణ సామర్థ్యాన్ని పెంచుతాం. భవిష్యత్తులో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కుటుంబాలకు సరిపడా స్వచ్ఛమైన పాలను సేకరించి వార్డుకొక ఏటీఎం మిషన్ పెట్టి పాలను అందించాలన్నది నా ఆలోచన.
– రాజు పిల్లనగోయిన
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

