జపాన్‌వాసులు ఏది చేసినా అద్భుతమే! ఏవి నిర్మించినా.. పర్యాటక ఆకర్షణే! ఈ బస్ షెల్టర్లు కూడా అంతే! ‘టోకిమెకి ఫ్రూట్-షేప్ బస్‌స్టాప్ అవెన్యూ’.. అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నది. ఇసహాయా నగరంలోని కొనగాయ్ ప్రాంతంలో హైవే-207 వెంబడి.. పండ్ల ఆకారంలో నిర్మించిన బస్ షెల్టర్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా, ఫొటోగ్రాఫర్లు, సోషల్‌మీడియా కంటెంట్ క్రియేటర్లకు స్వర్గధామంగా నిలుస్తున్నాయి.

Bus Shelter
1990లో జరిగిన ‘జర్నీ ఎక్స్పోజిషన్ నాగసాకి (ట్రావెల్ ఎక్స్పో)’ కోసం పర్యాటకులను ఆకర్షించడానికి ఈ బస్షెల్టర్లను నిర్మించారు. ‘సిండ్రెల్లా’ కథలోని గుమ్మడికాయ బండి నుంచి స్ఫూర్తి పొంది ఈ డిజైన్లను రూపొందించారు. ఇక్కడ ఐదు రకాల పండ్ల ఆకారంలో మొత్తం 16 బస్ స్టాప్‌లు ఉన్నాయి.

నాగసాకి ప్రిఫెక్చర్లో పండించే అత్యంత ముఖ్యమైన పంటలైన స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, కర్బూజా, నారింజ, టమాటాలను ఈ షెల్టర్లు సూచిస్తాయి. ఈ ప్రాంతపు స్ట్రాబెర్రీలు, నారింజలు.. జపాన్వ్యాప్తంగా చాలా ప్రసిద్ధిచెందినవి.

అరియాకీ సముద్ర తీరానికి ఆనుకుని ఉండటం వల్ల.. ఇక్కడి పరిసరాలు అద్భుతంగా కనిపిస్తాయి. పచ్చని కొండల నడుమ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అందుకే, పర్యాటకులు ఇక్కడికి వచ్చిమరీ ఫొటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రివాజు.

36 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బస్ స్టాపులు కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదు. లోపల ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలు, గాలి రావడానికి కిటికీలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ప్రజలు బస్సుల కోసం వేచి ఉండటానికి వీటినే ఉపయోగిస్తున్నారు. పుచ్చకాయలు, టమాట లోపల కూర్చొని.. బస్సుల కోసం వేచి చూస్తుంటారు.

ఈ అవెన్యూలోనే అత్యంత ఫేమస్ పాయింట్.. ఐజాకి బస్‌స్టాప్. ఇక్కడ కర్బూజా, స్ట్రాబెర్రీ ఆకారపు బస్ స్టాపులు రోడ్డుకు ఎదురెదురుగా ఉంటాయి. వీటి వెనకే అరియాక్ సముద్రం కనిపిస్తూ..

ఫొటోలకు అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌ను అందిస్తుంది. ఇక భారీ వృక్షాల మధ్య, అడవి లాంటి ప్రదేశంలో ఉండే కోఫుకై కూడా అత్యంత సుందరంగా కనిపిస్తుంది.
