Vaibhav Sooryavanshi అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అడుగుపెట్టాడు. కోట్లాదిమంది ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నోడు వస్తూనే రికార్డులు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌తో రెండో టీ20లో డెబ్యూ క్యాప్ అందుకున్న వైభవ్ 15 ఏళ్లకే తొలి మ్యాచ్ ఆడిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా అవతరించాడు. 1989లో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) సాధించిన రికార్డును బద్ధలు కొట్టేశాడీ యువకెరటం.
జూనియర్ స్థాయిలో శతకాలతో హోరెత్తించిన వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి వస్తూనే రికార్డుల దుమ్ము దులిపాడు. జూలై 4 శనివారం టీ20ల్లో అడుగుపెట్టిన వైభవ్ భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. దాంతో, సచిన్ కంటే ఏడాది ముందే ఈ ఘనత సొంతం చేసుకున్నాడీ చిచ్చరపిడుగు.
A historic day in Indian cricket 🇮🇳 pic.twitter.com/nU3yVvYdiJ
— Cricinfo (@cricinfo) July 4, 2026
సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడాడు. 1989లో పాకిస్థాన్‌తో కరాచీలో జరిగిన మ్యాచ్‌లో ఆడడం ద్వారా మాస్టర్ బ్లాస్టర్ రికార్డు సాధించాడు. వైభవ్ విషయానికొస్తే.. 15 ఏళ్ల 99 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక.. అంతర్జాతీయంగా చూస్తే 15 ఏళ్లకే ఆగమనం చేసిన మూడో చిన్నోడిగా వైభవ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
A historic day for Indian cricket 💙
Vaibhav Sooryavanshi makes his #TeamIndia debut at 1️⃣5️⃣ years, 9⃣9⃣ days 👏#ENGvIND pic.twitter.com/qwS2hx4RW8
— BCCI (@BCCI) July 4, 2026
మొహమ్మద్ షరీఫ్(బంగ్లాదేశ్), ముష్తక్ మొహమ్మద్(పాకిస్థాన్) ఈ ఘనత సొంతం చేసుకున్నారు. అనంతరం మొత్తంగా అత్యంత చిన్న వయస్కుడి రికార్డు మాత్రం పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా (Hasan Raza) పేరిట ఉంది. 1996లో తొలి మ్యాచ్ ఆడే సమయానికి అతడి వయసు 14 ఏళ్ల 227 రోజులు మాత్రమే.