Sonal Dinusha : కొలంబో టెస్టు హీరో సోనల్ దినుషా(Sonal Dinusha)పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఫాలోఆన్ ప్రమాదంలో పడిన శ్రీలంకను అతడు అదుకున్న తీరు.. ఐదోరోజు ఆసాంతం క్రీజునంటుకొని భారత జట్టుకు విజయాన్ని దూరం చేసిన అతడి ఆటను వేనోళ్ల పొగుడుతున్నారంతా. రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలతో రికార్డులు నెలకొల్పిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ స్థాయికి రావడం వెనక 13 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. లంకను గట్టెక్కించిన యోధుడిగా చరిత్రకెక్కిన దినుష వద్ద చిన్నప్పుడు బ్యాట్ కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేవు. అతడి సోదరి అప్పు చేసి మరీ అతడికి బ్యాట్ కొనిస్తే.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో తన పేరు మార్మోగిపోయే ఇన్నింగ్స్‌లతో తన ఉనికిని ఘనంగా చాటుకున్నాడీ చిచ్చరపిడుగు.
టెస్టు క్రికెట్లో ఐదు రోజుల ఆట కరువైపోతున్న రోజుల్లో.. మారథాన్ ఇన్నింగ్స్‌తో అలరించిన సోనల్ దినుషా ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యాడు. తన క్రికెట్ నైపుణ్యం, స్పిన్నర్ల లయను దెబ్బతీస్తూ అతడు ఆడే రివర్స్ స్వీప్ షాట్లు.. పరిస్థితులకు తగ్గట్టు తన ఆటను మార్చుకోవడం.. ఇవన్నీ అతడిని కొలంబోలో హీరోను చేశాయి. అలాఅనీ క్రికెట్లో అతడి ప్రయాణం నల్లేరుపై నడకలా సాగలేదు. అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ కొన్ని పేజులు రాసుకునేందుకు అతడు పేదరికంతో పాటు కెరీర్ ఆరంభంలో ఎన్నో అవరోధాలు అధిగమించాడు. ముఖ్యంగా 13 ఏళ్లు కఠినంగా సాధన చేశాడని అతడి కోచ్ అఆన్ ప్రియంజన్ వెల్లడించాడు.
He’s made the hundred a habit. 💯🔥
Sonal Dinusha brings up his third century in just two Tests, standing tall for Sri Lanka when it matters most.
Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/j7xLIsze7t
— Sony Sports Network (@SonySportsNetwk) August 27, 2026
2000వ సంవత్సరం డిసెంబర్ 4 కొలంబోలో జన్మించిన దినుష.. చిన్నప్పుడు బాస్కెట్‌బాల్ తెగ ఆడేవాడు. ఎడమచేత్తో స్పిన్ బౌలింగ్ కూడా చేసేవాడు. అయితే.. అతడిలో క్రికెట్ నైపుణ్యం గమనించిన స్కూల్ కోచ్ ప్రోత్సహించాడు. అయితే.. బ్యాట్ కొనుక్కునేందుకు డబ్బులు కూడా లేని పేదరికం దినుషాది. ఆ పరిస్థితుల్లో అతడి సోదరి.. అప్పు చేసి మరీ మొదటి బ్యాట్ కొనిచ్చింది. అంతే.. అక్కడి నుంచి దినుషా ధ్యాస అంతా క్రికెట్ మీదే. స్థానిక డీ లలా సల్లే కాలేజీలో 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్న అతడికి సోనల్ దుల్షన్ కోచ్‌గా మారాడు. ఆపై మహనమా కాలేజీ(ప్రస్తుతం టెస్టు జట్టు కెప్టెన్ ధనుంజయ డిసిల్వా ఇక్కడే క్రికెట్ మెలకువలు నేర్చుకున్నాడు)లో చేరిన దినుషా తన ఆటకు పదును పెట్టుకున్నాడు.
జూనియర్ స్థాయిలో, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరిసిన దినుషా కష్టం ఊరికేపోలేదు. 2025లో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. తొలి మ్యాచ్‌లోనే ఆల్‌రౌండ్ ప్రతిభను చూపిస్తూ.. 22 పరుగులకే 3 వికెట్లు తీశాడతడు.
కానీ, భారత జట్టుపై దినుషా ఆడిన తీరు దిగ్గజాలను సైతం ఫిదా చేసింది. టీమిండియా స్పిన్నర్లును ఎదుర్కొనేందుకు స్వీప్ షాట్లు సాధన చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ విజయవంతమయ్యాడు.
A 💯 yesterday, a 💯 today 👏
Sonal Dinusha is the third batter to score twin hundreds in a Test for a team that followed-on! pic.twitter.com/QEkCstMH0B
— Cricinfo (@cricinfo) August 27, 2026
గాలే టెస్టులో శతకం(100), హాఫ్ సెంచరీ(84)తో మెరిసిన అతడు.. కొలంబోలోనూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి పరుగుల వరద పారించాడు. శ్రీలంక క్రికెట్‌కు ఓ అద్భుత బ్యాటర్ దొరికాడని చాటుతూ చిరస్మరణీయ శతకాలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 162 బంతులు.. రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు 50 ఓవర్లు ఆడిన ఈ పాతికేళ్ల కుర్రాడు టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. శ్రీలంక భావి తారగా, జూనియర్ కుమార సంగక్కరగా ప్రశంసలు అందుకుంటున్న దినుషా.. రాబోయే రోజుల్లో మరిన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాలని లంక అభిమానులు కోరుకుంటున్నారు.
— Sonal Dinusha (@SonalDinushaSL) August 28, 2026
1. ఫాలోఆన్ ఆడుతూ ఒకే టెస్టులో రెండు సెంచరీలు మూడో బ్యాటర్‌గా దినుషా రికార్డు సృష్టించాడు. గతంలో విజయ్ హజారే(భారత్), ఆండీ ఫ్లవర్(జింబాబ్వే) ఈ ఘనత సాధించారు.
2. స్వీప్‌షాట్లతో భారత స్పిన్నర్ల వ్యూహాలను దెబ్బతీసిన దినుషా ఏకంగా 173 రన్స్ రాబట్టాడు. దాంతో.. ఇప్పటివరకూ స్వీప్ షాట్ల కింగ్‌గా పేరొందిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(160 పరుగులు) రెండో స్థానానికి పరిమితయ్యాడు.
3. భారత్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకం బాదిన మూడో లంకేయుడిగా దినుషా రికార్డు నెలకొల్పాడు. అతడి కంటేముందు దులీప్ మెండిస్, అరవింద డిసిల్వాలు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. మొత్తంగా.. సుదీర్ఘ ఫార్మాట్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో వంద కొట్టిన ఎనిమిదో బ్యాటర్‌గా దినుషా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు.
4. అంతేకాదు.. ఆరో స్థానంలో వచ్చి.. రెండు సెంచరీలు బాదిన ఐదో ఆటగాడిగా దినుషా మరో రికార్డు తన పేరిట రాసుకున్నాడు.