Shubman Gill : ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సమయం ఉన్నందున భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) అక్కడ జాలీగా గడుపుతున్నాడు. మొన్నటిమొన్న అమెరికరా ర్యాపర్ ట్రావిస్ స్కాట్, బ్రిటన్ ఇంటర్నెట్ సంచలనం హ్యారీ పినెరోలను కలిసిన గిల్ ఈసారి మెర్సిడెజ్ గ్యారేజ్(Mercedez Garage)లో సందడి చేశాడు. అక్కడ ఫార్ములా వన్ రేసర్ కిమి ఆంటోనెల్లితో కలిసి క్రికెట్ ఆడాడు. తమతమ క్రీడలో రాణిస్తున్న ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్ పర్యటనను ఆస్వాదిస్తున్నాడు. మూడు వన్డేల సిరీస్‌కు ముందు దొరికిన విరామంలో అతడు సరదాగా, సంతోషంగా గడుపుతున్నాడు. నైక్, బీట్స్ వంటి స్పోర్ట్స్ ఉత్పత్తుల ప్రచారంలో పాల్గొన్న గిల్.. మెర్సిడెజ్ గ్యారేజ్‌లో క్రికెట్ ఆడాడు. ఫార్ములా వన్ రేసర్ కిమి ఆంటోనెల్లితో ఆడి సంబురపడ్డాడు. 19 ఏళ్ల ఆంటోనెల్లి టెన్నిస్ బంతితో బౌలింగ్ చేయగా.. టీమిండియా సారథి ‘కారిడార్ క్రికెట్’ ఆడాడు.
అనంతరం ఆంటోనెల్లి సైతం బ్యాట్ అందుకొని షాట్లు ఆడాడు. ‘మెర్సిడెజ్ గ్యారేజ్‌ల కారిడార్ క్రికెట్.. వేగవంతమైన కార్లు.. వేగవంతమైన చేతులు కలిశాయి’ అనే క్యాప్షన్‌తో టీమిండియా కెప్టెన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాడు.
అంతకు ముందు నైట్ క్లబ్లో అమెరికా ర్యాపర్ ట్రావిస్ స్కాట్, బ్రిటన్ ఇంటర్నెట్ స్టార్ హ్యారీ పినెరోలను కలిశాడు గిల్. అంతేనా.. ఫుట్‌బాల్ ఆడుతూ తెగ మురిసిపోయాడు ఇండియన్ స్కిప్పర్. జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవ్వనుంది.