చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. దారులన్నీ మూసుకుపోయాక పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. బౌలర్ల సమిష్టి కృషికి లోకేశ్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 14వ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన పంజాబ్ ఆరు విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని లీగ్ దశను ముగించింది. గత కొన్ని మ్యాచ్‌ల్లో విజయం అంచు వరకు వచ్చి ఓటమి పాలైన పంజాబ్.. ఆఖరి పోరులో మరో ఏడు ఓవర్లు మిగిలుండగానే గెలుపొందడం విశేషం!
దుబాయ్: ఆశలన్నీ అడుగంటిన స్థితిలో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. చక్కటి బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ను తక్కువ స్కోరుకే అడ్డుకున్న పంజాబ్.. లోకేశ్ రాహుల్ (42 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) వీర విజృంభణతో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకుంది. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా గురువారం జరిగిన తొలి పోరులో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (55 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రుతురాజ్ గైక్వాడ్ (12), మోయిన్ అలీ (0), రాబిన్ ఉతప్ప (2), అంబటి రాయుడు (4) విఫలమవగా.. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (12), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (15 నాటౌట్) ఆఖర్లో వేగంగా ఆడలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో జోర్డన్, అర్ష్‌దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాహుల్ పూనకం వచ్చిన వాడిలా విరుచుకుపడటంతో పంజాబ్ 13 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిన రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
చెన్నై: గైక్వాడ్ (సి) షారుక్ (బి) అర్ష్‌దీప్ 12, డుప్లెసిస్ (సి) రాహుల్ (బి) షమీ 76, అలీ (సి) రాహుల్ (బి) అర్ష్‌దీప్ 0, ఉతప్ప (సి) హర్‌ప్రీత్ (బి) జోర్డన్ 2, రాయుడు (సి) అర్ష్‌దీప్ (బి) జోర్డన్ 4, ధోనీ (బి) రవి 12, జడేజా (నాటౌట్) 15, బ్రావో (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 134/6. వికెట్ల పతనం: 1-18, 2-29, 3-32, 4-42, 5-61, 6-128, బౌలింగ్: షమీ 4-0-22-1, హర్‌ప్రీత్ 4-0-22-0, అర్ష్‌దీప్ 4-0-35-2, జోర్డన్ 3-0-20-2, రవి 4-0-25-1, హెన్రిక్స్ 1-0-9-0.
పంజాబ్: రాహుల్ (నాటౌట్) 98, మయాంక్ (ఎల్బీ) శార్దూల్ 12, సర్ఫరాజ్ (సి) డుప్లెసిస్ (బి) శార్దూల్ 0, షారుక్ (సి) బ్రావో (బి) దీపక్ 8, మార్క్మ్ (సి) ధోనీ (బి) శార్దూల్ 13, హెన్రిక్స్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 13 ఓవర్లలో 139/4. వికెట్ల పతనం: 1-46, 2-46, 3-80, 4-126, బౌలింగ్: దీపక్ 4-0-48-1, హజిల్‌వుడ్ 3-0-22-0, శార్దూల్ 3-0-28-3, జడేజా 1-0-9-0, బ్రావో 2-0-32-0.