లండన్: వ్యాక్సిన్ వివాదంపై టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ స్పందించారు. ఓ ప్రఖ్యాత మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని వస్తున్న వత్తిళ్లపై రియాక్ట్ అవుతూ.. బలవంతంగా వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేదన్నాడు. భవిష్యత్తులో జరిగే టెన్నిస్ టోర్నీలకు దూరంగా ఉండేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమానికి తానేమీ మద్దతు ఇవ్వడం లేదని, కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్నట్లు జోకోవిచ్ చెప్పాడు. ఈ ఏడాది జరగబోయే వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలను వదులుకుంటారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆ మూల్యాన్ని చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జోకో తెలిపాడు. శరీర ధర్మానికి తగినట్లు తన నిర్ణయాలు ఉంటాయని, తనకు అదే ముఖ్యమని, బాడీకి తగినట్లు ఉండాలనుకున్నానని, అలాంటప్పుడు ట్రోఫీలు వదులుకోవడం పెద్ద సమస్య కాదని జోకో అన్నాడు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వ్యాక్సిన్లు తీసుకున్నానని, వ్యాక్సినేషన్ ప్రక్రియకు తానేమీ వ్యతిరేకం కాదు అని, శరీరంలోకి తీసుకునే వాటిపై వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని టెన్నిస్ స్టార్ తెలిపాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని కారణంగా మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన విషయం తెలిసిందే.