న్యూయార్క్: ఒకప్పుడు ఒక్క గోల్ కొట్టడమే గగనం. కానీ ఇప్పుడు గోల్స్ ఫైరింగ్ నడుస్తోంది. 2026 ఫిఫా వరల్డ్‌కప్‌లో .. టాప్ ప్లేయర్లు గోల్స్ స్కోరింగ్‌లో దూసుకెళ్తున్నారు. గ్రూప్ స్టేజ్‌లోనే ఈ టోర్నీ.. గోల్డెన్ బూట్(Golden Boot) రేసుగా మారింది. రెండు మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా స్టార్ మెస్సీ.. అయిదు గోల్స్‌తో లీడింగ్‌లో ఉన్నాడు. ఇక ఫ్రాన్స్ కెప్టెన్ కైలియన్ ఎంబాప్పే, నార్వే ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ నాలుగేసి గోల్స్‌తో తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 1954 తర్వాత తొలి సారి తొలి రెండు మ్యాచుల్లోనే ముగ్గురు ఆటగాళ్లు నాలుగేసి గోల్స్ చేశారు.
గోల్ స్కోరింగ్‌లో మెస్సీ ముందున్నాడు. వరల్డ్‌కప్‌లోనే రికార్డు స్థాయిలో గోల్స్ చేశాడు. మంగళవారం మ్యాచ్‌లో ఆస్ట్రియాపై రెండు గోల్స్ చేసి .. ఆల్‌టైం గోల్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు అతను ప్రపంచ కప్ పోటీల్లో 18 గోల్స్ చేశాడు. ఇక 100వ మ్యాచ్ ఆడుతున్న ఎంబాప్పే ఇరాక్‌పై రెండు గోల్స్ చేశాడు. ఇక సెనిగల్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే ప్లేయర్ హాలాండ్ రెండు గోల్స్ చేశాడు. ఓ ప్లేయర్‌ను మించి మరో ప్లేయర్ తమ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈ టోర్నీలో ప్రపంచ రికార్డులు భారీగా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోల్డెన్ బూట్ కోసం కాదు.. పెద్ద ప్లేయర్లు ఏకంగా ఆల్ టైం రికార్డుపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని ఓ స్టార్ పేర్కొన్నాడు.
జర్మనీ ప్లేయర్ క్లోస్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును మెస్సీ బ్రేక్ చేశాడు. 28 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడిన అతను ఇప్పటికే 18 గోల్స్ చేశాడు. ఇక తాజా టోర్నీలో అతను అయిదు గోల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. మెస్సీ వెంటే ఎంబాప్పే ఉన్నాడు. ఫ్రాన్స్ కెప్టెన్ వరల్డ్‌కప్ మ్యాచుల్లో మొత్తం 16 గోల్స్ చేశాడు. మెస్సీ టార్గెట్‌ను బ్రేక్ చేసే యోచనలో ఎంబాప్పే ఉన్నట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల నార్వే ప్లేయర్ హాలాండ్ రెండు మ్యాచుల్లో నాలుగు గోల్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న అతను .. నార్వే తరపున 52 మ్యాచుల్లో 60 గోల్స్ చేశాడు. ఇంగ్లండ్ ప్లేయర్ కేన్ కూడా గోల్స్ రేసులో దూసుకొస్తున్నాడు.
1958లో ఫ్రాన్స్ ప్లేయర్ జస్ట్ ఫొంటేన్ అత్యధికంగా ఆ వరల్డ్‌కప్ టోర్నీలో 13 గోల్స్ చేశాడు. అతని రికార్డును దృష్టిలో పెట్టుకుని తాజా ప్లేయర్లు ఆడుతున్నట్లు భావిస్తున్నారు. గతంలో ఫొంటేన్, గెర్డ్ ముల్లర్(జర్మనీ), సాండర్ కోసిస్(హంగేరీ) ఆటగాళ్లు మాత్రమే వరల్డ్‌కప్ పోటీలో రెండు అంకెల గోల్స్ చేశారు. అయితే ఈ టోర్నీ ముగిసేలోగా ఆ ఆటగాళ్ల లిస్టులో కొత్త ప్లేయర్లు కలిసే అవకాశాలు ఉన్నాయి.