ఢిల్లీ: ఐపీఎల్-19లో ఆలస్యంగాగెలుపు బాట పట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో నైట్‌రైడర్స్.. 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఓపెనర్ ఫిన్ అలెన్ (47 బంతుల్లో 100 నాటౌట్, 5 ఫోర్లు, 10 సిక్స్‌లు) విధ్వంసకర ఆటతీరుతో రెచ్చిపోయి తన ఐపీఎల్ కెరీర్లో తొలి శతకంతో విజృంభించిన వేళ.. క్యాపిటల్స్ నిర్దేశించిన 148 పరుగుల ఛేదనను కేకేఆర్ 14.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది.
కామెరూన్ గ్రీన్ (33 నాటౌట్) అతడికి అండగా నిలిచాడు. పతుమ్ నిశాంక (29 బంతుల్లో 50, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అశుతోష్ శర్మ (28 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకోవడంతో క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 142/8 చేయగల్గింది. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి (2/25), అనుకుల్ రాయ్ (2/31), సునీల్ నరైన్ (1/17) ప్రత్యర్థిని కట్టడి చేశారు. కాగా ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరగా ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడిన ఢిల్లీ ఎనిమిదో ప్లేస్‌కు పడిపోయింది. అలెన్కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
స్వల్ప ఛేదనలో ఓపెనర్ రహానే (13)తో పాటు రఘువంశీ (1) వికెట్లను వెంటవెంటనే కోల్పోయినా అలెన్ వీరబాదుడుతో కేకేఆర్ విజయం తేలికైంది. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ప్రారంభించిన అతడు.. కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విప్రాజ్, కుల్దీప్ ఓవర్లలో రెండేసి బౌండరీలు, సిక్స్‌లు బాదాడు. 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడిచ్చిన క్యాచ్‌ను స్టబ్స్ జారవిడిచాడు. ఆ అవకాశాన్ని కివీస్ ఓపెనర్ చక్కగా వినియోగించుకున్నాడు. ఇన్నింగ్స్ సగానికి కోల్‌కతా 75/2 పరుగులే చేసినా ఆ తర్వాత అలెన్ విధ్వంసం మొదలైంది. స్టార్క్ 11వ ఓవర్లో సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన అలెన్.. గ్రీన్ అండతో చెలరేగిపోయాడు. విప్రాజ్ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడిన అతడు.. కుల్దీప్ 14వ ఓవర్లోనూ రెండుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపించి శతకానికి చేరువయ్యాడు. ముకేశ్ విసిరిన 14వ ఓవర్ రెండో బంతిని సిక్స్‌గా మలిచి 47 బంతుల్లోనే ఐపీఎల్లో మొదటి సెంచరీని అందుకోవడమే గాక మ్యాచ్‌నూ ముగించాడు. గ్రీన్, అలెన్ జోడీ మూడో వికెట్‌కు 64 బంతుల్లోనే 116 పరుగులు జోడించింది.
నిశాంక, రాహుల్ (14 బంతుల్లో 23, 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఇన్నింగ్స్‌ను ఢిల్లీ మెరుగ్గానే ఆరంభించినా నిలకడలేమి, పేలవ బ్యాటింగ్‌తో మరోసారి ఖంగుతింది. పవర్ ప్లే ముగిశాక గాడి తప్పి 3 ఓవర్ల వ్యవధిలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడి తక్కువ స్కోరుకే పరిమితమైంది. బౌండరీతో నిశాంక తన ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టగా చకచకా ఫోర్లు బాదిన రాహుల్‌ను కార్తీక్ 5వ ఓవర్లో ఆఖరి బంతికి ఔట్ చేసి క్యాపిటల్స్‌కు తొలి షాకిచ్చాడు. పవర్ ప్లే ముగిసేసరికి 55/1తో నిలిచిన ఢిల్లీ 8వ ఓవర్లో నితీశ్ రాణా (8) వికెట్‌నూ కోల్పోయింది. మూడో స్థానంలో వచ్చిన రిజ్వి (3).. నరైన్ బౌలింగ్‌లో పావెల్ చేతికి చిక్కాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చూడచక్కని షాట్లతో అలరించిన నిశాంక.. 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తిచేశాడు.
కానీ రెండో స్పెల్‌లో బౌలింగ్‌కు వచ్చిన అనుకుల్.. ఒకే ఓవర్లో ఆతిథ్య జట్టుకు డబుల్ స్ట్రోకులిచ్చాడు. మొదట నిశాంకను ఊరించే డెలివరీతో బోల్తా కొట్టించి ఐదో బంతికి ప్రమాదకర స్టబ్స్ (2)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో ఢిల్లీ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 7.5 ఓవర్లకు 74/2తో ఉన్న డీసీ.. 20 బంతుల వ్యవధిలో మిడిలార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. ఈ దశలో కెప్టెన్ అక్షర్ (11)తో కలిసి అశుతోష్ ఢిల్లీని ఆదుకునే యత్నం చేశాడు. అక్షర్ 22 బంతుల్లో 11 పరుగులే చేసినా అశుతోశ్ క్రీజులో కుదురుకున్నాక వరుణ్ 17వ ఓవర్లో 6, 4, 4 దంచాడు. ఆ తర్వాత వైభవ్ బౌలింగ్‌లోనూ సిక్స్, ఫోర్‌తో క్యాపిటల్స్‌కు చెప్పుకోదగ్గ స్కోరును అందించాడు.
ఢిల్లీ: 20 ఓవర్లకు 142/8 (నిశాంక 50, అశుతోష్ 39, త్యాగి 2/25, అనుకుల్ 2/31)
కోల్‌కతా: 14.2 ఓవర్లకు 147/2 (అలెన్ 100*, గ్రీన్ 33*, అక్షర్ 1/27)
