పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ యానిక్ సినర్‌కు ఊహించని షాక్ ఎదురైంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ముందు అప్రతిహత విజయాలతో టైటిళ్లు కొల్లగొట్టిన ఈ ఇటలీ స్టార్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆదిలోనే తన పోరాటాన్ని ముగించాడు. గత ఫిబ్రవరి నుంచి వరుసగా 30 విజయాలతో ఓటమి ఎరుగని సినర్‌కు టోర్నీ రెండో రౌండ్లోనే చుక్కెదురైంది.
స్పెయిన్ నయాబుల్ కార్లోస్ అల్కరాజ్ గైర్హాజరీలో ఈసారి టైటిల్ ఫెవరేట్‌గా కనిపించిన సినర్‌కు కెరీర్ గ్రాండ్‌స్లామ్ కలగానే మిగిలిపోయింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సినర్ 6-3, 6-2, 5-7, 1-6, 1-6తో అర్జెంటీనా యువ ప్లేయర్ యువాన్ మాన్యుయెల్ సెరున్దొలో చేతిలో అనూహ్య ఓటమి చవిచూశాడు. చారిత్రక ఫిలిప్ చాట్రియర్ కోర్టు వేదికగా జరిగిన పోరు అభిమానులకు పైసా వసూల్ అందించింది.
నిప్పులు చెరిగే ఎండవేడిమి మధ్య జరిగిన పోరులో తొలుత 2-0 ఆధిక్యం కనబరిచిన సినర్..నిర్ణయాత్మక మూడో సెట్లో 5-4తో గెలుపు వాకిట నిలిచాడు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. అప్పటికే ప్రచండ సూర్యుని ధాటికి విలవిలలాడిపోయిన సినర్ మెడికల్ బ్రేక్ తీసుకున్నాడు. వేడి కారణంగా కోర్టులో చురుకుగా కదలలేకపోయిన ఈ వరల్డ్ నంబర్‌వన్ మ్యాచ్‌పై పట్టు కోల్పోయాడు. తిరిగి పుంజుకునేందుకు పలుమార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది.
ఇదే అదనుగా అప్పటి వరకు ఓటమి అంచుల్లో ఉన్న యువాన్..సినర్‌ను ఇబ్బందులకు గురిచేస్తూ కోర్టు నలువైపులా షాట్లు కొడుతూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. సినర్ అప్పటికే మూడో సెట్ కోల్పోవడం.. 56వ ర్యాంకర్ యువాన్ గట్టిపోటీనివ్వడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ క్రమంలో అన్‌సీడెడ్ అర్జెంటీనా ప్లేయర్‌కు ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయిన సినర్ వరుసగా 18 పాయింట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. దీంతో కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుద్దామనుకున్న సినర్ ఆశలపై సూర్యుడు నిప్పులు గుమ్మరించాడు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ 6-3, 6-2, 6-7(7-9), 6-3తో రోయర్పై గెలువగా, జ్వెరెవ్ 6-4, 6-2, 6-2తో మచాక్పై విజయంతో మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో నవోమి ఒసాకా 7-6(7-1), 6-4తో వెకిచ్పై గెలిచి ముందంజ వేసింది.