యూఎస్ ఓపెన్‌లో పోలిష్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ సంచలనం సృష్టించింది. ఈ 21 ఏళ్ల టెన్నిస్ స్టార్.. యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆన్స్ జబేర్‌పై 6-2, 7-6(5) తేడాతో విజయం సాధించింది. ఇది ఆమె కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడిన స్వియాటెక్.. యూఎస్ ఓపెన్ గెలుపొందడం తనకే ఆశ్చర్యం కలిగించిందని, కానీ డబ్ల్యూటీఏ (వుమెన్స్ టెన్సిస్ అసోసియేషన్) ఈవెంట్లలో మంచి ఫలితాలు వస్తాయని నమ్మానని చెప్పింది.
గ్రాండ్‌స్లామ్ గెలిచే స్థాయిలో తానున్నట్లు నమ్మకం కుదర్లేదని, మరీ ముఖ్యంగా వేగవంతమైన సర్ఫేస్ ఉండే యూఎస్ ఓపెన్ గెలుస్తానని అస్సలు అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘ఇది నేను కూడా ఊహించలేదనే మాట నిజం. అదే సమయంలో ఈ విజయంతో ఆకాశమే నా హద్దు అనిపిస్తోంది. చాలా గర్వంగా ఉంది. అలాగే చాలా ఆశ్చర్యంగానూ ఉంది. కానీ ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషిస్తున్నా’ అని ఇగా తెలిపింది.