ఢిల్లీ: ఐపీఎల్లో ఉపయోగించే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై మరో క్రికెటర్ పెదవి విరిచాడు. ఈ నిబంధన ద్వారా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందని వాదనలు వినిపిస్తున్న వేళ తాజాగా దీనిపై భారత స్టార్ ఆల్‌రౌండర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ మాట్లాడుతూ.. ‘ఆ నిబంధన నాకు నచ్చదు. స్వతహాగా నేను ఆల్‌రౌండర్‌ను.
గతంలో మేం ఈ రోల్ (బ్యాటింగ్, బౌలింగ్ చేసేవారు) కోసం ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అవసరాన్ని బట్టి బ్యాటర్, బౌలర్‌ను వాడుకుంటున్నది. అదే సమయంలో మనకు ఆల్‌రౌండర్ అవసరమా? అన్న చర్చ తలెత్తుతున్నది. నేను దీనికి వ్యతిరేకమైనా రూల్స్ అంటే రూల్సే కదా. మనం వాటిని పాటించాలి’ అని అన్నాడు. గతంలో రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.