ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఎలాగైనా తిరిగి టైటిల్ నిలబెట్టుకోవాలని ఈ పోలాండ్ ప్లేయర్ ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో అమెరికా ప్లేయర్ క్లేర్ లియుపై అలవోక విజయం సాధించింది. అద్భుత ప్రదర్శన కనబరిచిన స్వియాటెక్..లియును వరుస సెట్లలో చిత్తుచేస్తూ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. రిబకినా, రూడ్ తమకు తిరుగులేదన్నట్లుగా టోర్నీలో దూసుకెళుతున్నారు.
పారిస్ : డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ టైటిల్ వేటలో జోరు ప్రదర్శిస్తున్నది. రౌండ్ రౌండ్‌కు తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతున్నది. గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో స్వియాటెక్..అమెరికాకు చెందిన క్లెర్ లియును మట్టికరిపించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో స్వియాటెక్ 6-4, 6-0తో లియుపై అద్భుత విజయం సాధించింది. గంటన్నర పాటు సాగిన పోరులో ఈ పోలాండ్ భామ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి ఒకింత ప్రతిఘటన ఎదురైనా మలి సెట్లో స్వియాటెక్‌కు తిరుగులేకుండా పోయింది. కచ్చితమైన బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో చెలరేగిన ఈ డిఫెండింగ్ చాంప్ ఒకే ఏస్‌కు పరిమితమైనా..ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసి తనకెదురు లేదని నిరూపించుకుంది. రెండో సెట్లో ప్రత్యర్థికి ఒక్క గేమ్నుకూడా వదులుకోకుండా అంతా తానై విజయవిహారం చేసింది. వరుసగా ఏడు గేమ్‌లను గెలుచుకుని మ్యాచ్‌కు ముగింపు పలికింది. మరోవైపు మహిళల నాలుగో సీడ్ ఎలెనా రిబకినా వరుస సెట్లలో 6-3, 6-3తో 18 ఏళ్ల లిండా నొస్కోవపై గంటా 26 నిమిషాలలో విజయం సాధించింది. ఆరడుగుల రిబకినా తన హైట్‌ను అనుకూలంగా మలచుకుని ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించింది.
రిబకినా 30 విన్నర్లు సర్వ్ చేయగా, లిండా 16 విన్నర్లు మాత్రమే సంధించింది. కాగా ఇరువురూ 26 అనవసర తప్పిదాలకు పాల్పడ్డారు. రిబకినా తనకు లభించిన పది బ్రేక్ పాయింట్లలో మూడింటిని సద్వినియోగం చేసుకోగా, లిండా నాలుగింటిలో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. 20వ సీడ్ మాడిసన్ కీస్ 74 అనవసర తప్పిదాలతో ఓటమి కొనితెచ్చుకుంది. అమెరికాకే చెందిన కేలా డే 6-2, 4-6, 6-4తో కీస్పై గెలుపొందింది. మిగతా సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ ఆన్స్ జేబర్ 6-2, 6-3తో ఓషియన్ డోడిన్పై, 14వ సీడ్ హదద్ మయా 6-2, 5-7, 6-4తో డయాన స్నైడర్పై, 23వ సీడ్ ఏక్టరీనా అలెగ్జాండ్రోవా 6-2, 6-0తో అనలీనా ఫ్రీడ్సమ్పై, బెర్నార్డ పెరా 3-6, 6-4, 6-3తో 22వ సీడ్ డోనా వెకిక్‌పై, మియర్రా ఆండ్రీవా 6-1, 6-2తో డయాన్ పారీపై, వాంగ్ జిన్యు 7-6(7-5), 6-2తో రెబెక్క పీటర్సన్పై, ఎలిజబెత్ కొసియారెట్టో 6-2, 6-3తో సిమోవా వాల్టర్ట్పై, సొరిబెస్ టొర్మో 6-4, 6-1తో పెట్రా మార్టిక్పై, అన్నా కరోలినా స్మిడ్లోవా 6-3, 6-4తో అలియోన బొల్సోవాపై, ఎలినా అవనెస్యన్ 6-0, 7-5తో లియోలియ జీన్జీన్పై, ఓల్గా డానిలొవిచ్ 6-2, 7-5తో జాస్మిన్ పావోలినిపై విజయాలు నమోదు చేశారు.
రూడ్ దూకుడు : పురుషుల సింగిల్స్‌లో నాలుగు గంటలపాటు హోరాహోరీగా సాగిన పోరులో కాస్పర్ రూడ్ 6-3, 6-2, 4-6, 7-5తో గియోలియొ జెప్పీరిపై విజయం సాధించాడు. రూడ్ రెండు ఏస్‌లు, జెప్పీరి 9 ఏస్‌లు సర్వ్ చేశాడు. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో రూడ్ అయిదు బ్రేక్ పాయింట్లను అనుకూలంగా మలుచుకుని విజయాన్నందుకున్నాడు. రూడ్ రెండో సర్వీసులో ఎక్కువ పాయింట్లు రాబట్టి ఆధిక్యం ప్రదర్శించాడు. సొంత సర్వీసులో పాయింట్లు రాబట్టడంలో రూడ్ ప్రత్యర్థి కంటే మెరుగ్గా రాణించాడు. ఇతర మ్యాచ్‌లలో 28వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ 7-6(7-4), 6-3, 6-4తో ఎమిల్ రుసువోరిపై, 27వ సీడ్ యొషిహితో నిషిఓక 4-6, 6-2, 7-5, 6-4తో మాక్స్ పర్సెల్‌పై, 15వ సీడ్ బోర్న కొరిచ్ 6-3, 4-6, 4-6, 6-3, 6-4తో పెడ్రో కచిన్పై, థామస్ మార్టిన్ 6-3, 7-6(7-2), 6-3తో 18వ సీడ్ అలెక్స్ డి మినార్‌పై , డేనియల్ ఆల్టమీర్ 6-7(0-7), 7-6(9-7), 1-6, 7-6(7-4), 7-5తో ఎనిమిదో సీడ్ జానిక్ సిన్నర్‌పై, 12వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫొ 3-6, 6-3, 7-5, 6-2తో అస్లాన్ కరెత్సెవ్పై, సెబోత్ వైల్డ్ 6-3, 3-6, 6-4, 6-3తో గిడొ పెల్లాపై గెలుపొందారు.