బెంగళూరు: ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు ఝలక్. పెట్టని కోటలాంటి చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రతీ ఏడాది లాగే ఈసారి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కోసం ఆర్సీబీ టీమ్ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగింది. మ్యాచ్ విషయానికొస్తే..ఆర్సీబీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. స్టబ్స్(47 బంతుల్లో 60 నాటౌట్, 4ఫోర్లు, సిక్స్), కేఎల్ రాహుల్(34 బంతుల్లో 57, 6ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో రాణించారు.
భువనేశ్వర్(3/26) పొదుపు పాటించగా, సలామ్(4-0-40-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ నిస్సనక(1) వికెట్ కోల్పోయిన ఢిల్లీని రాహుల్, స్టబ్స్ ఆదుకున్నారు. అంతకుముందు ఫిల్ సాల్ట్(38 బంతుల్లో 63, 4ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఆర్సీబీ 20 ఓవర్లలో 175/8 స్కోరు చేసింది. కోహ్లీ(19), పడిక్కల్(18), కెప్టెన్ పటిదార్(8), జితేశ్శర్మ(14), షెఫర్డ్(1), కృనాల్ (12) స్వల్ప స్కోర్లకు కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్లు సఫలమయ్యారు. అక్షర్‌పటేల్(2/18), కుల్దీప్(2/32) రెండేసి వికెట్లు తీశారు.
ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్లో కావాల్సిన పరుగులు 15. అప్పటికే క్రీజులో కుదురుకున్న స్టబ్స్‌కు జతగా మిల్లర్. కానీ ఢిల్లీ అభిమానుల్లో ఏదో మూలన సందేహం. గుజరాత్‌తో మ్యాచ్‌లో సింగిల్ నిరాకరించి మ్యాచ్ చేజార్చుకున్న వైనం కండ్ల ముందు కదలాడుతున్న వైనం. కానీ మిల్లర్ మరోమారు అలాంటి తప్పిదం చేయలేదు. అప్పటివరకు మ్యాచ్‌పై పట్టు కనబరిచిన ఆర్సీబీ..రూథర్‌ఫర్డ్‌ను బౌలింగ్‌కు దింపింది. తొలి రెండు బంతులు సింగిల్స్‌కు పరిమితమైన రూథర్‌ఫర్డ్‌ను మిల్లర్ గట్టిగా అరుసుకున్నాడు.
మూడో బంతికి డీప్ మిడ్‌వికెట్ మీదుగా మిల్లర్ కండ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. అదే ఊపులో నాలుగో బంతికి మరో సిక్సర్‌తో మ్యాచ్‌ను ఆర్సీబీని లాగేసుకున్నాడు. దీంతో సమీకరణం కాస్తా రెండు బంతుల్లో ఒక పరుగుకు మారింది. అప్పటికే మంచి జోష్‌లో ఉన్న మిల్లర్ ఫోర్‌తో మ్యాచ్‌ను ఘనంగా ముగించాడు. ఇదిలా ఉంటే రాహుల్, స్టబ్స్ కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. రాహుల్ ఔటైనా..అక్షర్(26 రిటైర్డ్‌హర్ట్)తో స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిల్లర్‌తో కలిసి స్టబ్స్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
బెంగళూరు: 20 ఓవర్లలో 175/8 (సాల్ట్ 63, డేవిడ్ 26, అక్షర్‌పటేల్ 2/18, కుల్దీప్ 2/32),
ఢిల్లీ: 19.5 ఓవర్లలో 179/4(స్టబ్స్ 60 నాటౌట్, రాహు ల్ 57, భువనేశ్వర్ 3/26, కృనాల్ 1/24)