AUS vs PAK | చిన్నస్వామిలో చితక్కొట్టారు.. ఆసీస్ భారీ స్కోరు.. పాక్ ముందు కొండంత లక్ష్యం
AUS vs PAK | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 18వ లీగ్ మ్యాచ్‌లో కంగారూలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ శతకాలతో చెలరేగారు.
AUS vs PAK | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 18వ లీగ్ మ్యాచ్‌లో కంగారూలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (124 బంతుల్లో 163, 14 ఫోర్లు, 9 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (108 బంతుల్లో 121, 10 ఫోర్లు, 9 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా.. 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒకదశలో 450 ఈజీగా కొట్టేస్తుందని భావించినా ఆఖర్లో తడబడిన ఆసీస్ 367కే పరిమితమైంది. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది మినహా మిగిలినవారంతా తేలిపోయారు. ముఖ్యంగా ఉసామా మిర్, హరీస్ రౌఫ్‌లు అయితే ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. షహీన్ షా అఫ్రిది ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే పాకిస్తాన్ కొండను కరిగించాల్సిందే..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు ఓపెనర్లు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. బాబర్ ఆజమ్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకుండా దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ లైన్ దాటించారు. 39 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన వార్నర్.. 85 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వార్నర్‌కు వన్డే వరల్డ్ కప్‌లో ఇది ఐదో సెంచరీ కావడం గమనార్హం. ఇన్నింగ్స్ ఆదినుంచి సిక్సర్లతో విరుచుకుపడిన మార్ష్ కూడా 46 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోగా వంద బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. వీళ్ల దూకుడుతో 20 ఓవర్లకే 150 పరుగులు దాటిన ఆసీస్ స్కోరు.. 30 ఓవర్లకే రెండు వందల మార్కు దాటింది. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ ఏకంగా 259 పరుగులు జోడించారు. ఫీల్డింగ్‌లో పాక్ మూడు క్యాచ్‌లను జారవిడిచి భారీ మూల్యం చెల్లించుకుంది.
వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యుత్తమ తొలి వికెట్ భాగస్వామ్యం. సెంచరీ తర్వాత మార్ష్ ఎట్టకేలకు షహీన్ షా అఫ్రిది వేసిన 33వ ఓవర్ ఐదో బంతికి ఉసామా మిర్ చేతికి చిక్కగా మరుసటి బంతికే గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా భారీ షాట్ ఆడబోయి బాబర్ ఆజమ్ కు క్యాచ్ ఇచ్చాడు. 35 ఓవర్లకే 260 పరుగులు చేసిన ఆసీస్ ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. స్టీవ్ స్మిత్ (7) కూడా విఫలమయ్యాడు.
150 పరుగులు పూర్తిచేసుకున్న వార్నర్ డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడని అనిపించినా హరీస్ రౌఫ్ అతడికి చెక్ పెట్టాడు. రౌఫ్ వేసిన 42వ ఓవర్ రెండో బంతికి వార్నర్.. షాదాబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. మూడు బౌండరీలు బాదిన జోష్ ఇంగ్లిస్ (13) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఒకదశలో 450 ఈజీగా బాదుతుందని ఆశించిన ఆసీస్ జోరుకు ఆఖర్లో పాక్ బౌలర్లు కళ్లెం వేశారు. 24 బంతులాడి ఓ ఫోర్, సిక్సర్‌తో 21 పరుగులు చేసిన స్టోయినిస్‌ను కూడా షహీన్ ఔట్ చేశాడు. చివర్లో పరుగులు చేయడానికి తంటాలుపడ్డ ఆసీస్.. వరుసగా వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది ఐదు వికెట్లు తీయగా మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. హరీస్ రౌఫ్‌ను లక్ష్యంగా చేసుకున్న కంగారూలు.. అతడికి చుక్కలు చూపించారు. 9 ఓవర్లు వేసిన రౌఫ్ ఏకంగా 83 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఉసామా మిర్ కూడా 9 ఓవర్లలో 82 పరుగులిచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

