Amazon: ఇటీవలే వన్డే ప్రపంచకప్‌ను ఆరోసారి గెలిచిన ఆస్ట్రేలియా.. వచ్చే నాలుగేండ్లకు అమెజాన్ ప్రైమ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియాలో రాబోయే నాలుగేండ్లకు గాను ఐసీసీ టోర్నీల ప్రసార హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సంప్రదాయకంగా ఆస్ట్రేలియాలో క్రికెట్ అభిమానులు ఛానెల్ 9, ఫాక్స్, సెవెన్ ఛానెల్స్‌లో మ్యాచ్‌లు ప్రసారమవుతాయి. కానీ ఇకనుంచి ఫాక్స్, సెవెన్ మాత్రమే ఆస్ట్రేలియా స్వదేశంలో మ్యాచ్‌లను ప్రసారం చేయనుండగా ఐసీసీ టోర్నీలు మొత్తం ప్రైమ్‌లోనే ప్రసారం కానున్నాయి. ఈ ఒప్పందంతో కంగారూ అభిమానులు ఇకనుంచి టీవీలలో ఉచితంగా ఐసీసీ ట్రోఫీలను లైవ్‌గా వీక్షించడం కుదరదు.
రాబోయే నాలుగేండ్లలో మెన్స్ టీ20 వరల్డ్ కప్ (2024 అమెరికా, వెస్టిండీస్), ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ (2024, బంగ్లాదేశ్), మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ (2025, పాకిస్తాన్), వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025, ఇంగ్లండ్), ఉమెన్స్ వరల్డ్ కప్ (2025, ఇండియా), మెన్స్ టీ20 వరల్డ్ కప్ (ఇండియా, శ్రీలంక), ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ (2026, ఇంగ్లండ్), ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ (2027, శ్రీలంక), మెన్స్ వరల్డ్ కప్ (2027, సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే) లు ఆస్ట్రేలియా అభిమానులు చూడాలంటే ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉండాల్సిందే.