Wangchuk | లడఖ్ కోసం సోనమ్ వాంగ్‌చుక్ ఎందుకు పోరాడుతున్నారు.. ఇంతకూ ఎవరీయన ?
Wangchuk | లడఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్లతో మార్చి 6 నుంచి అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష కొనసాగింది.
Wangchuk | కేంద్ర ప్రభుత్వం 370 అధికరణం రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్ నుంచి లడఖ్‌ను విడగొట్టింది. కొండకోనల్లో ఉండే ఈ చిన్న భూభాగానికి కేంద్రం ఆ సందర్భంగా ఎన్నో హామీలిచ్చింది. కానీ, అవేవీ తీర్చకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో లఢఖ్‌లో అంతకంతకూ అసమ్మతి పెరుగుతూ వస్తున్నది. ఈ అసమ్మతి క్రమంగా పోరాట రూపం సంతరించుకున్నది. లడఖ్ రాజ్యాంగ హక్కుల కోసం,విశిష్ట పర్యావరణ, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అక్కడి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి ప్రతీకలా నిలుస్తున్నవారు సోనమ్ వాంగ్‌చుక్. 21 రోజుల నిరశన దీక్షతో ఇటీవల దేశమంతటా వార్తల్లో నిలిచారాయన.
లడఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్లతో మార్చి 6 నుంచి అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష కొనసాగింది. దీక్ష విరమణ తర్వాత రిలే దీక్షలు కొనసాగుతాయని వాంగ్‌చుక్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా లడఖ్ ఉద్యమానికి మద్దతు కూడా పెరుగుతున్నది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, గిరిజన తెగలను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా స్థానిక స్వపరిపాలన అవకాశం కల్పించడం, స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నది ఆయన డిమాండ్లలో ప్రధానాంశాలు. పర్యావరణం కోసం కూడా ఆయన పోరాడుతున్నారు. ఇంతకూ ఎవరీ వాంగ్‌చుక్? ఈయన వృత్తి రాజకీయం కాదు. వాంగ్ ఇంజినీరింగ్‌లో దిట్ట. సంప్రదాయేతర విద్యావిధాన రూపకర్తగా ఆయన పేరుపొందారు. ముఖ్యంగా లడఖ్ నీటి సమస్యను పరిష్కరించిన ప్రయోగశీలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. లెక్కలేనన్ని ఆవిష్కరణలకు ఆద్యుడిగా నిలిచారు. తాను చేసిన కృషికి గుర్తింపుగా అనేక అవార్డులు అందుకున్నారు. 2018లో రామన్ మెగసెసె అవార్డు పొందడం విశేషం. ఐసీఏ పురస్కారం, సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, రోలెక్స్ అవార్డ్, ఇంటర్నేషనల్ టెర్రా అవార్డుతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి. ఈ నేపథ్యంలో వాంగ్ పోరాట పటిమను తెలియజెప్పే ప్రయత్నమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం.
భారత్‌లోనే అత్యంత అందమైన ప్రదేశం లడఖ్. అద్భుతమైన, సహజమైన ప్రకృతి అందాలకు, ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. హిమానీనదాలు కరిగినప్పుడు వచ్చే నీరే తాగునీటికి, సాగు నీటికి ఆధారం. ఈ ప్రాంతం అధిక ఎత్తులో ఉన్నందున, వాతావరణ మార్పుల కారణంగా హిమానీనదాల నీరు దిగువ ప్రాంతానికి ప్రవహిస్తుంది. కాబట్టి, లడఖ్‌లో ఏప్రిల్-మే నెలల్లో తీవ్రమైన నీటిఎద్దడి ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. నీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో అక్కడి ప్రజలు వలసబాట పట్టేవారు.
మెకానికల్ ఇంజినీర్ అయిన సోనమ్ వాంగ్‌చుక్ ఒకరోజు వంతెన కింద నడుచుకుంటూ వెళ్తుండగా, వంతెన కిందిభాగం మంచుతో కప్పి ఉండటాన్ని గమనించారు. వాతావరణం కారణంగా చుట్టుపక్కల మంచు కరిగిపోయినా వంతెన కింది భాగం కరగలేదు. వంతెన కింది భాగంలో మంచు ఎందుకు కరగడం లేదో తెలుసుకోవడానికి ఆయన అనేక ప్రయోగాలు చేసిన తర్వాత సూర్యకాంతి లేనందున మంచు కరగలేదనే విషయాన్ని తెలుసుకున్నారు. మంచును సూర్యుడి నుంచి నీడగా ఉంచగలిగితే హిమం ఎక్కువకాలం ఉంటుందని వాంగ్ చుక్ ఈ సందర్భంగా గ్రహించారు.
నీటి సమస్యను ఎదుర్కోవడానికి వాంగ్ చుక్కి వచ్చిన సరికొత్త ఆలోచనే ‘మంచు స్థూపం’. ఈ ఆలోచనను అమలు చేసి 2014 ఫిబ్రవరిలో దాదాపు 1,50,000 లీటర్ల శీతాకాలపు నీటి ప్రవాహాన్ని నిల్వ చేయగల మంచుస్థూపాన్ని ఆయన నిర్మించారు. ఆ తర్వాత క్రమక్రమంగా మంచు స్థూపాల సంఖ్య పెరిగాయి. ప్రస్తుతం 27 మంచు స్థూపాలు ఉన్నాయి. అలా ఏర్పాటు చేసిన ప్రతి మంచుస్థూపం నుంచి రోజుకు 5,000 లీటర్ల నీటి లభ్యత ఉండటం ఆయన ప్రతిభకు నిదర్శనం. వాంగ్‌చుక్
కృషి ఫలితంగానే లడఖ్ ప్రాంత నీటి సమస్యకు పరిష్కారం లభించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
లడఖ్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన 1988లో స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడఖ్ (సెక్మోల్)ని స్థాపించారు. ఆ సంస్థ నేతృత్వంలో పలు విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. వాంగ్‌చుక్ విద్యా విధానం విప్లవాత్మకమైనది. ఆచరణాత్మక, పర్యావరణ అనుకూల విద్యను బోధించడమే దాని ప్రత్యేకత. పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన, ఉత్తీర్ణత సాధించినప్పటికీ నైపుణ్యాలు లేని లడఖ్ యువతకు సంప్రదాయేతర విద్యావకాశాలను అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ బడుల్లో మాతృభాష లడఖీలోనే విద్యాబోధన జరుగుతుంది. అలాగే దివ్యాంగులు, అనాథలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పేద విద్యార్థులకు స్పాన్సర్‌షిప్‌లు కూడా ఇప్పిస్తారు. విద్యార్థులకు ప్రాక్టికల్ సైన్స్, సామాజిక సమస్యల నుంచి పబ్లిక్ స్పీకింగ్, గార్డెనింగ్, జంతువులు, చెట్ల సంరక్షణ, లడఖీ పాటలు, నృత్యం, సాంస్కృతిక విద్య లాంటి విభిన్న అంశాల్లో శిక్షణ ఇస్తారు. మూసధోరణి కాకుండా విద్యార్థుల్లో ఆచరణాత్మక, సామాజిక, వృత్తి నైపుణ్యాలను పెంపొందిస్తారు. లడఖ్ ప్రాంత విద్యాభివృద్ధికి సోనమ్ చేసిన సేవలకు ప్రశంసలు దక్కాయి.
2021లో వాంగ్‌చుక్ లడఖ్ ప్రాంతంలోని సియాచిన్, గల్వాన్ లోయ వంటి అత్యంత శీతల ప్రదేశాల్లో ఆర్మీ సిబ్బంది ఉపయోగించగల పర్యావరణ అనుకూలమైన సోలార్ హీటెడ్ టెంట్‌ను రూపొందించారు. భీకరమైన శీతల గాలులను ఎదుర్కొనేందుకు మట్టితో తయారు చేసిన చవకైన సౌర ఉష్ణ భవనాలను రూపొందించడంలో కూడా కీలకపాత్ర పోషించారు. వాంగ్ చుక్ వ్యక్తిత్వం 2009లో వచ్చిన ‘3 ఇడియట్స్’ చిత్రంలోని కాల్పనిక పాత్ర ఫున్సుఖ్ వాంగ్డుకు స్ఫూర్తినిచ్చిందని అంటారు.
-కోట దామోదర్
93914 80475
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

