నూనెల వడపోతకు డేంజర్ కెమికల్స్
వంట నూనెను రోజుల తరబడి మళ్లీ మళ్లీ ఉపయోగించడానికి సింథటిక్ మెగ్నీషియం సిలికేట్ అనే ప్రాణాంతక రసాయనాన్ని వాడుతున్నారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం కల్తీ ఆహారాన్ని విక్రయించడం తీవ్రమైన నేరం. కానీ హైదరాబాద్‌లో యథేచ్ఛగా ఆహార కల్తీ జరుగుతున్నది.
ఇటీవల ఆహార భద్రతా అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెల్లడవుతున్న వాస్తవాలు సమాజాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ ఫ్రాంచైజీ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై అధికారులు నిర్వహించిన దాడుల్లో అత్యంత దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. శుభ్రతకు మారుపేరుగా ప్రచారం చేసుకునే కంపెనీల ఆహార కేంద్రాల్లో భయంకరమైన వాతావరణం నెలకొన్నది. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై బొద్దింకలు స్వేచ్ఛగా విహరిస్తున్న దృశ్యాలను అధికారులు స్వయంగా గుర్తించారు. వీటన్నింటికీ మించి మరో అత్యంత ప్రమాదకరమైన నేరాన్ని అధికారులు గుర్తించారు.
వంట నూనెను రోజుల తరబడి మళ్లీ మళ్లీ ఉపయోగించడానికి సింథటిక్ మెగ్నీషియం సిలికేట్ అనే ప్రాణాంతక రసాయనాన్ని వాడుతున్నారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం కల్తీ ఆహారాన్ని విక్రయించడం తీవ్రమైన నేరం. కానీ హైదరాబాద్‌లో యథేచ్ఛగా ఆహార కల్తీ జరుగుతున్నది. ప్రముఖ ఫుడ్ అవుట్‌లెట్స్‌లో రీసైకిల్ చేసిన నూనెను శుభ్రపరచడానికి వాడుతున్న సింథటిక్ మెగ్నీషియం సిలికేట్‌ను అధికారులు సీజ్ చేశారు. ఆహార పదార్థాల్లో దీని వాడకంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలను రూపొందించింది. తక్కువ నాణ్యత గల, వేడి చేసిన నూనెలను ఫిల్టర్ చేయడానికి సింథటిక్ మెగ్నీషియం సిలికేట్‌ను వాడటం ఆరోగ్యానికి హానికరం. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వ్యాపార సంస్థల చర్యలను అధికారులు తీవ్రంగా పరిగణించాలి. రసాయన అవశేషాలు నేరుగా మానవ శరీరంలోకి ప్రవేశించి కోలుకోలేని నష్టాన్ని కలుగజేస్తాయి. రసాయనాలతో కూడిన ఆహారం నేరుగా వినియోగదారుల ప్రాథమిక ఆరోగ్య హక్కును హరిస్తుంది. ఇది నూనెలోని నలుపు రంగును, వాసనను మాత్రమే తొలగిస్తుంది కానీ, పదేపదే వేడి చేయడం వల్ల అందులో ఏర్పడే టోటల్ పోలార్ కాంపౌండ్స్ (టీపీసీ), ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి విషపూరిత రసాయనాలను తొలగించలేదు. ఇటువంటి నూనెతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా, అది నేరుగా కడుపులోకి వెళ్తే జీర్ణకోశ ఇబ్బందులు, కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీయవచ్చు. అలాగే దీని పొడిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా కలుగుతాయి.
ఎలుకలు, బొద్దింకలు సంచరించే ప్రదేశాల్లో తయారైన ఆహారం ద్వారా టైఫాయిడ్, కలరా లాంటి వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. కేవలం వ్యాపార లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే ఈ చర్యలను న్యాయస్థానాలు వ్యవస్థీకృత నేరంగా, సామూహిక హత్యాయత్నంగా పరిగణించాలి. చట్టాన్ని ఉల్లంఘించే ఇలాంటి సంస్థలపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు దాడులు చేస్తున్నారు. ఒక నియంత్రణ సంస్థగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికిన వెంటనే సంబంధిత ఆహార కేంద్రాల లైసెన్సులను రద్దు చేయాలి. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న నియంత్రణ సంస్థల వైఫల్యాన్ని న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించాలి. నాణ్యతా లోపాలను చూసీ చూడనట్టు వదిలేసే అధికారులను సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించాలి. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, ఆహార కల్తీ కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచి, తనిఖీ చేసిన వెంటనే నివేదికలు వచ్చేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలి.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఆహార భద్రతా చట్టాలు ఇలాంటి బహుళ జాతీయ, జాతీయ స్థాయి చైన్ రెస్టారెంట్లను సమర్థవంతంగా నియంత్రించడానికి ఏమాత్రం సరిపోవడం లేదు. 2006 ఆహార భద్రతా చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని ఈ కార్పొరేట్ సంస్థలు చాలా సులభంగా జరిమానాలు చెల్లించి, మరుసటి రోజే వ్యాపారం ప్రారంభిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే సంస్థలకు కొన్ని లక్షల రూపాయల జరిమానా విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను కఠినతరం చేస్తూ వెంటనే సవరణలు తీసుకురావాలి.
కార్పొరేట్ సంస్థల లాభాపేక్ష ముందు ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టాలు కేవలం నామమాత్రమయ్యాయి. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని అక్రమార్కులు సులభంగా తప్పించుకొంటున్నారు. వ్యవస్థాగత మార్పులు తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ మోసాలకు అడ్డుకట్ట వేయగలం. ఆహార కల్తీని, ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని నాన్ బెయిలబుల్ క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ చట్ట సవరణ చేయాలి. ఒక ప్రాంతంలో స్థానిక బ్రాంచ్ తప్పు చేస్తే, కేవలం అక్కడి మేనేజర్‌ను మాత్రమే కాకుండా ప్రధాన సంస్థ యజమానులను, డైరెక్టర్లను నేరస్తులుగా చేరుస్తూ కేసులు నమోదు చేయాలి. వినియోగదారులను తప్పుదారి పట్టించే బ్రాండ్ అంబాసిడర్లపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టంలో స్పష్టమైన నిబంధనలు చేర్చాలి. ఒక్కసారి కల్తీ రుజువైతే ఆ బ్రాండ్ పేరుతో రాష్ట్రంలో మరెక్కడా వ్యాపారం చేయకుండా శాశ్వత నిషేధం విధించాలి. పట్టుబడిన రసాయనాల తీవ్రతను బట్టి నేరసలకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా శిక్షాస్మృతిని సవరించాలి. కేవలం కఠిన చట్టాలు, ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రమే సమాజాన్ని పూర్తిగా మార్చలేవు. పౌరులు తమ వినియోగదారుల హక్కులను తెలుసుకుని క్రియాశీలంగా వ్యవహరించాలి. ఆకర్షణీయమైన రంగుల ప్రకటనలకు, అబద్ధపు వాగ్దానాలకు మోసపోకుండా వాస్తవాలను గ్రహించాలి. హోటల్ ఆహారంలో నాణ్యత లోపించినట్లు చిన్న అనుమానం వచ్చినా వెంటనే ఫుడ్ సేఫ్టీ పోర్టల్స్ ద్వారా అధికారులకు నేరుగా రిపోర్ట్ చేయాలి. న్యాయపరమైన పోరాటాలతో పాటు సామాజిక చైతన్యం అవసరం. కల్తీ ఆహారం బారిన పడకుండా ఉండాలంటే సహజసిద్ధమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలి.
(వ్యాసకర్త: న్యాయ నిపుణుడు)
డాక్టర్ కట్కూరి శ్రీనివాస్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

