రంగం ఏదైనా తెలంగాణే కేంద్రం. మౌలిక సదుపాయాలకైనా.. మానవ వనరులకైనా కొదవే లేదు. అందుకే మెడికల్ డివైజెస్, లైఫ్ సైన్సెస్ వంటి వైజ్ఞానిక రంగాల సంస్థలూ రాష్ట్రంలో కొలువుదీరుతున్నాయి. ఇందుకు హైదరాబాద్, దాని పరిసరాలు వేదిక అవుతుండగా, ఇప్పటికే ఇక్కడ ఉన్న ఔషధ పరిశ్రమలకు ఇది కలిసిరానున్నది.వ్యాపారాభివృద్ధి, పారిశ్రామిక విస్తరణలపై రాష్ట్ర ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ అద్భుతమైన ఫలితాల్నే ఇస్తున్నది. ఓవైపు యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కేలా.. మరోవైపు పెట్టుబడులను ఆకర్షించేలా సమర్థవంతమైన సంస్కరణలు తెస్తూ, వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ సర్కారు ముందుకుపోతున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 15: వైద్య పరికరాలు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో నూతన అధ్యాయం మొదలైంది. దేశీయ ఔషధ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న తెలంగాణ.. ఇప్పుడు మెడికల్ డివైజెస్, లైఫ్ సైన్సెస్ రంగాల్లోనూ సత్తా చాటింది. సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో విస్తరించిన దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌లో ఒకేసారి ఏడు సంస్థల ఉత్పాదక కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఈ ప్లాంట్లను ఆవిష్కరించారు. ఆ ఏడు సంస్థల వివరాల్లోకి వెళ్తే..
హువెల్ లైఫ్‌సైన్సెస్
హువెల్ లైఫ్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2015 ఫిబ్రవరి 10న ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ.. వైద్య ఉపకరణాలు, పరికరాలను తయారు చేస్తున్నది. వీటిలో ప్రధానంగా మోలెక్యులర్ డయాగ్నోస్టిక్, ల్యాటెరల్ ఫ్లో, ర్యాపిడ్ యాంటీజెన్, యాంటీబాడీ కిట్లను తయారు చేస్తున్నది. ఆర్టీపీసీఆర్ కిట్ల నిల్వ, రవాణాకు ఉపయోగపడే రూం టెంపరేచర్ స్టేబుల్ రీగ్నెంట్స్నూ ఉత్పత్తి చేస్తున్నది. వ్యాధి నిర్ధారణ, ఇతరత్రా ల్యాబ్ క్లినికల్ పరికరాలను సైతం రూపొందిస్తున్నది. దీని షేర్ క్యాపిటల్ రూ.1.05 కోట్లుగా ఉన్నది. పెయిడ్ అప్ క్యాపిటల్ రూ.44.5 లక్షలుగా ఉన్నది. కోకాపేట్, నార్సింగిల్లో ఈ సంస్థకు ఆఫీసులుఉన్నాయి.
ప్రోమియా
ప్రోమియా థెరపిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2017 జూలై 31న ప్రారంభించారు. ఈ హైదరాబాద్ ఆధారిత సంస్థ.. కృత్రిమ లేదా సింథటిక్ ఫిలమెంట్, నాన్-ఫిలమెంట్ ఫైబర్ల వంటి హ్యూమన్ మేడ్ ఫైబర్లను తయారు చేస్తున్నది. డయాగ్నోస్టిక్స్, నావల్ మెడికల్ డివైజెస్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ముఖ్యంగా ఇమ్యునోడయాగ్నోస్టిక్స్, మోలెక్యులర్ డయాగ్నోస్టిక్స్‌లో ప్రత్యేకతను కలిగి ఉన్నది. మొత్తంగా 100కుపైగా ఉత్పత్తులను తయారు చేస్తున్న ఈ సంస్థకు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ర్టాల్లో వ్యాపార కార్యకలాపాలున్నాయి. దీని షేర్ క్యాపిటల్ రూ.4 కోట్లు. పెయిడ్ అప్ క్యాపిటల్ రూ.3.86 కోట్లు.
ఎల్వికాన్
ఎల్వికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను 2017 మార్చి 14న ప్రారంభించారు. హైదరాబాద్‌లో నమోదైన ఈ సంస్థ.. ఆర్టిఫిషియల్, సింథటిక్ ఫిలమెంట్, నాన్-ఫిలమెంట్ ఫైబర్లను తయారు చేస్తున్నది. కస్టమ్ మేడ్ డెంటల్ ఇంప్లాంట్స్తోపాటు ఔషధాలు, రక్తం, ప్లాస్మా బ్యాగులు, వ్యాక్సిన్ల కోసం టెంపరేచర్ సెన్సార్లు, బ్రిడ్జెస్‌ను రూపొందిస్తున్నది. వివిధ వ్యాధుల నిర్ధారణ కోసం సరికొత్త టెక్నాలజీతో స్వీట్ సెన్సార్లనూ తెస్తున్నది. దీని షేర్ క్యాపిటల్ రూ.10 లక్షలు. పెయిడ్ అప్ క్యాపిటల్ లక్ష రూపాయలుగా ఉన్నది. ప్రముఖ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ సంస్థలకు సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్నది. కాంట్రాక్ట్ ఆధారిత రిసెర్చ్ సంస్థగా కూడా పనిచేస్తున్నది.
రీస్ మెడి లైఫ్
రీస్ మెడి లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2018 సెప్టెంబర్ 21న ప్రారంభించారు. హైదరాబాద్‌లో నమోదైన ఈ సంస్థ.. స్టెరిలైజ్డ్ గాయాల డ్రెస్సింగ్ కిట్లు, సర్జికల్ కిట్లు, స్టెరిలైజ్డ్ కన్జ్యూమబుల్స్ను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నది. ప్రీ-సర్జికల్ స్టెరిలైజేషన్ కిట్, పోస్ట్-సర్జికల్ గాయాల రక్షిత కిట్లనూ ఉత్పత్తి చేస్తున్నది. దీని షేర్ క్యాపిటల్ రూ.10 లక్షలు. పెయిడ్ అప్ క్యాపిటల్ రూ.10 లక్షలుగా ఉన్నది.
ఎస్వీపీ
ఎస్వీపీ టెక్నో ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2016 జూన్ 14న ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న ఈ సంస్థ.. సాంకేతిక, ఆటోమేషన్ ఉత్పత్తులను తయారు చేస్తున్నది. దీని షేర్ క్యాపిటల్ రూ.1.06 కోట్లు. పెయిడ్ అప్ క్యాపిటల్ రూ.1.05 కోట్లు. లీనియర్ మోషన్, ఆటోమేషన్ ఉత్పత్తుల్లో సంస్థకు దాదాపు ఆరేండ్ల అనుభవం ఉన్నది. ఈ రంగంలో అగ్రగామి సరఫరాదారుగా పేరున్నది. దవాఖాన బెడ్లు, డెంటల్ చైర్ అక్ట్యూటర్లు, రోబోలను ఉత్పత్తి చేస్తున్నది. వైద్య రంగానికి చౌక ధరలకే నాణ్యమైన పాసివ్ మోషన్ ఎక్విప్మెంట్, మెడికల్ బాతింగ్ సిస్టమ్, రోబోటిక్ గెయిట్ ట్రైనింగ్ సిస్టమ్ సేవలను అందించడానికి 2019లోనే తగిన సదుపాయాలనూ అభివృద్ధి చేసుకున్నది.
ఆకృతి
ఆకృతి సింప్లిఫైయింగ్ ఐ కేర్‌ను 2007లో ఏర్పాటు చేశారు. డాక్టర్ కుల్దీప్ రైజదా, దీపా రాణి నాయకత్వంలో సంస్థ నడుస్తున్నది. ప్రస్తుతం ఐ కేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆప్తాల్మిక్ ఎక్విప్మెంట్స్ అండ్ కన్జ్యూమబుల్స్ ఎగుమతి-దిగుమతులు, ఆక్యులోప్లాస్టీ, పీడియాట్రిక్ ఆప్తాల్మాలజీ, స్పోర్ట్స్ విజన్ థెరపీ, ఐ ప్రోస్టెసిస్ వంటి విభాగాల్లో సంస్థ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి. స్పెక్టాకిల్స్, ఇంప్లాంట్స్, షీల్డ్స్, ఐ బాక్స్, ఆక్లూడర్స్, ఫ్లిప్పర్స్, రీడింగ్ గ్లాస్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఆప్తాల్మాలజీ, ఆప్టికల్స్, దవాఖానల నిర్వహణ, వ్యాపారాభివృద్ధి, విద్య, ప్రింట్ మీడియా, నైపుణ్యాభివృద్ధి అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది. దీని 70వేల చదరపు అడుగుల్లోని ప్లాంట్‌లో హైటెక్ మెషీన్లు, 3డీ ప్రింటింగ్, రిసెర్చ్, డెవలప్మెంట్ సదుపాయాలున్నాయి.
ఆర్కా
ఆర్కా మెడికల్ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2017 డిసెంబర్ 11న ఏర్పాటు చేశారు. ఈ హైదరాబాద్ ఆధారిత సంస్థ.. కృత్రిమ, సింథటిక్ ఫిలమెంట్, నాన్-ఫిలమెంట్ ఫైబర్లను తయారు చేస్తున్నది. దీని షేర్ క్యాపిటల్ రూ.1.75 కోట్లు. పెయిడ్ అప్ క్యాపిటల్ రూ.1.5 కోట్లు. ఫార్మాస్యూటికల్స్, ల్యాబ్ ఇండస్ట్రీ అవసరాలను తీర్చే ఉత్పత్తులను ఈ కంపెనీ తయారు చేస్తూ మార్కెట్లో గుర్తింపును అందుకున్నది. డెంటల్ ఇంప్లాంట్స్, మ్యాగ్జిల్లోఫేషియల్ ఇంప్లాంట్లు, సర్జికల్ మోటర్స్, కస్టమ్ డిజైన్డ్ ప్రోస్తెసిస్, క్రానియల్ 3డీ-ప్లాంటింగ్ సిస్టమ్ సేవలతోపాటు బోన్ గ్రాఫ్ట్స్ల్లో రిసెర్చ్, డెవలప్మెంట్ను చేస్తున్నది. ఓ బయో-ఇన్నోవేషన్ ల్యాబ్‌గా సంస్థను నిలపడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది.