రెండేండ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తలపడ్డ రెండు జట్లు.. మరోసారి ఐసీసీ టోర్నీ నాకౌట్ దశలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. గ్రూప్ దశలో తొలి నాలుగు మ్యాచ్‌లు నెగ్గిన జట్టు ఒకటైతే.. తొలి మ్యాచ్ మినహా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు మరొకటి! హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది ఒకరైతే.. అండర్‌డాగ్స్‌గా అడుగుపెట్టింది మరొకరు! సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు నేడు ఇంగ్లండ్, న్యూజిలాండ్ సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అయ్యాయి!
అబుదాబి: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దంచుడే పరమావధిగా దూసుకెళ్తున్న ఇంగ్లండ్ జట్టు.. బుధవారం టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. గతంలో సంప్రదాయ క్రికెట్‌కు ఎక్కువ విలువిచ్చే ఇంగ్లిష్ జట్టు.. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్లలో భారీ స్కోర్లతో దుమ్మురేపుతున్నది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆ బాదుడే వాళ్లను బాద్షాను చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో స్థానం వరకు హిట్టర్లతో దట్టంగా ఉన్న ఇంగ్లండ్.. టీ20లో రెండోసారి చాంపియన్‌గా నిలువాలని చూస్తుంటే.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లిష్ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తున్నది.
పేపర్ మీద చూసుకుంటే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నా.. ఇంగ్లండ్‌ను గాయాల బెడద వేధిస్తున్నది. విధ్వంసక ఓపెనర్ జాసన్ రాయ్ గాయం కారణంగా మెగాటోర్నీకి దూరమవడంతో మోర్గాన్ సేనకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు నిలకడకు మారుపేరైన న్యూజిలాండ్ సంచలన ప్రదర్శనతో తుదిపోరుకు అర్హత సాధించాలని కంకణం కట్టుకుంది. గ్రూప్-1లో తొలి నాలుగు మ్యాచ్‌లు నెగ్గిన ఇంగ్లండ్.. ఆఖరి పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైతే.. గ్రూప్-2 మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ ఆనక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి సెమీస్‌కు చేరింది. ఈ నేపథ్యంలో అబుదాబి క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లండ్ టాపార్డర్‌కు కివీస్ బౌలింగ్ దళానికి మధ్య రసవత్తర పోరు నడవడం ఖాయంగా కనిపిస్తున్నది.
రాయ్ గైర్హాజరీలో బట్లర్‌తో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ఆరంభించడం దాదాపు ఖాయం కాగా.. సామ్ బిల్లింగ్స్ మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నాడు. మలన్, మోర్గాన్, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంటే.. గప్టిల్, విలియమ్సన్, కాన్వే, మిషెల్‌పై న్యూజిలాండ్ ఎక్కువ ఆధారపడుతున్నది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో కివీస్ స్పిన్ ద్వయం శాంట్నర్, సోధి ఇంగ్లిష్ ఆటగాళ్లకు ఎలా కళ్లెం వేస్తారో చూడాలి!
తుది జట్లు (అంచనా)
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), బట్లర్, బెయిర్‌స్టో, మలన్, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, బిల్లింగ్స్, వోక్స్, జోర్డాన్, రషీద్, వుడ్.న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మిషెల్, కాన్వే, ఫిలిప్స్, నీషమ్, శాంట్నర్,మిల్నే, సౌథీ, సోధి, బౌల్ట్.