“నటుడిగా ఆశిష్ నిలదొక్కుకోవాలన్నదే మా లక్ష్యం. యాక్టర్‌గా తనను ప్రేక్షకులు అంగీకరిస్తే, ఆ తర్వాత మంచి కథలతో సూపర్‌హిట్ అందుకోవచ్చు. మెప్పించలేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా అవుతుంది. అందుకే, ఆశిష్ మొదట యాక్టర్‌గా నిరూపించుకోవాలి. ‘రౌడీబాయ్స్’ ద్వారా ఆ లక్ష్యం నెరవేరడం ఆనందంగా ఉంది” అన్నారు ప్రముఖ నిర్మాత ‘దిల్’రాజు. నిర్మాతగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను అందించిన ‘దిల్’రాజు కుటుంబం నుంచి ‘రౌడీబాయ్స్’ చిత్రంతో హీరోగా అరంగ్రేటం చేశాడు ఆశిష్. ఈ చిత్రానికి వస్తున్న స్పందన గురించి నిర్మాత ‘దిల్’రాజుతో ప్రత్యేక ఇంటర్వ్యూ…
రౌడీబాయ్స్ విషయంలో మీ అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయి?
ఆశిష్‌ను సినీ రంగానికి పరిచయం చేయాలనే ఆలోచనతో తెరకెక్కించిన సినిమా ఇది. చూసిన వాళ్లంతా ఆశిష్ అభినయాన్ని ప్రశంసిస్తున్నారు. యూత్‌కు కనెక్ట్ అవుతున్నది. విడుదలైన రెండో వారంలో చక్కటి వసూళ్లను రాబడుతున్నది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేయడం సంతోషాన్ని కలిగిస్తున్నది.
విడుదలకు ముందే ప్రచార చిత్రాల్లో ఆశిష్ డ్యాన్సు, నటనకు మంచి పేరొచ్చింది. ఆ గుర్తింపు సినిమా విజయంలో ఎంతవరకు ఉపయోగపడింది?
సినిమా చూసిన తర్వాత ఆశిష్ గురించి ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. నటన, డ్యాన్సులో పరిణతి చూపించాడని చెప్పారు. ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ను బాగా పండించాడని మెచ్చుకున్నారు. పతాక ఘట్టాల్లో ఆశిష్ నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో హీరోయిజాన్ని పండించాడు.
కమర్షియల్ సినిమా ద్వారా ఆశిష్‌ను పరిచయం చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది?
ఆశిష్ కోసం తొలుత ‘పలుకే బంగారమాయనే’ పేరుతో ఓ కథ సిద్ధం చేయించా. నిర్మాతగా నా శైలి హంగులన్నీ అందులో ఉన్నాయి. కుటుంబ విలువలకు ప్రేమకథను మేళవించి రూపొందించాం. కానీ అలాంటి కథ తొలి సినిమాకు సరికాదనిపించింది. అన్ని ఎమోషన్స్‌నూ పండించే అవకాశం ఉండదనిపించింది. అందుకే ఆ కథను పక్కనపెట్టి ‘రౌడీబాయ్స్’ను ఎంచుకున్నాం.
మీ నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది హీరోలు, దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు. ఈ సినిమా విషయంలోఎలా ఫీలయ్యారు?
సినిమా తీసేటప్పుడు నిర్మాత కోణం నుంచే ఆలోచిస్తా. అయితే మా కుటుంబం నుంచి పరిచయం అవుతున్న హీరో కావడంతో మా బాధ్యత పెరిగింది. సినిమా విషయంలో తప్పులు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.
హీరో కావాలనుకుంటున్నట్టు ఆశిష్ మీతో ఎప్పుడు చెప్పాడు. అతనికి మీరిచ్చిన తొలి సలహా?
సినీ పరిశ్రమలో రాణించడం సులభంకాదని చెప్పాను. కష్టపడితేనే ఇండస్ట్రీలో స్థిరపడతావని సలహా ఇచ్చాను. ఇండస్ట్రీలో సక్సెస్ ముఖ్యం కాదు. నటుడిగా సుదీర్ఘకాలం నిలదొక్కుకోవాలి. అది సాధ్యమవ్వాలంటే ఎంతో శ్రమించాలి. సినీ పరిశ్రమలో టెస్ట్ మ్యాచ్‌లా ఆడాలి, కానీ టీట్వంటీలా ఆడతానంటే కుదరదు. ఇవన్నీ ఆశిష్‌కు చెప్పా.
కరోనా మహమ్మారితో పాటు ఓటీటీ ప్రభావం వల్ల ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు రప్పించడం ఓ సవాలుగా మారిందని అనుకుంటున్నారా?
తొలివారంలో ఈ సినిమా ఎనిమిదికోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కరోనా భయాల మధ్య కొత్త హీరో నటించిన సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం సులభంకాదు. సాధారణ పరిస్థితుల్లో అయితే పన్నెండు కోట్ల గ్రాస్ వచ్చుండేది. కరోనా వల్లే చాలా వసూళ్లు తగ్గాయి. అయినా సినిమా ఫలితం విషయంలో మేము సంతోషంగా ఉన్నాం.
రౌడీబాయ్స్ ప్రేక్షకుల్ని మెప్పించడానికి కారణం?
దర్శకుడు శ్రీహర్ష అందించిన కథ, కథనాలతో పాటు నాయకనాయికల క్యారెక్టరైజేషన్స్, దేవిశ్రీప్రసాద్ బాణీలు సినిమా విజయంలో కీలకభూమిక పోషించాయి. రెండున్నర గంటలు యువతరాన్ని మెప్పిస్తుంది. సినిమా నచ్చనివాళ్లూ ఉన్నారు. వారితో పోలిస్తే సినిమా నచ్చుతుందని చెబుతున్నవారే ఎక్కువ.
నటుడిగా ఆశిష్లోని ప్లస్‌లు ఏమిటి?
ఎలాంటి ఎమోషన్‌ను అయినా ఈజీగా పండిస్తాడు. కష్ట పడతాడు. నేర్చుకునేతత్వం ఎక్కువే. క్రమశిక్షణ, సమయ పాలనకు విలువ ఇస్తాడు.
ఓ నిర్మాతగా ఆశిష్‌కు మీ సలహా?
ఈ సినిమా పరంగా తనలో ఉన్న ప్లస్‌లు, మైనస్‌లు ఏమిటో చెప్పా. తదుపరి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టే ముందు మళ్లీ మాట్లాడుతా. వైవిధ్యమైన కథల్లో తనని చూడాలని ఉంది. ‘సెల్ఫిష్’ పేరుతో ఆశిష్‌తో తదుపరి సినిమా చేయబోతున్నాం. స్వార్థంతో ఆలోచించేవారు సమాజంలో చాలా మంది కనిపిస్తారు. అలాంటి గుణాలున్న ఓ యువకుడి కథ ఇది. అంతర్లీనంగా ప్రేమ, స్నేహంతో ముడిపడి సాగుతుంది. తనతో ఫ్యామిలీ ఎంటర్టైనర్, కమర్షియల్ సినిమాలు చేయాలనుంది.
తెలుగు చిత్రసీమలో అగ్రనిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రతి సినిమానూ తొలి చిత్రంగానే భావించి కష్టపడటం ఇంకా అవసరం అంటారా?
వందశాతం అవసరం. ఓ సినిమాపై విలువైన డబ్బు, కాలాన్ని వెచ్చిస్తాం. ప్రేక్షకులను మెప్పించాలనే నిరంతరం కష్టపడతాం. ప్రతిరోజూ అప్రమత్తంగా ఉండాలి. తేడా వస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారు. ప్రతి సినిమాకు ఆ కష్టం ఉంటుంది.
మీ వారసులుగా హర్షిత్, హన్షిత నిర్మాతలుగా అరంగేట్రం చేస్తున్నారు? మీ బ్యానర్ ద్వారా చేసే సినిమాల విషయంలో వాళ్ల భాగస్వామ్యం ఎంత ఉంటుంది?
హన్షిత, హర్షిత్, ఆశిష్, అంకిత్ చిత్ర నిర్మాణంపై దృష్టిపెడుతున్నారు. కొత్త కథలను వాళ్లనే వినమని చెబుతున్నా. వాళ్లకు నచ్చిన కథలకు సంబంధించి ఏదైనా సలహా అడిగితేనే ఇస్తుంటా. సినిమాల నిర్మాణం విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చా. వచ్చే రెండేళ్లలో మా వారసుల నుంచి నాలుగు సినిమాలు వస్తాయి. ఆ ఫలితాన్ని అనుసరించి పెద్ద దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తాం.
మీ తదుపరి చిత్రాలు?
వరుణ్‌తేజ్, వెంకటేశ్‌ల కలయికలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-3, రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రంతో పాటు.. నాగచైతన్యతో చేస్తున్న థ్యాంక్యూ చిత్రం కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
బాబాయ్ ధైర్యం నింపారు! – ఆశిష్
సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన ప్రతిచోట పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నది. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమలులో ఉన్నా ప్రేక్షకాదరణ మాత్రం బాగుంది. నాతో పాటు ప్రతి ఒక్కరి నటనా బాగుందని చెబుతున్నారు. నటన, డ్యాన్సుల పరంగా నేను ప్రతిభను చాటానని అంటున్నారు. చక్కటి భావోద్వేగాలను పలికించాననే గుర్తింపు రావడం సంతృప్తినిచ్చింది. నటుడిగా నన్ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో? ఫలితం ఎలా ఉంటుందోనని విడుదలకు ముందు చాలా టెన్షన్ పడ్డా. ఫస్ట్‌కాపీ చూసిన తర్వాత హీరోగా నువ్వు పాస్ అవుతావని బాబాయ్ దిల్‌రాజు నాలో ధైర్యాన్ని నింపారు. ఆ మాట నిజమైంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్యనున్న యువతీ యువకులు సినిమాతో కనెక్ట్ అవుతున్నారు. నా నటన విషయంలో ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా రావడం లేదు.
ఆ లెక్కలు తెలియవు..
హర్ష తొలుత నా దగ్గరకు వచ్చి ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇదని చెప్పారు. ఈ మధ్యే నేను కాలేజీ విద్యను పూర్తిచేసుకోవడంతో పాయింట్‌తో కనెక్ట్ అయ్యా. యువతరం ఆలోచన విధానం ఎలా ఉంటుందో నాకు అవగాహన ఉండటంతో పాత్రలో పూర్తిగా ఒదిగిపోయా. హీరోగా ఇదే నా మొదటి సినిమా. ఇండస్ట్రీ లెక్కలు నాకు తెలియదు. కేవలం కథను నమ్మి సినిమా చేశా. ప్రేక్షకులకు నచ్చితే చాలనుకున్నా. కానీ మా అంచనాలకు మించి విజయాన్ని సాధించింది.
అమ్మకు నచ్చింది
మొదటి రోజు సినిమా చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకున్నది. అమ్మకు నచ్చడం సంతోషాన్ని కలిగించింది. చిన్నతనం నుంచి నటన, డ్యాన్సుల పట్ల నాకున్న ఇష్టం, ఆసక్తి కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అందుకే వారు కొత్తదనంగా ఫీలవుతారో లేదో అనుకున్నా. కానీ అందరికీ సినిమా నచ్చడం సంతృప్తినిస్తున్నది. నటుడిగా నాకొచ్చిన పేరు చూసి నాన్న, బాబాయ్ సంతోషపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాలని ఈ సినిమాతో అర్థమైంది. ఎంచుకునే ప్రతి సినిమాలో నటన పరంగా వైవిధ్యాన్ని కనబరచాలని అర్థంచేసుకున్నా. వ్యక్తిగతంగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లను నేను ఇష్టపడతా. ఒకే జోనర్‌కు పరిమితమవ్వకుండా భిన్న కథాంశాలతో సినిమాలు చేస్తా.