హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో నేరాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ చిన్నారులపై జరుగుతున్న నేరాలు పెరుగుతున్నాయని కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నీరజ్వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రతకు సంబంధించిన సైబర్ నేరాల నియంత్రణలో చట్టపరమైన, వ్యవస్థాగత లోపాలను తొలగించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
‘క్రైమ్ ఇన్ ఇండియా-2024’ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం నేరాలు 10.8% తగ్గినప్పటికీ చిన్నారులపై జరుగుతున్న సైబర్ నేరాలు 46% పెరిగాయని వెల్లడించారు. వీటిలో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (సీఎస్ఏఎం) కేసులే 89% ఉన్నాయని, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో 96.6% మంది నిందితులు బాధితులకు తెలిసినవారేనని తెలిపారు. ఈ చట్టంలోని 4, 6 సెక్షన్ల కింద నమోదైన కేసుల బాధితుల్లో 98% మంది బాలికలేనని, వీరిలో 16-18 ఏండ్ల వయసువారు 53% మంది ఉన్నారని వివరించారు.
సైబర్ స్పేస్‌లో చిన్నారుల భద్రత, లైంగిక దోపిడీ నివారణ, బాలల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం లాంటి అంశాలపై హైదరాబాద్‌లో 2 రోజులపాటు జాతీయ న్యాయసేవాధికార సంస్థ (నల్సా), తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహించిన దక్షిణాది రాష్ర్టాల ప్రాంతీయ సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు నీరజ్వర్మతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూ ర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రసంగించారు.
దేశవ్యాప్తంగా ఉన్న 800 జిల్లాల్లో ప్రస్తుతం 441 చోట్ల మాత్రమే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని నీరజ్వర్మ పేర్కొంటూ.. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జాతీయ ప్రాధాన్యతగా ఉండాలని అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాల్లో 66.4% కేసులు 5 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని, దేశంలోని మొత్తం సైబర్ పోలీస్ స్టేషన్లలో 67% ఆ రాష్ర్టాల్లోనే ఉన్నాయని తెలిపారు. నిజమైన చిన్నారులు లేకుండా కృత్రిమ మేధస్సు (ఏఐ), డీప్ ఫేక్ సాంకేతికతతో నకిలీ లైంగిక చిత్రాలను రూపొందించడం కొత్త ముప్పుగా పరిణమించిందని పేర్కొంటూ.. ఇలాంటి చిత్రాలను కూడా సీఎస్ఏఎం నిర్వచనంలో చేర్చాలని, తద్వారా నిందితులను శిక్షించేందుకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు.
డిజిటల్ వేదికలు చిన్నారుల భద్రతకు బాధ్యత వహించేలా చట్టాలు తీసుకురావాలని, వయసుకు అనుగుణంగా కంటెంట్‌ను నియంత్రించేలా కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. నల్సా ఆధ్వర్యంలో సైబర్ ఫిర్యాదులకు సంబంధించిన అన్ని వ్యవస్థలను అనుసంధానించి జాతీయ స్థాయిలో ఒకే సైబర్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నేరాల కేసుల విచారణను నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు.