న్యూఢిల్లీ, అక్టోబర్ 18: వృద్ధులు యువకులుగా ఫీలవుతుంటే.. యువకులు, మధ్యవయస్కులు వృద్ధుల్లా తయారవుతున్నారు. ఈ విషయం తాజా సర్వేలో వెల్లడైంది. తక్కువ శక్తి, సాధారణ అలసట, బలహీన రోగనిరోధకశక్తి వల్ల 26-40 ఏండ్ల మధ్య వయసున్న వారిలో 46 శాతం, 18-25 ఏండ్ల మధ్య వయసున్నవారిలో 40శాతం మంది తమ అసలు వయసుకంటే ఎక్కువ వయసువారిలా ఫీల్ అవుతున్నారట. దీనికి విరుద్ధంగా 41 ఏండ్ల వయసుపైబడినవారు తాము అసలు వయసును లేదా యువకులుగా అనుభూతి చెందుతున్నారు.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలోని వెయ్యిమందిని సర్వే చేసిన బ్రిటన్‌లోని క్వాకర్, యూరోమానిటర్ ఇంటర్నేషనల్ నిపుణులు ఈ విషయాన్ని తేల్చారు. 41 ఏండ్ల పైబడినవారిలో 40 శాతం మంది ఒక్కరోజుకూడా బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్కావడంలేదని, అదే సమయంలో 18-25 ఏండ్ల వయసువారిలో 50శాతం, 26-40 ఏండ్ల వయసువారిలో 61 శాతం మంది అసలు అల్పాహారమే చేయడం లేదని గుర్తించారు. కరోనా తర్వాత సర్వేలో పాల్గొన్న అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగినట్టు కనుగొన్నారు.