అహ్మదాబాద్, అక్టోబర్ 7: శుద్ధీకరణ పేరుతో ఒక మహిళపై ఏడుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బీజేపీ పాలిత గుజరాత్లో వెలుగుచూసింది. ఈ ఘటన సురేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఒక మహిళను అప్పటికే పెండ్లయి భార్య ఉన్న ఒక వ్యక్తి వివాహం చేసుకుని, ఆమెను కట్టేసి బందీగా ఉంచేవాడు. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో ఇంటినుంచి పారిపోయింది. ఆమెను పట్టుకుని తీసుకువచ్చిన బంధువులు చెట్టుకు కట్టేసి కొట్టారు. శుద్ధీకరణ కార్యక్రమం పేరుతో ఆమెపై ఏడుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్పీ వేదికా బిహానీ తెలిపారు. కాగా, పెండ్లయిన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్నా, ఇతరులతో వెళ్లిపోయినా ఆమెకు ‘ప్రక్షాళన’ చేయడం కులాచారమని ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తెలిపారు.