Goa | గోవా అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అందులో ఉత్పల్ పర్రీకర్ పేరు మాత్రం లేదు. ఉత్పల్ పర్రీకర్ మాత్రం ఏమాత్రం తన పంతం నుంచి పక్కకు పోవడం లేదు. తాను పణాజి నుంచే బరిలోకి దిగుతానని భీష్మించుకు కూర్చున్నారు. అయితే బీజేపీ మాత్రం రెండు ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్ ఉత్పల్ తిరస్కరించారు. రెండో ఆప్షన్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావాన్ని బీజేపీ వ్యక్తం చేసింది.
అయితే మరి కొన్ని ప్రత్యామ్నాయాలను కూడా బీజేపీ అధిష్ఠానం ఉత్పల్ పర్రీకర్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. పార్టీలోని కొందరు సీనియర్లు ఈ విషయాన్ని పేర్కొంటున్నారు. ఒకవేళ ఈయన ఓడిపోయినా… పార్టీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆయన్ను పార్టీ నిర్మాణంలోకి తీసుకుంటామని, ఆ నిర్మాణంలో ఆయనకు కీలక బాధ్యతలే అప్పజెబుతామని అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2027 ను దృష్టిలో పెట్టుకొని, ఉత్పల్‌కు కీలక బాధ్యతలిస్తామని ఆయనకు హామీ ఇచ్చాం. ఇప్పటికీ మా మాట వింటాడన్న నమ్మకం మాత్రం ఉంది. ఆశలు ఇంకా కోల్పోలేదు అని బీజేపీ వర్గాలు అంటున్నాయి.