న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ జావేద్ హబీబ్.. ఓ కార్యక్రమంలో మహిళకు హెయిర్ కట్ చేస్తూ ఆమె జుట్టులో ఉమ్మిన ( Spit on Woman hair ) ఘటన తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జావేద్ హబీబ్ తీరుపై జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానాకు జాతీయ మహిళా కమిషన్ లేఖ కూడా రాసింది. ఘటనపై కేసు నమోదు చేయాలని, నిందితుడు జావేద్ హబీబ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. దీనిపై ముజఫర్నగర్ ఎస్పీ ఆర్పిత్ విజయ వర్గీయ స్పందించారు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులపై చర్యలు తీసుకుంటారని చెప్పారు.