అమృత్‌పాల్ అరెస్టు
సిక్కు వేర్పాటువాది, ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మార్చి 18 నుంచి పరారీలో ఉన్న అతడిని ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు పంజాబ్ పోలీస్ ఐజీ సుఖచైన్సింగ్ గిల్ తెలిపారు.
- బింద్రన్‌వాలే స్వగ్రామంలో పోలీసుల అదుపులోకి
- నెల తర్వాత చిక్కిన ఖలిస్థానీ వేర్పాటువాది
- అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలింపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: సిక్కు వేర్పాటువాది, ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మార్చి 18 నుంచి పరారీలో ఉన్న అతడిని ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు పంజాబ్ పోలీస్ ఐజీ సుఖచైన్సింగ్ గిల్ తెలిపారు. ఒకప్పటి ఖలిస్థాన్ ఉద్యమకారుడు, వేర్పాటువాది భింద్రన్‌వాలే సొంత గ్రామం మోగా జిల్లా రోడ్లోనే అమృత్‌పాల్ సింగ్ అరెస్టు కావటం గమనార్హం. రోడ్‌లోని గురుద్వారాలో అమృత్‌పాల్ ఉన్నట్టు సమాచారం రావటంతో ఆదివారం తెల్లవారుజామునే భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. గురుద్వారా నుంచి అమృత్‌పాల్ తప్పించుకోకుండా నాలుగువైపుల పోలీసులు చుట్టుముట్టడంతో తప్పించుకొనే మార్గం లేకపోయిందని గిల్ వెల్లడించారు. అమృత్‌పాలే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడన్న వార్తలను ఆయన ఖండించారు. ‘అతడు లొంగిపోలేదు.. మేమే అరెస్టు చేశాం’ అని స్పష్టం చేశారు. అమృత్‌పాల్‌ను అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. అతని అనుచరులు కూడా అదే జైల్లో ఉన్నారు.
నాటకీయ పరిణామాలు
అమృత్‌పాల్ సింగ్ అరెస్టుకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నట్టు సమాచారం. తామే అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్తున్నా.. మరో వాదన కూడా వినిపిస్తున్నది. అమృత్‌పాల్ శనివారమే రోడ్ గ్రామానికి చేరుకొన్నాడని బింద్రన్‌వాలే సోదరుడు, అకాల్‌తక్త్ మాజీ అధిపతి జస్బీర్ రోడ్ తెలిపారు. ‘సిక్కు సంప్రదాయ దుస్తులు ధరించి శనివారం రాత్రే అతడు గ్రామానికి చేరుకొన్నాడు. ఆదివారం ఉదయం గ్రామంలోని గురుద్వారాలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగించాడు. తాను ఎందుకు పరారీలో ఉండాల్సి వచ్చిందో గ్రామస్తులకు చెప్పాడు. ఆ తర్వాత గురుద్వారా బయటకు వెళ్లగానే పోలీసులు అరెస్టు చేశారు’ అని వెల్లడించారు. పోలీస్ ఐజీ గిల్ మాత్రం తప్పించుకొనే మార్గం లేకనే గురుద్వారా నుంచి అమృత్‌పాల్ బయటకు వచ్చాడని చెప్పారు. అమృత్‌పాల్ ఎక్కడ ఉన్నాడో తెలిసినా.. సిక్కులకు పరమ పవిత్రమైన గురుద్వారా లోపలికి పోలీసులు వెళ్లకుండా సంయమనం పాటించారని తెలిపారు. అరెస్టు సమయంలో స్థానికులు కూడా ఎలాంటి నిరసన తెలుపకుండా పోలీసులకు సహకరించారని పేర్కొన్నారు. అమృత్‌పాల్ అరెస్టుపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. సమాజంలో అలజడి సృష్టించాలని ప్రయత్నించినవారు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టంచేశారు.
ఎన్ఎస్ఏ కింద అరెస్టు
ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు అమృత్‌పాల్ సింగ్ అనుచరుడిని అరెస్టు చేశారు. అతడిని విడిపించుకొనేందుకు వేలమందితో కలిసివచ్చిన అమృత్‌పాల్.. పోలీస్ స్టేషన్‌పై దాడి చేశాడు. తల్వార్లు, తుపాకులతో భయోత్పాతం సృష్టించి తన అనుచరుడిని విడిపించుకొని వెళ్లాడు. దీంతో అతడిపేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఘటన తర్వాత అతడి కార్యకలాపాలపై దృష్టిపెట్టిన పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు.. అమృత్‌పాల్‌కు పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించాయి. పాకిస్థాన్ నుంచి ఆయుధాలు కూడా సేకరించినట్టు తేలింది. దీంతో అతన్ని అరెస్టు చేయటానికి పంజాబ్ పోలీసులు ప్రయత్నించటంతో మార్చి 18 నుంచి అమృత్‌పాల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మారువేషాలతో తిరుగుతున్నాడని, దేశం విడిచి పారిపోయాడని అనేక వదంతులు వచ్చినప్పటికీ ఒకప్పటి ఉగ్రవాది జర్నైల్‌సింగ్ బింద్రన్‌వాలే స్వగ్రామంలోనే అతడు పోలీసులకు పట్టుబడటం విశేషం. అమృత్‌పాల్‌పై అత్యంత కఠినమైన జాతీయ భద్రతా (ఎన్ఎస్ఏ) చట్టంతోపాటు 16 రకాల కేసులు నమోదయ్యాయి. ఎన్ఎస్ఏ కింద కేసు నమోదైతే ఏడాదిపాటు ఎలాంటి విచారణ లేకుండానే దేశంలోని ఏ జైల్లో అయినా నిర్బంధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. డిబ్రూగఢ్ జైల్లో ఉన్న 8 మంది అమృత్‌పాల్ అనుచరులపై కూడా ఎన్ఎస్ఏ కింద కేసులు నమోదయ్యాయి.
భార్య అరెస్టవుతుందన్న భయంతోనే?
అమృత్‌పాల్ సింగ్ తన భార్య కిరణ్దీప్కౌర్ను పోలీసులు అరెస్టుచేస్తారన్న భయంతో ఉన్నారని తెలుస్తున్నది. గత గురువారం ఆమె లండన్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎయిర్‌పోర్టులో గుర్తించి అడ్డుకున్నారు. ఆమెపై పోలీసులు నిఘా పెట్టడం అమృత్‌పాల్‌ను కలవరపెట్టిందని సమాచారం. అమృత్‌పాల్ నిధులను మళ్లించి లండన్‌లో దాచాడని, కిరణ్‌దీప్ అరెస్టు అయితే ఈ విషయం బయటపడుతుందనే ఆందోళన కూడా అతడిలో ఉందని పోలీసులు భావిస్తున్నారు. కిరణ్‌దీప్‌కౌర్ యూకే పౌరురాలు.ఆమె 180 రోజుల వీసాపై భారత్‌లో ఉన్నారు. జూలైలో ఆమె వీసా గడువు ముగిసేలోగా ఆమె యూకే వెళ్లాల్సి ఉన్నది.
ఎప్పుడేం జరిగింది?
- 2022 సెప్టెంబర్ 29: నటుడు దీప్ సిద్ధూ స్థాపించిన వారిస్ పంజాబ్ దేకు కొత్త నాయకుడిగా అమృత్‌పాల్‌సింగ్ ప్రకటించుకున్నాడు.
- 2023 ఫిబ్రవరి 17: ఓ కిడ్నాప్ కేసులో అమృత్‌పాల్ అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్ తుఫాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
- 2023 ఫిబ్రవరి 23: లవ్ప్రీత్ను విడుదల చేయాలని అమృత్‌పాల్, అతడి మద్దతుదారులు కత్తులు, తుపాకులతో అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి విధ్వంసం సృష్టించారు.
- 2023 ఫిబ్రవరి 24: జ్యుడీషియల్ కస్టడీ నుంచి లవ్‌ప్రీత్ విడుదలయ్యాడు.
- 2023 మార్చి 18: అమృత్‌పాల్, అతని అనుచరులను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. జలంధర్ వద్ద అతడి కాన్వాయ్‌ను ఆపగా అప్పటికే అమృత్‌పాల్ తప్పించుకున్నాడు. పంజాబ్ వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను పోలీసులు నిలిపివేశారు.
- 2023 ఏప్రిల్ 10: అమృత్‌పాల్ అనుచరుడు పపల్ప్రీత్ను పోలీసులు అమృత్‌సర్‌లో అరెస్టు చేశారు.
- 2023 ఏప్రిల్ 20: లండన్ వెళ్తున్న అమృత్‌పాల్ భార్య కిరణ్దీప్కౌర్ను అమృత్సర్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు.
- 2023, ఏప్రిల్ 23: మొగా జిల్లాలోని రోడ్ గ్రామంలో అమృత్‌పాల్ సింగ్ అరెస్టు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

