లక్నో: రైలు స్లీపర్ కోచ్‌లో వదిలేసిన పెట్టెలోని యువతి మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. ఒక యువకుడితో సంబంధం నేపథ్యంలో కుమార్తెను ఆమె తండ్రి హత్య చేసినట్లు నిర్ధారించారు. (Woman body in Box) మే 17న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతి నగర్ స్టేషన్లో ప్రయాణాన్ని ముగించిన ఎక్స్‌ప్రెస్ రైలు స్లీపర్ కోచ్‌లో వదిలేసిన ఇనుప పెట్టె, ఒక బ్యాగ్‌ను క్లీనింగ్ సిబ్బంది గుర్తించారు. రక్తం మరకలు ఉండటంతో అనుమానించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇనుప పెట్టె తాళం పగులగొట్టి చూడగా మహిళ మొండెం అందులో ఉన్నది. కాళ్లు, చేతుల భాగాలు మరో సంచిలో ఉన్నాయి.
కాగా, ఆ రైలు ప్రయాణించిన స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్‌ను రైల్వే పోలీసులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులను గుర్తించారు. మృతురాలైన 15 ఏళ్ల షబ్బాను ఆమె తండ్రి తన బంధువులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కుషినగర్‌కు చెందిన బిగ్గన్ అన్సారీ, అతడి సోదరి నూర్జహాన్, బావ ముజిబుల్లాను అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించి హత్యా వివరాలను పోలీసులు తెలుసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మరో వర్గం అబ్బాయితో కుమార్తె షబ్బా ఫోన్లో మాట్లాడటాన్ని తండ్రి అన్నారీ గమనించాడు. ఆమెను హెచ్చరించినా అతడితో సంబంధాన్ని కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇద్దరు కుమార్తెల మాదిరిగా చిన్న కుమార్తె షబ్బా కూడా చేస్తుందని అన్నారీ అనుమానించాడు. సమాజంలో గౌరవాన్ని కోల్పోతానన్న భయంతో ఆమె హత్యకు కుట్ర పన్నాడు. తన భార్య, ఇద్దరు కుమారులను బంధువుల ఇంటికి పంపాడు.
కాగా, మే 16న సోదరి నూర్జహాన్, బావ ముజిబుల్లాతో కలిసి కూతురు షబ్బాను తండ్రి అన్సారీ హత్య చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి తలను గ్రామ చెరువులో పడేసినట్లు చెప్పారు. మెండెంను ఇనుప పెట్టెలో, నరికిన కాళ్లు , చేతులను మరో సంచిలో ప్యాక్ చేశారని వివరించారు.
ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆ పెట్టె, సంచితో సహా ఇంటి నుంచి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కుషినగర్‌లోని తమ్కుహి రోడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రైలులోని స్లీపర్ కోచ్‌లోకి ఎక్కి పెట్టె, సంచిని ఒక బెర్త్ కింద వదిలేసినట్లు చెప్పారు. అనుమానం రాకుండా పక్కనే ఉన్న ఏసీ కోచ్ నుంచి వారు దిగినట్లు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.