ముంబై : ఓ పసికందును లాక్కెళ్లేందుకు కోతి యత్నించింది. పాప తలకు గాయాలయ్యాయి. తల్లి అప్రమత్తంగా ఉండటంతో ఆ కోతి బారి నుంచి తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ఈ ఘటన మహారాష్ట్ర థానే సిటీలోని షిల్ డైఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఓ మహిళ తన నెల రోజుల ఆడ శిశువుతో షిల్ డైఘర్ పోలీసు స్టేషన్కు ఆదివారం వచ్చింది. పోలీసు స్టేషన్ బయట ఉన్న కోతి.. పసిపాపను చూసింది. ఇంకేముంది మెల్లగా పోలీసు స్టేషన్ ఆవరణలోకి వచ్చిన కోతి, పాపను లాక్కెళ్లేందుకు యత్నించింది. అప్రమత్తమైన తల్లి తన బిడ్డను కోతి దాడి నుంచి తప్పించుకుంది. పాపకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పసిపాప తలకు ఐదు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం పసిబిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు కోతిని బంధించి, సమీప అడవుల్లో వదిలేశారు.