Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. తల లేకుండా ఉన్న ఒక బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక హత్య దాదాపు వారం రోజుల క్రితం జరిగిందని పోలీసులు తేల్చారు. మధ్యప్రదేశ్, రాజ్‌గఢ్ జిల్లాలో సెప్టెంబర్ 30న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలివి. 17 ఏళ్ల ఒక బాలిక జామోనియా గణేష్ అనే గ్రామానికి చెందిన అంకిత్ మాల్వియాతో ప్రేమలో ఉంది. సెప్టెంబర్ 30న ఆ బాలిక కరేడి నుంచి అంకిత్‌ను కలవడానికి రాజ్‌గఢ్ వచ్చింది.
ఇద్దరూ అక్కడ కలుసుకుని, బయోరా అనే అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. దీంతో అంకిత్ బాలికను హత్య చేశాడు. అనంతరం ఒక రంపంతో ఆమె తలను కోసి, మొండెం నుంచి వేరు చేశాడు. తర్వాత ఈ విషయాన్ని తన బంధువుకు కాల్ చేసి చెప్పాడు. హత్య అనంతరం అంకిత్ అక్కడ్నుంచి వేగంగా బైకుపై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడు నడుపుతున్న బైకు మరో వాహనాన్ని ఢీకొన్న ఘటనలో అంకిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదే సమయంలో బాలిక కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ప్రియుడి విషయం బయటపడింది. అయితే, అతడు అప్పటికే మరణించాడు. దీంతో అతడి ఫోన్ కాల్స్ వివరాలు ఆరా తీయగా.. ఘటన జరిగిన సమయంలో అంకిత్ తన బంధువుకు అనేకసార్లు కాల్స్ చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అంకిత్ ఆ యువతిని అడవిలో హత్య చేసినట్లు తేలింది. అతడు చెప్పిన వివరాల ఆధారంగా అడవిలో వెతకగా.. బాలిక మృతదేహం లభ్యమైంది. తల లేని మొండెం మాత్రమే కనిపించింది. కొంత దూరంలో తల భాగం లభ్యమైంది. అది నిర్మానుష్య అడవి కావడంతో ఎవరూ గుర్తించలేకపోయారు.
బాలిక మృతదేహం చాలా వరకు కుళ్లిపోయింది. ఇక, తలభాగం పూర్తిగా కుళ్లిపోయి, పుర్రె మాత్రమే మిగిలింది. బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే, బాలికను అంకిత్ ఎందుకు హత్య చేశాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.