cloudburst : ఉత్తర కాశ్మీర్లోని పలు ప్రాంతాలను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడి బందిపోరా జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో కుంభవృష్టి కురుస్తోంది. గురేజ్ కంట్రోల్ పరిధి, తులైల్ వ్యాలీలో ఉన్న తార్టెయి కిలో అనే గ్రామంలో బుధవారం ఉన్నట్లుండి కుండపోత వర్షం కురిసింది. మేఘ విస్ఫోటనం కారణంగా ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం నమోదైంది.
దీంతో స్తానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ఆగకుండా కురుస్తున్న ఈ వర్షం కారణంగా అక్కడ వరదలాంటి పరిస్థితి ఏర్పడింది. పైగా అనూహ్య వర్షం కావడంతో వర్షం నీటికి వ్యర్థపదార్థాలు కొట్టుకుపోతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లపై పేరుకుపోయాయి. పలు చెట్లు కూలిపోగా, పదుల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమయ్యాయి. వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు నీట మునిగాయి. ఈ వర్షం కారణంగా ఆందోళన చెందిన పిల్లలతోసహా స్తానికులు ఇండ్లను విడిచిపెట్టి సురక్షిత, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిపోయారు. కొందరు తమ పెంపుడు జంతువుల్ని కూడా వెంట తీసుకుని వెళ్లారు. అయితే, ప్రస్తుతానికి ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించారు. అయితే, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కుంభవృష్టి కురవడం సాధారణం. ఇటీవలి కాలంలో ఇది ఐదోసారి. గత జూన్ 4న బతోయ్ పర్వత ప్రాంతంలో కూడా కుండపోత వర్షం కురిసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఇలా అనేక చోట్ల కుంభవృష్టి కురిసింది. అయితే, ఈ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.